IPL teams
-
వీర ఐపీఎల్ విజయగాథ!
దేశంలో లోక్‌సభ ఎన్నికలకు సమాంతరంగా రెండు నెలల పైగా సాగిన క్రికెట్ వేడి ఎట్టకేలకు ముగిసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 17వ ఎడిషన్‌కు ఆదివారం నాటి ఫైనల్‌తో శుభం కార్డు పడింది. కలకత్తా నైట్ రైడర్స్ (కేకేఆర్), సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్)ల మధ్య చెన్నైలో జరిగిన తుది సమరం అనూహ్యంగా ఏకపక్షంగా సాగింది. తొమ్మిది ఓవర్లు మిగిలి ఉండగానే, 8 వికెట్ల తేడాతో కేకేఆర్ విజయం సాధించి, కప్ చేజిక్కించుకుంది. 2014 తర్వాత సరిగ్గా దశాబ్ద కాలపు నిరీక్షణకు తెర దించి, మూడోసారి విజేతగా నిలిచింది. ఫైనల్ చప్పగా ముగిసిందన్న మాటే కానీ, గత రెండునెలలుగా ఐపీఎల్ పట్ల జనంలో వ్యక్తమైన ఉత్సాహం, ఉద్వేగాలను తక్కువ చేయలేం. 2008లో ఆరంభమైన ఐపీఎల్ ఏయేటికాయేడు ప్రాచుర్యం పెంచుకుంటూ, ప్రస్తుతం ప్రపంచస్థాయి సంబరంగా మారింది. నరాలు తెగే ఉత్కంఠ, వినోదం అందించే ఈ పొట్టి ఫార్మట్ క్రికెట్ ఆట వీరాభిమానుల నుంచి అదాటుగా చూసేవారి దాకా అందరినీ ఆకర్షించగలుగుతోంది. అంతర్జాతీయ ఆటగాళ్ళతో కలసి ఆడడమే కాక, శిక్షణ, వ్యూహరచనల్లో భాగస్వాములు కావడంతో మన కొత్త తరం ఆటగాళ్ళు రాటుదేలడానికి కావాల్సినంత వీలు చిక్కుతోంది. ఈసారి మొత్తం 74 మ్యాచ్‌ల ఐపీఎల్ అనేక ఆశ్చర్యాలను ఆవిష్కరించింది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సిక్సులు (1260), అత్యధిక సెంచరీలు, 9 అత్యధిక స్కోర్లలో 8 ఈ సీజన్లోనే వచ్చాయి. వాటిలోనూ 5 అత్యధిక స్కోర్లు ఫైనల్లో తలపడిన కేకేఆర్, ఎస్ఆర్హెచ్లు సాధించినవే! విరాట్ కోహ్లీ ఈ సీజన్లో 741 పరుగులు చేసి తన ఐపీఎల్ కెరీర్లోనే రెండో అత్యధిక పరుగుల వరద పారించాడు. అదీ కనివిని ఎరుగని 154.70 రేటుతో! ఏడు మ్యాచ్‌లలో వరుసగా 6 మ్యాచ్‌లు ఓడి, రెండే రెండు పాయింట్లు సాధించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు ఆపైన వరుసగా 6 మ్యాచ్‌లు భారీ తేడాతో గెలిచి, ప్లేఆఫ్ దశకు చేరడం మరో అబ్బురం. ఆశలు వదులుకోకుండా నిలబడి, కలబడితే ఏదైనా సాధ్యమనే పాఠానికి నిదర్శనం. అలాగే, అంకితభావం ఉంటే వయసనేది అడ్డంకి కాదని, గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో 42 ఏళ్ళ ధోనీ గాలిలోకి 3 మీటర్లు గెంతి మరీ ఒంటిచేతితో పట్టిన విజయ్‌శంకర్ క్యాచ్ నిరూపించింది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో కప్ గెలిచిన కేకేఆర్ ఈసారి సాధించిన విజయంలో గమనించాల్సిన ఒక ప్రత్యేకత ఉంది. కేకేఆర్‌లో భారత క్రికెట్ జట్టు మెగాస్టార్స్ ఎవరూ లేరు. అయినా సరే టోర్నమెంట్లో అద్భుత ప్రతిభ కనబరిచింది. ఆ జట్టు పక్షాన అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మన్ సునీల్ నరైన్ నిజానికి మొత్తం పట్టికలో 9వ స్థానంలో ఉంటాడు. కానీ, టాప్ ఆర్డర్లో బ్యాటింగ్‌కు దిగి స్కోర్‌బోర్డ్‌ను పరుగులెత్తించిన తీరు, చూపిన ప్రభావం అసామాన్యం. కేకేఆర్ జట్టు కప్పు గెలిచిన గడచిన రెండుసార్లు (2012, 2014) కూడా ఆ యా సీజన్లలో అత్యధిక వికెట్లు (24, 21) తీసింది ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్ కమ్ రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నరే! ఈ సీజన్లోనూ 15 వికెట్లు, 488 పరుగులు సాధించి, ముచ్చటగా మూడోసారి ‘మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్’ అవార్డు అందుకున్నాడు. సునీల్ కాక మరొక్క టాప్ 20 ఆటగాడు మాత్రమే కేకేఆర్ జట్టులో కనిపిస్తాడు. అయితేనేం, ఆ జట్టు మైదానంలో జోరు కొనసాగించి, విజయతీరాలు చేరింది.పరుగుల వరద ఎప్పటి కన్నా మరో మెట్టు పైకెక్కి బ్యాట్స్మన్ల రాజ్యంగా సాగిన టోర్నీ ఇది. ఈ పరిస్థితుల్లో అత్యధిక వికెట్లు పడగొట్టే బౌలర్ లేకున్నా టాప్5 బౌలర్లలో ముగ్గురున్న కేకేఆర్ గెలుపు నమోదు చేసింది. అలాగే, కొన్నేళ్ళుగా విజయాలు రాకున్నా... ఇష్టారీతిన జట్టును మార్చేయకుండా, ఆటగాళ్ళను నమ్మి వారిని కొనసాగిస్తే అద్భుతాలు సాధ్యమేనని నిరూపించింది. పస అయిపోందని పలువురు విమర్శించినా... సునీల్, వరుణ్ చక్రవర్తి, వెంకటేశ్ అయ్యర్‌లను దీర్ఘకాలంగా జట్టులోనే అట్టిపెట్టుకుంది. ఆసిస్ పేసర్ మిషెల్ స్టార్క్ తాజా టోర్నీలో మొదట రాణించకున్నా అతణ్ణి కొనసాగించింది. అవన్నీ కీలక సమయంలో ఫలించాయి. వెరసి, పేరున్న ఆటగాళ్ళపై అతిగా ఆధారపడ్డ ఇతర ఫ్రాంఛైజీలకు కేకేఆర్ కథలో ఓ పాఠముంది. భారతజట్టులో ఆడకపోతేనేం, ప్రతిభావంతులైన యువతరంతో అద్భుతాలు చేయవచ్చని కేకేఆర్ ప్రస్థానం చాటింది.ఆదాయంలో, ఆకర్షణలో భారత జాతీయక్రీడ హాకీ సహా అన్నింటినీ క్రికెట్ ఎన్నడో మించిపోయింది. ఐపీఎల్ దెబ్బతో స్థానిక, రాష్ట్ర స్థాయుల్లోనూ టీ20 క్రికెట్ పోటీలొచ్చాయి. మన ఐపీఎల్ మూసలో ఆస్ట్రేలియాలో బిగ్‌బాష్, సౌతాఫ్రికాలో ఎస్ఏ 20 లీగ్, వెస్టిండీస్‌లో కరేబియన్ ప్రీమియర్ లీగ్, పాకిస్తాన్ – బంగ్లాదేశ్ – శ్రీలంకల్లోనూ ఆ యా దేశాల ప్రీమియర్ లీగ్‌లు వచ్చేశాయి. ప్రతిభావంతులైన యువ భారతీయ క్రికెటర్ల ప్రత్యామ్నాయ కెరీర్‌కు ఇది ద్వారాలు తెరిచింది. అదే సమయంలో ఈ వెర్రి పెచ్చుమీరిన బెట్టింగ్ బెడద తెచ్చింది. బ్యాట్‌కూ బంతికీ మధ్య పోటీలో సమతూకాన్ని చెడగొట్టింది. గత 16 విడతల ఐపీఎల్ టోర్నీల్లో మొత్తం 1032 మ్యాచ్‌లు ఆడితే, వాటిలో 250 పైచిలుకు స్కోర్లు వచ్చింది రెండు, మూడు మ్యాచ్‌లలోనే. కానీ, ఈ తడవ ఏకంగా 8సార్లు అది జరిగింది. బ్యాట్స్మన్లదే పైచేయిగా మారుతున్న ఈ లోపాన్ని సరిదిద్దేందుకు బీసీసీఐ కొత్త రూల్‌ను ఆలోచించకపోతే కష్టమే. ఏమైనా, ఈ ఏటి ఐపీఎల్ సీజన్ ముగిసింది. రెండేళ్ళకు ఒకసారి జరిగే ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ఆదివారం మొదలవుతోంది. రోహిత్‌శర్మ జట్టులో సభ్యులైనæ కోహ్లీ, పంత్ తదితరులు గనక ప్రస్తుత ఐపీఎల్ ప్రతిభాప్రదర్శననే ఆ వరల్డ్ కప్‌లోనూ కొనసాగిస్తే అంతకన్నా కావాల్సింది ఏముంది! చాలాకాలంగా ఊరిస్తున్న కప్పు మళ్ళీ మన ఇంటికొస్తుంది!! -
ఐపీఎల్ దెబ్బకి లక్షన్నర మొక్కలు..!
-
రేసులో అదానీ, గోయెంకా
దుబాయ్: మళ్లీ పది జట్ల ఐపీఎల్‌కు నేడు అడుగు పడనుంది. రూ.వేల కోట్ల అంచనాలతో దాఖలైన టెండర్లను నేడు తెరువనున్నారు. సుమారు 22 కంపెనీలు రూ. 10 లక్షలు వెచ్చించి మరీ టెండర్ దరఖాస్తులు దాఖలు చేసినప్పటికీ పోటీలో ప్రధానంగా ఐదారు కంపెనీలే ఉన్నట్లు తెలిసింది. ఇందులోనూ ఎలాగైనా దక్కించుకోవాలనే సంస్థలు మూడే! దేశీయ దిగ్గజ కార్పొరేట్ సంస్థలైన అదానీ గ్రూప్, గోయెంకా, అరబిందో సంస్థలు ఐపీఎల్లో తమ ‘జెర్సీ’లను చూడాలనుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ అదాయంపై గంపెడాశలు పెట్టుకుంది. ఒక్కో ఫ్రాంచైజీ ద్వారా రూ. 7,000 కోట్ల నుంచి రూ. 10 వేల కోట్లు ఆశిస్తోంది. అందుకే కనీస బిడ్ ధర రూ. 2,000 కోట్లు పెట్టింది. అయినాసరే 22 కంపెనీలు టెండర్ల ప్రక్రియపై ఆసక్తి చూపాయంటే ఐపీఎల్ బ్రాండ్విలువ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. పైగా బ్రాడ్‌కాస్టింగ్ హక్కుల మార్కెట్ ఏకంగా రూ.36 వేల కోట్లకు చేరింది. లీగ్‌కు సమకూరే ఈ ఆదాయాన్ని ఫ్రాంచైజీలకు పంపిణీ చేస్తారు. ఈ రకంగా చూసినా బోర్డు ఆశించినట్లు ఒక్కో జట్టుకు రూ. 7,000 కోట్లు కాకపోయినా రెండు కలిపి (రూ. 3,500 కోట్లు చొప్పున) ఆ మొత్తం గ్యారంటీగా వచ్చే అవకాశాలైతే పుష్కలంగా ఉన్నాయి. రేసులో అరబిందో గ్రూప్ ఉన్నప్పటికీ అదానీ, గోయెంకా కంపెనీలు ఫ్రాంచైజీలే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. అహ్మదాబాద్ లక్ష్యంగా అదానీ ఐపీఎల్లో ఇప్పుడు ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, రాజస్తాన్, పంజాబ్ ఫ్రాంచైజీలున్నాయి. ఇప్పుడు ఈ జాబితాలో చేరే ఇంకో రెండు నగరాలేవో నేడు తేల్చేస్తారు. బరిలో అహ్మదాబాద్, లక్నో, ఇండోర్, గువాహటి, పుణే, ధర్మశాల, కటక్ ఉన్నప్పటికీ ప్రధానంగా అహ్మదాబాద్, లక్నోలే ఖరారు అవుతాయని ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది. అయితే అహ్మదాబాద్, లక్నోలే ఫేవరెట్ నగరాలు. ముఖ్యంగా గుజరాత్‌కు చెందిన అదానీ గ్రూప్ అహ్మదాబాద్ లక్ష్యంగా టెండరు దాఖలు చేసింది. ఇప్పటికే ఐపీఎల్ ఫ్రాంచైజీ అనుభవమున్న ఆర్పీఎస్జీ (రాజీవ్ ప్రతాప్ సంజీవ్ గోయెంకా) గ్రూపు లక్నోను చేజిక్కించుకునే అవకాశముంది. ఐపీఎల్లో చెన్నై, రాజస్తాన్‌లు రెండేళ్ల నిషేధానికి గురైనపుడు పుణే (రైజింగ్ పుణే సూపర్‌జెయింట్స్)తో ఐపీఎల్‌లోకి ప్రవేశించింది. -
10న ‘ఫైనల్’ చేశారు
ముంబై: గత పుష్కరకాలంగా ఐపీఎల్ నిరాటంకంగా జరుగుతోంది. దక్షిణాఫ్రికాలో జరిగినా... పుట్టింట్లో నిర్వహించినా... విజేత మాత్రం ‘సూపర్ సండే’లోనే తేలింది. కానీ ఈసారి ఆనవాయితీ మారింది. ఫైనల్ ఆదివారం కాకుండా మంగళవారం నిర్వహించనున్నారు. లీగ్ చరిత్రలో తొలిసారి ఈ మార్పు చోటుచేసుకుంది. ఆదివారం ఎక్కడివారక్కడే ఉండి వర్చువల్ పద్ధతిలో జరిగిన ఐపీఎల్ పాలకమండలి (గవర్నింగ్ కౌన్సిల్–జీసీ) సమావేశంలో ఆట కోసం మూడు వేదికల్ని, గరిష్టంగా యూఏఈకి వెళ్లే ఫ్రాంచైజీ ఆటగాళ్లను ఖరారు చేశారు. దుబాయ్, అబుదాబి, షార్జా స్టేడియాల్లో 53 రోజుల పాటు మెరుపుల టి20లు జరుగుతాయి. 24 మంది ఆటగాళ్లతో కూడిన ఫ్రాంచైజీలు అక్కడికి ఈ నెలలోనే బయల్దేరతాయి. ముందుగా అన్నట్లు నవంబర్ 8న కాకుండా నవంబర్ 10న ఫైనల్ నిర్వహిస్తారు. భారత్, చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా డ్రాగన్ స్పాన్సర్‌షిప్‌పై వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ ఈ సీజన్లో పాత స్పాన్సర్లనే కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేశారు. దీంతో ‘వివో ఐపీఎల్–2020’కి సంబంధించిన కీలక నిర్ణయాలను జీసీ వెలువరించింది. యూఏఈలో ఐపీఎల్ టోర్నీ నిర్వహణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి బీసీసీఐకి అనుమతి లభించిందని ఆదివారం రాత్రి వార్తలు వచ్చినా... బీసీసీఐ మాత్రం ఇంకా అనుమతి రాలేదని... ఈ వారంలో గ్రీన్ సిగ్నల్ లభించే అవకాశముందని తమ అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఇవీ ప్రధానాంశాలు... ► యూఏఈలో జరిగే ఐపీఎల్–13వ సీజన్ సెప్టెంబర్ 19న మొదలవుతుంది. దీపావళికి (నవంబర్ 14న) నాలుగు రోజుల ముందుగా నవంబర్ 10న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. ∙మ్యాచ్‌ల సమయం మారింది. రాత్రి 8 గంటలకు కాకుండా అరగంట ముందుగా గం. 7.30 నుంచి మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. 53 రోజుల షెడ్యూల్లో 10 రోజులు మాత్రం ఒకే రోజు రెండేసి మ్యాచ్‌లను నిర్వహిస్తారు. ∙రెండు మ్యాచ్‌లు ఉన్న రోజున మాత్రం తొలి మ్యాచ్ మధ్యాహ్నం గం. 3.30న మొదలవుతుంది. ఐపీఎల్లో పాల్గొనే ఫ్రాంచైజీలు ఈ నెల 26 తర్వాత అక్కడికి బయలు దేరతాయి. ఒక్కో జట్టు గరిష్ట పరిమితి 24 మంది ఆటగాళ్లు. ► కరోనా మహమ్మారి దృష్ట్యా టోర్నీ మధ్యలో ఎవరైనా అనారోగ్యానికి గురైతే ఆ ఆటగాళ్లను సబ్స్టిట్యూట్లతో భర్తీ చేసుకునే వెసులుబాటు ఉంది. ► మొదట ప్రేక్షకుల్లేకుండానే పోటీలు జరుగుతాయి. కొన్ని మ్యాచ్‌లు జరిగాక అక్కడి స్థానిక ప్రభుత్వ ఆమోదం లభిస్తే కొంతమందికి ప్రవేశం కల్పిస్తారు. ► భారత స్టార్ ఆటగాళ్లయినా... విదేశీ ప్లేయర్లయినా... అందరూ చార్టెడ్ విమానాల్లోనే యూఏఈకి చేరుకోవాలి. ► నిష్ణాతుల ఆధ్వర్యంలో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్ఓపీ) రూపొందిస్తారు. జీవరక్షణ వలయం (రక్షిత బుడగ) ఏర్పాటు కోసం టాటా గ్రూప్‌తో సంప్రదింపులు జరుగుతున్నాయి. ► యూఏఈ హాస్పిటళ్లకు చెందిన స్పెషాలిటీ డాక్టర్లతో కూడిన ఉన్నతస్థాయి వైద్య బృందం ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తుంది. ► ఐపీఎల్ స్పాన్సర్లు యథాతథంగా 2020 సీజన్లోనూ కొనసాగుతారు. ► గత ఐపీఎల్ సమయంలో నిర్వహించినట్లుగా ఈసారీ టోర్నీ చివరి దశలో మహిళల టి20 చాలెంజ్ టోర్నీని నిర్వహిస్తారు. యూఏఈలోనే ఈ టోర్నీ జరుగుతుంది. మూడు మహిళల జట్ల మధ్య నాలుగు మ్యాచ్‌లు (మూడు లీగ్ మ్యాచ్‌లు, ఒక ఫైనల్) ఉంటాయి. -
ఏడు ఐపీఎల్ జట్లకు అనుబంధ స్పాన్సర్‌గా జియో
ప్రస్తుత ఐపీఎల్ -10 సీజన్ లో ఆడుతున్న 8 జట్లలో ఏడు జట్లకు జియో అనుబంధ స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు, గుజరాత్ లయన్స్, రైజింగ్ పుణె సూపర్ జెయింట్, ఢిల్లీ డేర్ డెవిల్స్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్లతో జియో ఒప్పందం చేసుకుంది. జియో నెట్ హైస్పీడ్ వై-ఫై సేవలు హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ లకు రిలయన్స్ జియో తమ హై-స్పీడ్, వై-ఫై ఇంటర్నెట్ సేవలను జియో నెట్ ద్వారా అందిస్తోంది. రిలయన్స్ జియో ప్రస్తుత ఐపీఎల్ సీజన్ కోసం తమ జియో నెట్ వై-ఫై తో స్టేడియం మొత్తం కవర్ చేసింది. ఈ సేవల కోసం, ప్రేక్షలకు కావలసింది ఒక స్మార్ట్ ఫోన్ మాత్రమే. వై-ఫై కి కనెక్ట్ అయిన తరువాత, జియో నెట్ హోం పేజీలో ఇచ్చిన మొబైల్ నంబరుకి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయగానే వై-ఫై కనెక్ట్ అవుతుంది. -
‘యువీ’ అవసరం లేదు
♦ వదిలేసుకున్న ఢిల్లీ డేర్‌డెవిల్స్ ♦ స్టెయిన్‌ను తప్పించిన హైదరాబాద్ ♦ 101 మందిని కొనసాగించనున్న ఐపీఎల్ జట్లు న్యూఢిల్లీ: భారీ విలువను భుజాన మోస్తూ ఐపీఎల్-8లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ప్రాతినిధ్యం వహించిన స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్‌ను ఆ జట్టు ఒక్క ఏడాదికే పరిమితం చేసింది. గత సీజన్లో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయిన యువీని ఊహించినట్లుగానే ఢిల్లీ వదిలేసుకుంది. 2015 ఐపీఎల్లో ఢిల్లీ తరఫున 13 ఇన్నింగ్స్‌లలో 19.07 సగటుతో 248 పరుగులు మాత్రమే చేసిన యువరాజ్ ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టాడు. ఆ సీజన్ కోసం రికార్డు స్థాయిలో యువీకి డేర్‌డెవిల్స్ రూ. 16 కోట్లు చెల్లించింది. భారత జట్టులో పునరాగమనం చేసినా ఢిల్లీ ఫ్రాంచైజీ యువీపై నమ్మకం ఉంచలేదు. ‘యువరాజ్ గొప్ప ఆటగాడు. మంచి ఫామ్‌లో ఉండి టీమిండియాకు ఎంపికయ్యాడు కూడా. అయితే మా బడ్జెట్ పరిమితుల కారణంగా అతడిని తప్పించాల్సి వస్తోంది. ఈ విషయాన్ని యువీకి ముందే చెప్పాం కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు’ అని డేర్‌డెవిల్స్ సీఈఓ హేమంత్ దువా వెల్లడించారు. భారీ మొత్తం (రూ. 7 కోట్లు) చెల్లించిన శ్రీలంక కెప్టెన్ ఏంజెలో మ్యాథ్యూస్‌ను కూడా ఢిల్లీ వదిలేసింది. దాంతో ఇద్దరు ఆటగాళ్లను మాత్రమే తప్పించి ఆ జట్టు రూ. 23 కోట్లు ఆదా చేసుకుంది. జహీర్‌ఖాన్ రిటైర్ అయినా... ప్రధానంగా మెంటార్ బాధ్యత అప్పజెప్పే అవకాశం ఉండటంతో అతడిని డీడీ కొనసాగిస్తోంది. ఐపీఎల్-9 కోసం ఆటగాళ్లను మార్చుకునే లేదా తప్పించే అవకాశం కల్పించే తొలి విండో ట్రేడింగ్ గురువారం ముగిసింది. ఇషాంత్‌శర్మ అవుట్...: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తమ ప్రధాన పేసర్లు డేల్ స్టెయిన్, ఇషాంత్ శర్మలను వదిలేసింది. గత సీజన్లో ట్రెంట్‌బౌల్ట్ ఫామ్ కారణంగా స్టెయిన్‌కు ఆరు మ్యాచ్‌లలో మాత్రమే ఆడే అవకాశం లభించగా, ఇషాంత్ నాలుగు మ్యాచ్‌లకే పరిమితమయ్యాడు. రూ.10.5 కోట్లు పెట్టి కొనుక్కున్న దినేశ్ కార్తీక్‌కు కూడా బెంగళూరు గుడ్‌బై చెప్పింది. ఈ ట్రేడింగ్ విండోలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు అత్యధికంగా 14 మందిని, కోల్‌కతా 10 మంది ఆటగాళ్లను తప్పించాయి. ఈ ట్రేడింగ్‌లో ఢిల్లీకి చెందిన కేదార్ జాదవ్ ఒక్కడినే మరో జట్టు తీసుకోవడం విశేషం. జాదవ్‌ను ఢిల్లీ తప్పించగా... బెంగళూరు సొంతం చేసుకుంది. ఇక్కడ వదిలేసిన ఆటగాళ్లందరూ వేలానికి అందుబాటులో ఉంటారు. వేలానికి ముందు ఢిల్లీ ఖాతాలో రూ. 36.85 కోట్లు, సన్‌రైజర్స్‌కు రూ. 30.15 కోట్లు ఉన్నాయి. వివిధ జట్లు వదిలేసుకున్న కొందరు ప్రధాన ఆటగాళ్లు ♦ యువరాజ్, మ్యాథ్యూస్, మనోజ్ తివారి (ఢిల్లీ) ♦ బెయిలీ, అవానా, తిసార పెరీరా (పంజాబ్) ♦ డస్కటే, అజహర్ మహమూద్ (కోల్‌కతా), ్ఞ ప్రజ్ఞాన్ ఓజా, ఫించ్ (ముంబై) ♦ దినేశ్ కార్తీక్, డారెన్ స్యామీ, దిండా (బెంగళూరు) ♦ స్టెయిన్, ఇషాంత్, బొపారా, ప్రవీణ్ కుమార్, విహారి, మిలింద్ (సన్‌రైజర్స్) -
8న ఐపీఎల్ కొత్త జట్ల ప్రకటన
