10న ‘ఫైనల్‌’ చేశారు | Finally IPL 2020 Will Start From September 19th At United Arab Emirates | Sakshi
Sakshi News home page

10న ‘ఫైనల్‌’ చేశారు

Published Mon, Aug 3 2020 2:16 AM | Last Updated on Mon, Aug 3 2020 4:16 AM

Finally IPL 2020 Will Start From September 19th At United Arab Emirates - Sakshi

ముంబై: గత పుష్కరకాలంగా ఐపీఎల్‌ నిరాటంకంగా జరుగుతోంది. దక్షిణాఫ్రికాలో జరిగినా... పుట్టింట్లో నిర్వహించినా... విజేత మాత్రం ‘సూపర్‌ సండే’లోనే తేలింది. కానీ ఈసారి ఆనవాయితీ మారింది. ఫైనల్‌ ఆదివారం కాకుండా మంగళవారం నిర్వహించనున్నారు. లీగ్‌ చరిత్రలో తొలిసారి ఈ మార్పు చోటుచేసుకుంది. ఆదివారం ఎక్కడివారక్కడే ఉండి వర్చువల్‌ పద్ధతిలో జరిగిన ఐపీఎల్‌ పాలకమండలి (గవర్నింగ్‌ కౌన్సిల్‌–జీసీ) సమావేశంలో ఆట కోసం మూడు వేదికల్ని, గరిష్టంగా యూఏఈకి వెళ్లే ఫ్రాంచైజీ ఆటగాళ్లను ఖరారు చేశారు. దుబాయ్, అబుదాబి, షార్జా స్టేడియాల్లో 53 రోజుల పాటు మెరుపుల టి20లు జరుగుతాయి.

24 మంది ఆటగాళ్లతో కూడిన ఫ్రాంచైజీలు అక్కడికి ఈ నెలలోనే బయల్దేరతాయి. ముందుగా అన్నట్లు నవంబర్‌ 8న కాకుండా నవంబర్‌ 10న ఫైనల్‌ నిర్వహిస్తారు. భారత్, చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా డ్రాగన్‌ స్పాన్సర్‌షిప్‌పై వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ ఈ సీజన్‌లో పాత స్పాన్సర్లనే కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేశారు. దీంతో ‘వివో ఐపీఎల్‌–2020’కి సంబంధించిన కీలక నిర్ణయాలను జీసీ వెలువరించింది. యూఏఈలో ఐపీఎల్‌ టోర్నీ నిర్వహణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి బీసీసీఐకి అనుమతి లభించిందని ఆదివారం రాత్రి వార్తలు వచ్చినా... బీసీసీఐ మాత్రం ఇంకా అనుమతి రాలేదని... ఈ వారంలో గ్రీన్‌ సిగ్నల్‌ లభించే అవకాశముందని తమ అధికారిక ప్రకటనలో పేర్కొంది. 

ఇవీ ప్రధానాంశాలు... 
► యూఏఈలో జరిగే ఐపీఎల్‌–13వ సీజన్‌ సెప్టెంబర్‌ 19న మొదలవుతుంది. దీపావళికి (నవంబర్‌ 14న) నాలుగు రోజుల ముందుగా నవంబర్‌ 10న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. ∙మ్యాచ్‌ల సమయం మారింది. రాత్రి 8 గంటలకు కాకుండా అరగంట ముందుగా గం. 7.30 నుంచి మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. 53 రోజుల షెడ్యూల్‌లో 10 రోజులు మాత్రం ఒకే రోజు రెండేసి మ్యాచ్‌లను నిర్వహిస్తారు. ∙రెండు మ్యాచ్‌లు ఉన్న రోజున మాత్రం తొలి మ్యాచ్‌ మధ్యాహ్నం గం. 3.30న మొదలవుతుంది. ఐపీఎల్‌లో పాల్గొనే ఫ్రాంచైజీలు ఈ నెల 26 తర్వాత అక్కడికి బయలు దేరతాయి. ఒక్కో జట్టు గరిష్ట పరిమితి 24 మంది ఆటగాళ్లు.  
► కరోనా మహమ్మారి దృష్ట్యా టోర్నీ మధ్యలో ఎవరైనా అనారోగ్యానికి గురైతే ఆ ఆటగాళ్లను సబ్‌స్టిట్యూట్‌లతో భర్తీ చేసుకునే వెసులుబాటు ఉంది.  
► మొదట ప్రేక్షకుల్లేకుండానే పోటీలు జరుగుతాయి. కొన్ని మ్యాచ్‌లు జరిగాక అక్కడి స్థానిక ప్రభుత్వ ఆమోదం లభిస్తే కొంతమందికి ప్రవేశం కల్పిస్తారు.  
► భారత స్టార్‌ ఆటగాళ్లయినా... విదేశీ ప్లేయర్లయినా... అందరూ చార్టెడ్‌ విమానాల్లోనే యూఏఈకి చేరుకోవాలి. 
► నిష్ణాతుల ఆధ్వర్యంలో స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్స్‌ (ఎస్‌ఓపీ) రూపొందిస్తారు. జీవరక్షణ వలయం (రక్షిత బుడగ) ఏర్పాటు కోసం టాటా గ్రూప్‌తో సంప్రదింపులు జరుగుతున్నాయి. 
► యూఏఈ హాస్పిటళ్లకు చెందిన స్పెషాలిటీ డాక్టర్లతో కూడిన ఉన్నతస్థాయి వైద్య బృందం ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తుంది. 
► ఐపీఎల్‌ స్పాన్సర్లు యథాతథంగా 2020 సీజన్‌లోనూ కొనసాగుతారు. 
► గత ఐపీఎల్‌ సమయంలో నిర్వహించినట్లుగా ఈసారీ టోర్నీ చివరి దశలో మహిళల టి20 చాలెంజ్‌ టోర్నీని నిర్వహిస్తారు. యూఏఈలోనే ఈ టోర్నీ జరుగుతుంది. మూడు మహిళల జట్ల మధ్య నాలుగు మ్యాచ్‌లు (మూడు లీగ్‌ మ్యాచ్‌లు, ఒక ఫైనల్‌) ఉంటాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement