ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) – 2020 ప్రకటన ఇప్పటికే వచ్చేసింది... సెప్టెంబర్ 19నుంచి యూఏఈ వేదికగా టోర్నీ జరగడం ఖాయమైంది. ప్రధానంగా టీవీ ద్వారానే వినోదాన్ని పొందే సగటు క్రికెట్ అభిమానికి ఇది ఒక సంబరంలాంటిదే. ఫోర్లు, సిక్సర్ల హోరు... విధ్వంసకర బ్యాటింగ్ గురించి ఇకపై ఎంత చర్చించినా తక్కువే. అయితే అభిమానులకు సంబంధం లేని మరో అంశం ఇప్పుడు ఐపీఎల్ విషయంలో కీలకంగా మారింది.
అసలు మైదానంలో దిగే ఆటగాళ్ల పరిస్థితి ఎలా ఉండబోతోంది...ఫ్రాంచైజీలు ఎలాంటి ఏర్పాట్లు చేసుకోవాలి...కరోనా సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే లీగ్ విజయవంతంగా పూర్తవుతుంది... ఇలాంటి సందేహాలన్నీ నిర్వాహకులు తీర్చాల్సి ఉంది. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్‌ఓపీ) ఖరారు చేసేందుకు బోర్డు ఆదివారం సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ నిర్వహణలో ఎదురు కానున్న సవాళ్లు ఏమిటి? వీటికి బీసీసీఐ సమావేశంలో సమాధానం లభిస్తుందా అనేది చూడాలి.
పాజిటివ్‌గా తేలితే...
ఐపీఎల్‌లోని ఎనిమిది జట్ల ఆటగాళ్లను బయో సెక్యూర్ బబుల్‌లో ఉంచడంలో ఫ్రాంచైజీలదే బాధ్యత కానుంది. టోర్నీకి కొద్ది రోజుల ముందునుంచీ వీరందరినీ క్వారంటీన్‌లో ఉంచుతారా అనేదానిపై స్పష్టత లేదు. ఒక వేళ టోర్నీ జరిగే సమయంలో ఎవరైనా ఒక ఆటగాడు ‘పాజిటివ్’గా తేలితే అప్పుడేం చేయాలని ఫ్రాంచైజీలు మరింత సమాచారం కోరుతున్నాయి. సదరు ఆటగాడి జట్టులోని సహచరులందరినీ మళ్లీ పరీక్షిస్తారా...అదే హోటల్‌లో మరో జట్టు ఉంటే జట్టు మొత్తాన్ని ఐసోలేట్ చేస్తారా తెలియదు.
ఆ జట్టు తర్వాతి రోజు మ్యాచ్ ఆడాల్సి ఉంటే దానిని రద్దు చేస్తారా లేక వాయిదా వేస్తారా చూడాలి. ఇంగ్లండ్ ఆటగాడు జోఫ్రా ఆర్చర్ తరహాలో ఎవరైనా ‘బబుల్’ దాటి బయటకు వస్తే అప్పుడేం చేయాలనేది తెలియాలి. ఐపీఎల్ ఆడేవారికి ఎన్ని రోజులకు ఒకసారి టెస్టులు నిర్వహిస్తాలో కూడా నిర్ణయించాల్సి ఉంది. కొన్ని జట్లలోని ప్రధాన ఆటగాళ్లు తమ కుటుంబ సభ్యులను కూడా తీసుకొస్తామని ఇప్పటికే ఫ్రాంచైజీలకు చెప్పేశారు. దీనిపై మరింత స్పష్టత అవసరం.
అదనపు ఆటగాళ్లు ఎలా...