ముంబై: వచ్చే రెండేళ్ల పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో పాల్గొనే రెండు కొత్త జట్లను డిసెంబర్ 8న ప్రకటిస్తారు. ఆ రోజు జరిగే వేలం ద్వారా వాటిని నిర్ణయిస్తారు. రూ. 40 కోట్ల కనీస విలువతో రివర్స్ బిడ్డింగ్ జరుగుతుంది. కొత్త ఫ్రాంచైజీలు ఎంచుకునేందుకు 9 నగరాల పేర్లను ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ అందుబాటులో ఉంచింది. ఈ జాబితాలో జైపూర్, కొచ్చిలకు అవకాశం కల్పించలేదు. లోధా కమిటీ సిఫార్సులకు అనుగుణంగా ఐపీఎల్ నుంచి రెండేళ్ల పాటు చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లను నిషేధించడంతో రెండు కొత్త జట్ల అవసరం ఏర్పడింది. ఈ రెండు జట్లలోంచి పది మంది ఆటగాళ్లను కొత్త టీమ్ నేరుగా ఎంచుకునే అవకాశం కల్పిస్తుండగా... మిగతావారందరినీ వేలంలోకి తీసుకు వస్తారు. -
ఐపీఎల్ జట్లకే ఆడనున్న కలిస్, పొలార్డ్
చాంపియన్స్ లీగ్ టి20 టోర్నీ న్యూఢిల్లీ: స్టార్ ఆటగాళ్లు జాక్వస్ కలిస్ (దక్షిణాఫ్రికా), కీరన్ పొలార్డ్(వెస్టిండీస్)... చాంపియన్స్ లీగ్ టి20 టోర్నీలో ఐపీఎల్ జట్లకే ప్రాతినిధ్యం వహించనున్నారు. తమ దేశవాళీ జట్లు కేప్ కోబ్రాస్ (దక్షిణాఫ్రికా), బార్బడోస్ ట్రైడెంట్స్ (వెస్టిండీస్) లీగ్‌కు అర్హత సాధించినా ఈ ఇద్దరు మాత్రం ఫ్రాంచైజీల వైపే మొగ్గు చూపారు. గత సీజన్లలో మాదిరిగానే ఈసారి కూడా ఏ జట్టుకు ఆడాలనే నిర్ణయాన్ని ఆటగాడికే వదిలేశామని సీఎల్‌టి20 గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు డీన్ కినో చెప్పారు. అయితే ఆటగాడు ‘బయటి’ టీమ్‌ను ఎంచుకుంటే ఆ ఫ్రాంచైజీ... ఆటగాడి దేశవాళీ జట్టుకు 1 లక్షా 50 వేల డాలర్లు (భారత కరెన్సీలో రూ. 90 లక్షల 75 వేలు) చెల్లించాలి. ఐపీఎల్లో బెంగళూరు కోచ్ డానియెల్ వెటోరీ ఈ లీగ్‌లో తమ దేశవాళీ జట్టు నార్తర్న్ డిస్ట్రిక్ట్స్ ప్రావిన్స్ తరఫున ఆడనున్నాడు. సెప్టెంబర్ 13 నుంచి అక్టోబర్ 4 వరకు జరగనున్న ఈ టోర్నీలో 10 జట్లు 29 మ్యాచ్‌లు ఆడనున్నాయి. లాహోర్ లయన్స్, ముంబై ఇండియన్స్, నార్తర్న్ నైట్స్, సదరన్ ఎక్స్‌ప్రెస్ జట్లు క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు ఆడతాయి. ఇందులో టాప్-2లో నిలిచిన జట్లు గ్రూప్ దశకు అర్హత సాధిస్తాయి. గ్రూప్ దశలో ప్రతి జట్టు మిగతా నాలుగింటితో మ్యాచ్‌లు ఆడుతుంది. రెండు గ్రూప్‌ల్లో టాప్-2లో నిలిచిన జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. గ్రూప్-ఎ: కోల్‌కతా, చెన్నై, డాల్ఫిన్స్, పెర్త్ స్కార్చర్స్, క్వాలిఫయర్-1. గ్రూప్-బి: పంజాబ్, కేప్ కోబ్రాస్, హోబర్ట్ హరికేన్స్, బార్బడోస్ ట్రెడెంట్స్, క్వాలిఫయర్-2.