
టీమిండియా మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను మరోసారి ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. అయితే, ఇందులో ఓ ట్విస్టు ఉంది.
భారత మాజీ క్రికెటర్ రవిశాస్త్రి 2017- 2021 మధ్య టీమిండియా హెడ్ కోచ్‌గా పనిచేశాడు. అతడి మార్గదర్శనంలో.. విరాట్ కోహ్లి కెప్టెన్సీలో భారత జట్టు పలు చిరస్మరణీయ విజయాలు సాధించింది. ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్ గెలవడంసహా నంబర్ వన్ జట్టుగా ఎదిగింది.
అయితే, వీరిద్దరి కాంబినేషన్‌లో ఒక్క ఐసీసీ టైటిల్ కూడా నెగ్గలేకపోయింది టీమిండియా. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్-2021 తర్వాత రవిశాస్త్రి పదవీకాలం ముగియగా.. కెప్టెన్‌గా విరాట్ కోహ్లి యుగానికి తెరపడింది. ఈ క్రమంలో కోహ్లి రోహిత్ శర్మ సారథ్యంలో ఆటగాడిగా కొనసాగుతుండగా.. రవిశాస్త్రి తిరిగి కామెంటేటర్‌గా మారాడు.
ఈ నేపథ్యంలో తాజాగా రవిచంద్రన్ అశ్విన్‌తో మాట్లాడుతూ రవిశాస్త్రి.. హెడ్‌కోచ్‌గా పనిచేయడంపై తనకున్న ఆసక్తిని వివరించాడు. భవిష్యత్తులో తాను ఐపీఎల్ జట్టు కోచ్‌గా పనిచేసే అవకాశాలను కొట్టిపారేయలేనని తెలిపాడు.
భారత్‌లో ఎంతో మంది ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లు ఉన్నారని.. వారిని మెరికల్లా తీర్చిదిద్దే అవకాశం తనకు వస్తే కచ్చితంగా మళ్లీ కోచ్‌గా మారతానని రవిశాస్త్రి సంకేతాలు ఇచ్చాడు. ఇప్పటికే సూపర్ స్టార్లుగా ఎదిగిన వారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని.. అయితే, కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించేందుకు తనకు ఛాన్స్ వస్తే అస్సలు వదులుకోనని స్పష్టం చేశాడు.
ఏడేళ్లు టీమిండియాతో పనిచేసిన తర్వాత .. తిరిగి కామెంటేటర్‌గా బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉందన్న రవిశాస్త్రి.. తదుపరి ఐపీఎల్ కోచ్‌గా మారేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలియజేశాడు. కాగా రవిశాస్త్రి తర్వాత టీమిండియా హెడ్‌కోచ్‌గా పనిచేసిన రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగియడంతో బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో రవిశాస్త్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment