సుందర్ రామన్ ఉద్యోగి మాత్రమే: బీసీసీఐ
న్యూఢిల్లీ: వివాదాస్పద ఐపీఎల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ) సుందర్ రామన్ బీసీసీఐలో కేవలం ఉద్యోగి మాత్రమేనని బోర్డు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. నిర్ణయాలు తీసుకునే హక్కు ఆయనకు లేదని చెప్పారు. ‘ప్రస్తుతానికి రామన్‌కు వ్యతిరేకంగా ఎలాంటి తీర్పు రాలేదు. మేం బాధ్యతలు తీసుకునే నాటికి ఆయనతో పాటు చెన్నై, రాజస్తాన్ ఫ్రాంచైజీలపై విచారణ జరుగుతోంది. కాబట్టి లోధా కమిటీ నిర్ణయం కోసం వేచి చూస్తున్నాం. అది వచ్చిన తర్వాత పరిస్థితిని బట్టి దాన్ని అమలు చేస్తాం. తొందరపడి అతనికి వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయం తీసుకోదల్చుకోలేదు. రామన్ కేవలం ఉద్యోగి మాత్రమే. నిర్ణయాలు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ తీసుకుంటుంది. సభ్యులు తీసుకున్న నిర్ణయాన్ని ఉద్యోగులు అమలు మాత్రమే చేస్తారు’ అని ఠాకూర్ పేర్కొన్నారు. వర్కింగ్ గ్రూప్ నివేదిక వచ్చే వరకు చెన్నై, రాజస్తాన్ ఫ్రాంచైజీలపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోమని ఠాకూర్ పునరుద్ఘాటించారు.