కోవిడ్–19 పరిణామాల నేపథ్యంలో దక్షిణాఫ్రికా క్రికెటర్లు ఐపీఎల్‌లో ఆడటంపై సందేహాలు రేకెత్తుతున్నాయి. అదే జరిగితే వారి స్థానంలో కొత్త ఆటగాళ్లకు ఎలా తీసుకోవాలనే విషయంపై బోర్డుకు స్పష్టత లేదు. ముఖ్యంగా బెంగళూరు జట్టులో గరిష్టంగా 21 మంది మాత్రమే ఉండగా...వారిలో ముగ్గురు సఫారీ ఆటగాళ్లు ఉన్నారు. ఇదే కాకుండా టోర్నీ మధ్యలో ఎవరికైనా గాయమైతే అప్పటికప్పుడు మరో ఆటగాడిని తీసుకునేవారు. ఇప్పుడు అలా చేయాలంటే మళ్లీ అతనికి కోవిడ్ పరీక్షలు, క్వారంటీన్‌లాంటి సమస్యలన్నీ ఉన్నాయి. అలా కాకుండా ముందే సన్నద్ధమై పెద్ద సంఖ్యలో జట్టును తీసుకెళ్లే అవకాశం ఇస్తారా చూడాలి.
యూఏఈ చేరడం, వసతి...
తమ ఆటగాళ్లకు కనీసం మూడు వారాల ప్రాక్టీస్ ఉండాలంటూ, ఇందు కోసం ఆగస్టు 20 వరకే యూఏఈ వెళతామంటూ కొన్ని ఫ్రాంచైజీలు బీసీసీఐకి సమాచారం అందించాయి. భారత క్రికెటర్లతో పాటు తమ జట్టులోని విదేశీ ఆటగాళ్లకు కూడా ఒకే చోటికి చేరేలా చేయడం కూడా జట్టు యాజమాన్యాలదే బాధ్యత. మ్యాచ్‌లు మూడు నగరాల్లో ఉన్నా...సౌకర్యాలను బట్టి చూస్తే దుబాయ్‌లో ఉండటాన్నే అన్ని జట్లు ఇష్టపడుతున్నాయి. కొందరు ఇప్పటికే హోటళ్ల ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. అయితే అవే హోటళ్లకు వచ్చే పర్యాటకులు, ఇతర అతిథుల విషయంపై వారూ కొంత ఆందోళనగానే ఉన్నారు. కనీసం 80 రోజులు ఉండాల్సి రావడంతో అన్ని రోజులు హోటళ్లలో సోషల్ డిస్టెన్సింగ్‌తో కొనసాగడం అంత సులువు కాదు.
బయటివారిని అనుమతిస్తారా...
ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ప్రధానంగా యూఏఈ దేశపు నిబంధనలను పరిగణలోకి తీసుకుంటూ ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇంగ్లండ్–విండీస్ టెస్టు సిరీస్ తరహాలో క్రికెటర్లతో పాటు సహాయక సిబ్బంది, హోటల్, భద్రతా సిబ్బంది అంతా కరోనా టెస్టులు నెగిటివ్‌గా తేలిన తర్వాత బయో బబుల్‌లోకి వచ్చారు. సిరీస్ ముగిసే వరకు అంతా ఒకే చోట ఉన్నారు. ఇప్పుడు ఐపీఎల్‌లో ఎనిమిది జట్లతో పాటు ఇతరులంతా సుదీర్ఘ కాలం ఇలా ఉండటం సాధ్యమేనా. ఇంగ్లండ్ సిరీస్‌లో ఆటగాళ్లను తీసుకువెళ్లే బస్సు డ్రైవర్ కూడా వరుసగా కోవిడ్ పరీక్షలకు హాజరు కావాలని నిబంధన పెట్టడంతోనే ఎవరూ ముందుకు రాలేదని తెలిసింది. అందువల్లే సౌతాంప్టన్ నుంచి మాంచెస్టర్ వరకు వారంతా సొంత కార్లలో ప్రయాణించగా ఆర్చర్ మధ్యలో ఇంటికి వెళ్లిన ఘటన మరచిపోవద్దు!
Comments
Please login to add a commentAdd a comment