IPL team
-
మళ్లీ హెడ్‌కోచ్‌గా రవిశాస్త్రి?
టీమిండియా మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను మరోసారి ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. అయితే, ఇందులో ఓ ట్విస్టు ఉంది.భారత మాజీ క్రికెటర్ రవిశాస్త్రి 2017- 2021 మధ్య టీమిండియా హెడ్ కోచ్‌గా పనిచేశాడు. అతడి మార్గదర్శనంలో.. విరాట్ కోహ్లి కెప్టెన్సీలో భారత జట్టు పలు చిరస్మరణీయ విజయాలు సాధించింది. ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్ గెలవడంసహా నంబర్ వన్ జట్టుగా ఎదిగింది.అయితే, వీరిద్దరి కాంబినేషన్లో ఒక్క ఐసీసీ టైటిల్ కూడా నెగ్గలేకపోయింది టీమిండియా. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్-2021 తర్వాత రవిశాస్త్రి పదవీకాలం ముగియగా.. కెప్టెన్‌గా విరాట్ కోహ్లి యుగానికి తెరపడింది. ఈ క్రమంలో కోహ్లి రోహిత్ శర్మ సారథ్యంలో ఆటగాడిగా కొనసాగుతుండగా.. రవిశాస్త్రి తిరిగి కామెంటేటర్‌గా మారాడు.ఈ నేపథ్యంలో తాజాగా రవిచంద్రన్ అశ్విన్‌తో మాట్లాడుతూ రవిశాస్త్రి.. హెడ్‌కోచ్‌గా పనిచేయడంపై తనకున్న ఆసక్తిని వివరించాడు. భవిష్యత్తులో తాను ఐపీఎల్ జట్టు కోచ్‌గా పనిచేసే అవకాశాలను కొట్టిపారేయలేనని తెలిపాడు.భారత్‌లో ఎంతో మంది ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లు ఉన్నారని.. వారిని మెరికల్లా తీర్చిదిద్దే అవకాశం తనకు వస్తే కచ్చితంగా మళ్లీ కోచ్‌గా మారతానని రవిశాస్త్రి సంకేతాలు ఇచ్చాడు. ఇప్పటికే సూపర్ స్టార్లుగా ఎదిగిన వారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని.. అయితే, కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించేందుకు తనకు ఛాన్స్ వస్తే అస్సలు వదులుకోనని స్పష్టం చేశాడు.ఏడేళ్లు టీమిండియాతో పనిచేసిన తర్వాత .. తిరిగి కామెంటేటర్‌గా బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉందన్న రవిశాస్త్రి.. తదుపరి ఐపీఎల్ కోచ్‌గా మారేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలియజేశాడు. కాగా రవిశాస్త్రి తర్వాత టీమిండియా హెడ్‌కోచ్‌గా పనిచేసిన రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగియడంతో బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో రవిశాస్త్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
IPL 2024: గుజరాత్ కెప్టెన్‌గా గిల్
న్యూఢిల్లీ: భారత ఓపెనర్, కెరీర్లో మంచి ఫామ్‌తో దూసుకుపోతున్న శుబ్‌మన్ గిల్‌కు మరో మంచి అవకాశం లభించింది. ఐపీఎల్ జట్టు గుజరాత్ టైటాన్స్‌కు అతను కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్‌కు వెళ్లిపోవడంతో అతని స్థానంలో గిల్‌ను సారథిగా నియమిస్తున్నట్లు టైటాన్స్ మేనేజ్మెంట్ ప్రకటించింది. ‘గిల్ తన కెరీర్లో మంచి ఎదుగుదలను చూపించాడు. గత రెండేళ్లుగా అతను అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు. అతనిలో మంచి నాయకత్వ లక్షణాలను కూడా టీమ్ మేనేజ్మెంట్ చూసింది. గిల్ నాయకత్వంలో మా జట్టు మరిన్ని మంచి ఫలితాలు సాధిస్తుందనే నమ్మకం ఉంది’ అని గుజరాత్ టీమ్ డైరెక్టర్ విక్రమ్ సోలంకి వెల్లడించారు. 24 ఏళ్ల గిల్ ఐపీఎల్ కెరీర్ 2018లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మొదలైంది. నాలుగేళ్లు ఆడిన తర్వాత ఆ జట్టు గిల్‌ను వదులుకుంది. 2022 సీజన్‌కు ముందు జరిగిన వేలంలో గుజరాత్ టైటాన్స్ గిల్‌ను సొంతం చేసుకుంది. తొలి సీజన్లో 16 మ్యాచ్‌లలో 483 పరుగులు చేసిన అతను ఫైనల్లో కీలకమైన 45 పరుగులు సాధించి జట్టు విజయంలో తనదైన పాత్ర పోషించాడు. అయితే తర్వాతి సీజన్లో గిల్ చెలరేగిపోయాడు. 3 సెంచరీలు సహా ఏకంగా 893 పరుగులు సాధించాడు. గత ఐదేళ్ల ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో గిల్ టాప్–5లో ఉన్నాడు. విలియమ్సన్, రషీద్, మిల్లర్, వేడ్, షమీలాంటి అనుభవజు్ఞలైన ఆటగాళ్లతో కూడిన జట్టును గిల్ నడిపించాల్సి ఉంది. గతంలో దేశవాళీ క్రికెట్లో దులీప్ ట్రోఫీ, దేవధర్ ట్రోఫీలలో కెప్టెన్‌గా వ్యవహరించిన అనుభవం గిల్‌కు ఉంది. మరో వైపు హార్దిక్ పాండ్యా 2015 వేలం సమయంలో తొలిసారి తన పేరు వచి్చనప్పుడు, ముంబై ఇండియన్స్ తనను రూ. 10 లక్షలకు సొంతం చేసుకున్న వీడియోను పోస్ట్ చేస్తూ ‘ఎన్నో చిరస్మరణీయ జ్ఞాపకాలు కదలాడుతున్నాయి. ముంబై..వాంఖెడే..పల్టన్...చాలా బాగుంది. సొంతింటికి తిరిగి వచి్చనట్లుగా ఉంది’ అని వ్యాఖ్య జోడించాడు. -
స్టార్ క్రికెటర్ కోహ్లీ పార్టనర్, ఈ బిలియనీర్ గురించి తెలుసా? నెట్‌వర్త్ ఎంతంటే?
భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఆటగాడిగానే కాదు దేశవ్యాప్తంగా అనేక వ్యాపారాలు, స్టార్టప్స్‌లో పెట్టుబడుల ద్వారా రాణిస్తున్నాడు. కోహ్లి ముఖ్యమైన వ్యాపార భాగస్వాములలో ఒకరు. బిలియనీర్ గురించి తెలుసా మీకు. ప్రత్యర్థి ఐపీఎల్ టీం ఓనరుతో కోహ్లి మధ్య వ్యాపార సంబంధాలు ఏంటో ఒకసారి చూద్దాం! ఆయన ఎవరోకాదు రూ. 7,090 కోట్ల ఐపీఎల్ టీం ఎల్ఎస్జీ ఓనర్ సంజీవ్ గొయెంకా దేశీయ దిగ్గజం కంపెనీ మల్టీ బిలియన్డాలర్ల విలువైన ఆర్పీ గోయెంకా గ్రూప్ చైర్మన్ కూడా. ఈ కంపెనీ పవర్, ఎనర్జీ, ఎఫ్ఎంసీజీ మీడియా, ఎంటర్టైన్మెంట్, విద్య వంటి అనేక పరిశ్రమలలో విస్తరించి ఉంది. ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ప్రత్యర్థి జట్టు ఎల్ఎస్జీ ఓనర్ సంజీవ్ గోయంకాతో అనేక వ్యాపారాల్లో జతకట్టడంతో పాటు ఇతర భాగస్వామ్యాలు కూడా ఉన్నాయి. (నెలకు లక్షన్నర జీతం: యాపిల్ ఫోనూ వద్దు, కారూ వద్దు, ఎందుకు? వైరల్ ట్వీట్) 2017నుంచి కోహ్లీ ఫౌండేషన్, ఆర్పీసంజీవ్ ఇండియన్ స్పోర్ట్స్ ఆనర్స్ అవార్డ్స్ కోసంవిరాట్,సంజీవ్ జత కట్టారు. అలాగే పలు వ్యాపార వెంచర్లలో కీలక భాగస్వాములుగా ఉన్నారు. అంతేకాదు కోహ్లీ, గోయంకా ద్వయం సెలబ్రిటీ గోల్ఫ్ టోర్నమెంట్ కూడా నిర్వహించడం విశేషం దీంతో దాదాపు రూ. 50వేల కోట్ల ఆస్తి, రూ. 35,451 కోట్ల స్థిరమైన ఆదాయంతో ఆలరారుతున్న సంజీవ్ గోయెంకా ఆర్పీఎస్జీ గ్రూప్ నేతృత్వంలోని ప్రముఖ స్నాకింగ్ బ్రాండ్ ‘టూ యమ్’కి బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా విరాట్ కోహ్లీ ఉండటం గమనార్హం. (ఒకప్పుడు రెస్టారెంట్లో పని:.. ఇప్పుడు లక్షల కోట్ల టెక్ కంపెనీ సీఈవో) దీంతో పాటు ఐఎస్ఎల్ ఫుట్‌బాల్ జట్టు , ఏటీకే మోహన్ బగాన్ ఫుడ్ బాల్ క్లబ్ ఓనరు కూడా .2023 నాటికి, ఆర్పీఎస్జీ గ్రూప్ గ్రూప్ ఆదాయం 4.3 బిలియన్ల డాలర్లకు పైమాటే. అంటూ దాదాపు రూ. 35,451 కోట్లకు పైనే. ఫోర్బ్స్ ప్రకారం, సంజీవ్ గోయెంకా వ్యక్తిగత నికర విలువ రూ. 17,300 కోట్లు. ఫోర్బ్స్ 2022 నివేదిక ప్రకారం భారతదేశంలో 83వ అత్యంత సంపన్నుడు, మొత్తం ప్రపంచంలో 1238వ స్థానంలో ఉన్నారు. సంజీవ్ గోయెంకా ఎక్కడ పుట్టారు 1961, జనవరి 29న పశ్చిమ బెంగాల్, కోల్‌కతాలో వ్యాపారవేత్త రామ ప్రసాద్ గోయెంకా, సుశీలా దేవి దంపతులకు జన్మించారు. -
బట్లర్ జట్టులో విధ్వంసకర వీరులకు దక్కని చోటు
లండన్: ఇంగ్లండ్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్, రాజస్థాన్ రాయల్స్ స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్ ఐపీఎల్ ఆల్ టైమ్ బెస్ట్ ఎలెవెన్‌ను ఎంపిక చేశాడు. ఈ జట్టులో తనతో పాటు టీమిండియా స్టార్ ఓపెనర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మను మరో ఓపెనర్‌గా ప్రకటించాడు. అయితే బట్లర్ ఎంపిక చేసిన జట్టులో విధ్వంసకర వీరులైన గేల్, వార్నర్, ధవన్‌లకు చోటు దక్కకపోవడం గమనార్హం. వీరితో పాటు అతను మిస్టర్ ఐపీఎల్ రైనాను కూడా పక్కన పెట్టాడు. మిడిలార్డర్లో టీమిండియా కెప్టెన్, ఆర్సీబీ సారధి విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్, సీఎస్కే సారధి ధోనీలను తీసుకున్నాడు. ధోనీని ఆరాధ్య క్రికెటర్‌గా భావించే బట్లర్.. వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్‌గా ఎంచుకున్నాడు. ఇక ఆటకు దూరంగా ఉన్న మిస్టర్ 360 ఆటగాడు డివిలియర్స్‌ను ఎంపిక చేయడాన్ని ఆయన సమర్ధించుకున్నాడు. ఆల్‌రౌండర్ల కోటాలో విండీస్ విధ్వంసకర యోధుడు పోలార్డ్, రవీంద్ర జడేజాలను ఎంపిక చేశాడు. ఇక బౌలింగ్ విషయానికొస్తే.. పేస్ విభాగాన్ని భారత పేసు గుర్రం బుమ్రా, భువనేశ్వర్ కుమార్, లసిత్ మలింగాలతో భర్తీ చేశాడు. ఈ ముగ్గురు కొత్త బంతిని స్వింగ్ చేయడంతో పాటు డెత్ ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంలో సమర్ధులని వీరి వైపు మొగ్గు చూపానన్నాడు. స్పిన్ విభాగంలో జడేజాకు తోడుగా హర్భజన్ సింగ్‌ను ఎంపిక చేసుకున్నాడు. క్యాష్ రిచ్ లీగ్‌లో 150కి పైగా వికెట్లు తీసిన హర్భజన్ అనుభవం జట్టుకు కలిసొస్తుందని ఆయన అభిప్రాయపడ్డాడు. జట్టు వివరాలు: జోస్ బట్లర్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్, ఎంఎస్ ధోనీ(కీపర్), కీరన్ పొలార్డ్, రవీంద్ర జడేజా, హర్భజన్ సింగ్, భువనేశ్వర్ కుమార్, బుమ్రా, లసిత్ మలింగా. చదవండి: కరోనా కాటుకు మాజీ క్రికెటర్ బలి -
సన్ ‘రైజ్’ అవుతుందా..!
ఐపీఎల్లో మిగిలిన చాలా జట్లతో పోలిస్తే హైదరాబాద్ సన్‌రైజర్స్‌కు అభిమానుల సంఖ్య తక్కువ. చెన్నై, ముంబైలాంటి జట్లతో పోలిస్తే హైదరాబాద్ కోసం ఆసక్తిగా ఎదురుచూసే వారి సంఖ్యా తక్కువే. దీనికి ప్రధానంగా రెండు కారణాలు. ఒకటి... స్టేడియానికి అభిమానులను భారీగా రప్పించే భారత స్టార్ క్రికెటర్ లేకపోవడం. రెండు... ఆట పరంగా అద్భుతాలు చేయకపోవడం. ఈసారి సీజన్లో యువరాజ్ సింగ్‌ను తీసుకోవడం వల్ల తొలి సమస్యను దాదాపుగా అధిగమించారు. మరి మైదానంలో ఏం చేస్తారనేదే అసలు ప్రశ్న. సాక్షి క్రీడావిభాగం:- రెండు తెలుగు రాష్ట్రాల అభిమానులకూ కలిపి హైదరాబాద్ సన్‌రైజర్స్ ఒకటే ఐపీఎల్ జట్టు. కాబట్టి అభిమానుల సంఖ్య భారీగా ఉండాలి. కానీ కచ్చితంగా మా జట్టే గెలవాలని కోరుకునేలా... విధేయంగా ఉండే అభిమానుల సంఖ్య మాత్రం ఆ స్థాయిలో లేదు. 2013లో ఈ జట్టు లీగ్‌లో అడుగుపెట్టినప్పటి నుంచీ ఇప్పటివరకూ స్టేడియానికి ఫ్యాన్స్‌ను రప్పించే స్టార్ లేకపోవడం లోటు. ఎంతమంది విదేశీ స్టార్స్ ఉన్నా.. కచ్చితంగా భారత జట్టులోని స్టార్ క్రికెటర్ ఉంటేనే అభిమానులు చూస్తారు. శిఖర్ ధావన్ రూపంలో భారత ఓపెనర్ జట్టులో ఉన్నా... మైదానానికి జనాలను రప్పించే స్థాయి అతనికి లేదనేది వాస్తవం. ధోని, కోహ్లి, గేల్, సెహ్వాగ్, డివిలియర్స్ లాంటి వారి స్థాయిలో కాకపోయినా ఒక పెద్ద క్రికెటర్ జట్టులో ఉండాల్సింది. ఈ లోటును ఈ ఏడాది సన్‌రైజర్స్ కొంతవరకు పూడ్చుకుంది. యువరాజ్ సింగ్‌ను తీసుకోవడం ద్వారా అభిమానులకు చేరువయ్యే అవకాశం లభించింది. కాబట్టి ఒక పెద్ద సమస్య తీరింది. స్థానిక ఆటగాళ్లకు పెద్దగా తుది జట్టులో అవకాశాలు ఇవ్వకపోవడం కూడా ఈ జట్టు మీద ఉన్న పెద్ద ఫిర్యాదు. ప్రదర్శన అంతంత మాత్రం 2008లో ఐపీఎల్ మొదలైన తొలి ఏడాదే హేమాహేమీల్లాంటి ఆటగాళ్లతో డెక్కన్ చార్జర్స్ జట్టు ఏర్పడింది. హైదరాబాద్‌కు చెందిన ఈ జట్టు2009లో విజేతగా నిలిచినా ఆ తర్వాత చాలా పేలవ ప్రదర్శనతో లీగ్‌లో కొనసాగింది. 2012 తర్వాత డెక్కన్ చార్జర్స్ జట్టు స్థానంలో సన్‌రైజర్స్ వచ్చింది. 2013లో తొలి ఏడాది ప్లే ఆఫ్ దశకు వెళ్లింది. దీంతో ఫర్వాలేదనిపించినా... వరుసగా రెండేళ్ల పాటు ఎనిమిది జట్ల లీగ్‌లో ఆరో స్థానంలో నిలిచి నిరాశపరిచింది. వైవిధ్యమైన ఎంపిక మిగిలిన జట్లతో పోలిస్తే ఐపీఎల్ వేలంలో హైదరాబాద్ ఆటగాళ్లను ఎంచుకునే విధానం చాలా వైవిధ్యంగా ఉంటుంది. స్టెయిన్‌లాంటి స్టార్ బౌలర్ జట్టులో ఉన్నా బౌల్ట్ (న్యూజిలాండ్)ను భారీ మొత్తం ఇచ్చి గత ఏడాది తీసుకొచ్చారు. అలాగే అవసరాన్ని మించి ఫాస్ట్ బౌలర్లతో జట్టును నింపారు. గత ఏడాదినే ఉదాహరణగా తీసుకుంటే... భువనేశ్వర్, ఇషాంత్, ప్రవీణ్ కుమార్, బౌల్ట్, స్టెయిన్, ఇర్ఫాన్ పఠాన్, ప్రశాంత్‌ల రూపంలో ఏడుగురు పేసర్లపై డబ్బులు వెచ్చించారు. టి20 క్రికెట్లో భారత పిచ్‌లపై తుది జట్టులో ఇద్దరు లేదా ముగ్గురు పేసర్లు ఉంటే చాలు. కానీ ఇంత మందికి ఎందుకు డబ్బు పెట్టారో తెలియని పరిస్థితి. వేలంలోనే నిర్దిష్టమైన ప్రణాళిక లేకుండా ఆటగాళ్లను తీసుకోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. ఈసారి కూడా... ఈసారి ఐపీఎల్ వేలానికి ముందు స్టెయిన్, ఇర్ఫాన్లను జట్టు వదిలేసింది. వేలంలో మంచి బ్యాట్స్‌మెన్ కోసం చూస్తారనుకుంటే ఈసారి ఆశ్చర్యకరంగా ఎడమచేతి వాటం పేసర్ల మీద డబ్బు ఖర్చు చేశారు. ఇప్పటికే జట్టులో బౌల్ట్ ఎడమచేతి వాటం పేసర్. ఈసారి కొత్తగా ఆశిష్ నెహ్రా, ముస్తాఫిజుర్ రెహమాన్ (బంగ్లాదేశ్), బరిందర్ శరణ్‌లను తెచ్చారు. నలుగురు ఎడమచేతి వాటం బౌలర్లు జట్టులో ఎందుకున్నారో తెలియదు. అన్నట్లు బ్యాటింగ్‌లోనూ ఎడమచేతి వాటం స్టార్సే ఎక్కువ. డేవిడ్ వార్నర్, శిఖర్ ధావన్, యువరాజ్, ఇయాన్ మోర్గాన్లతో పాటు జట్టులో కచ్చితంగా ఉండే ఆల్‌రౌండర్ కరణ్ శర్మ కూడా ఎడమచేతి వాటం ఆటగాడే. కూర్పు ఎలా ఉందంటే... యువరాజ్, ధావన్ జట్టులో ఉన్నా.. దేశవాళీ బ్యాట్స్‌మెన్ విషయంలో ఇంకా కొంత లోటు కనిపిస్తోంది. రికీ భుయ్, తిరుమలశెట్టి సుమన్ మాత్రమే స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్. వార్నర్, మోర్గాన్, విలియమ్సన్ రూపంలో ముగ్గురు విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. వీరిలో వార్నర్ కెప్టెన్ కాబట్టి కచ్చితంగా తుది జట్టులో ఉంటాడు. విలియమ్సన్ కూడా ఆడే అవకాశం ఉంది. ఆల్‌రౌండర్లు ఏడుగురు ఉన్నారు. ఇందులో హెన్రిక్స్, బెన్ కటింగ్ విదేశీ క్రికెటర్లు. ఈ ఇద్దరిలో ఒకరు తుది జట్టులోకి రావచ్చు. దీపక్ హుడా, కరణ్ శర్మ దాదాపుగా తుది జట్టులో ఉంటారు. ఆశిష్ రెడ్డి, బిపుల్ శర్మ, విజయ్ శంకర్లకు అవకాశం కొద్దిగా కష్టమే. ఇక బౌలర్లలో ఏడుగురూ పేస్ బౌలర్లే. బౌల్ట్, ముస్తాఫిజుర్లలో ఒకరు... నెహ్రా, భువనేశ్వర్ ఇద్దరూ దాదాపు అన్ని మ్యాచ్‌లూ ఆడే అవకాశం ఉంది. దేశవాళీ బ్యాట్స్‌మెన్ సంఖ్య ఎక్కువగా ఉన్న జట్లు ఐపీఎల్లో ప్రతి సీజన్లోనూ నిలకడగా రాణిస్తున్నాయి. ఈ విషయంలో సన్‌రైజర్స్ ఇంకా మెరుగుపడలేదు. గత ఏడాది జట్టు ప్రధానంగా వార్నర్ మీద ఆధారపడి సాగింది. ఈ ఏడాది కూడా దాదాపు అదే పరిస్థితి ఉంది. తనతో పాటు కనీసం మరో ఇద్దరైనా సీజన్ అంతా నిలకడగా ఆడితే అవకాశాలు మెరుగ్గా ఉండొచ్చు. మిగిలిన జట్లతో పోలిస్తే హైదరాబాద్ తుది జట్టు కాస్త బలహీనంగా కనిపిస్తున్నా... ఏదైనా అద్భుతం జరిగి సన్ ‘రైజ్’ కావాలని ఆశిద్దాం.