అన్నీ చర్చిస్తారా... అంతా చెప్పేస్తారా! | IPL Governing Council Meeting On 02/08/2020 | Sakshi
Sakshi News home page

అన్నీ చర్చిస్తారా... అంతా చెప్పేస్తారా!

Published Sun, Aug 2 2020 2:43 AM | Last Updated on Sun, Aug 2 2020 2:44 AM

IPL Governing Council Meeting On 02/08/2020 - Sakshi

ఇప్పటికే ఈ ఏడాది ఆలస్యమైన ఐపీఎల్‌ ముందుకు వెళ్లేందుకు రెండు అడుగులు పడ్డాయి. మొదటిది వేదిక. రెండోది షెడ్యూల్‌. ఇక ఆఖరి అడుగే మిగిలుంది. అదే విధి విధానాలు. ఎందుకంటే ఇన్నాళ్లు భారత్‌లో జరిగాయి. ఇంటాబయటా పోటీలుండేవి. కానీ ఇది కరోనా కాలం. జరిగేది యూఏఈ వేదికపై! దీంతో పెద్ద కసరత్తే అవసరమైంది. అందుకే నేడు జరిగే పాలకమండలి (గవర్నింగ్‌ కౌన్సిల్‌–జీసీ) సమావేశం అత్యంత కీలకమైంది. ఆదివారమే అన్నీ చర్చిస్తారు. అనంతరం అంతా చెప్పేస్తారు. అక్కడికి వెళ్లిన దగ్గరి నుంచి తిరిగి స్వదేశం చేరేదాకా చేయాల్సినవి... చేయకూడనివి అన్నీ కూలంకశంగా చర్చిస్తారు. ఒక్కో ఫ్రాంచైజీలో వెళ్లే ఆటగాళ్ల సంఖ్య, ఆడే మ్యాచ్‌లు... ఉండే పరిమితులు, ఏర్పాటు చేసే బుడగ, దాటితే వచ్చే సమస్యలు ఇలా ఒకటి రెండు కాదు... అన్నింటికీ సమాధానాలు ఈ సమావేశంలోనే వెల్లడవుతాయి.

ముందు కావాల్సింది... ఆమోదం
కరోనా వాయిదా వేసినా... వరల్డ్‌కప్‌తో కలిసొచ్చిన కాలంతో ఐపీఎల్‌కు రంగం సిద్ధమవుతోంది. అయితే భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) చకచకా పనులు చక్కబెడుతున్నప్పటికీ భారత ప్రభుత్వం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ కావాల్సిందే. యూఏఈలో నిర్వహించేందుకు, అక్కడికి భారత ఆటగాళ్లను, సిబ్బందిని చార్టెడ్‌ ఫ్లయిట్లలో తరలించేందుకు సర్కారు అనుమతి కావాలి. ఇప్పటికైతే కేంద్రం స్పందించలేదు. అయితే కరోనా ప్రొటోకాల్‌ పాటిస్తే ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి వ్యతిరేకత ఉండదు. అందుకే ఐపీఎల్‌ చైర్మన్‌ బ్రిజేశ్‌ పటేల్‌ కేంద్ర ప్రభుత్వం ఆమోదం వస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. నేడు జరిగే సమావేశంలో బోర్డు అధ్యక్ష, కార్యదర్శులు సౌరవ్‌ గంగూలీ, జై షాలతో పాటు కోశాధికారి అరుణ్‌ ధుమాల్, ఐపీఎల్‌ జీసీ సభ్యులు, ఫ్రాంచైజీ యజమానులు పాల్గొంటారు.

విదేశాల్లో కొత్త కాకపోయినా...
ఐపీఎల్‌ విదేశీ గడ్డపై జరగడం ఇదే తొలిసారి కాదు. దేశంలో సార్వత్రిక ఎన్నికల కారణంగా రెండుసార్లు (2009లో పూర్తిగా దక్షిణాఫ్రికాలో, 2014లో మరోసారి పాక్షికంగా యూఏఈలో) ఐపీఎల్‌ మ్యాచ్‌లు దేశం బయట జరిగాయి. అలాగని ఇది కూడా అంత సులభమే అనుకుంటే పొరపాటు. ఆ టోర్నీలకు ఇప్పటి టోర్నీకి చాలా తేడా. ఆటగాళ్లు, సిబ్బంది రక్షణే కత్తిమీద సాములా తయారైంది. అయితే ఇంగ్లండ్‌లో సాఫీగా జరిగిన విండీస్‌ పర్యటనతో ఎనిమిది ఫ్రాంచైజీలు ఆడే ఐపీఎల్‌ను పోల్చలేం. స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసిజర్‌ (ఎస్‌ఓపీ)లోని నియమ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలి. ఈ మీటింగ్‌ అనంతరం ఫ్రాంచైజీలకు ఎస్‌ఓపీ బుక్‌లెట్‌ను అందజేస్తారు. ముఖ్యంగా ఇన్ఫెక్షన్‌ దరిచేరకుండా ఏర్పాటు చేసే జీవ రక్షణ వలయంపై చర్చిస్తారు. ఈ బుడగలో ఉంటే సరి... మరి గాయంతోగానీ, పొరపాటుగా కానీ బుడగ దాటితే ఎదురయ్యే పరిణామాలేంటి అనే అంశాలే అన్ని ఫ్రాంచైజీలను వేధిస్తున్నాయి.

డివిలియర్స్‌ కష్టమేనా... 
దక్షిణాఫ్రికాలో కరోనా ఉధృతి తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో సఫారీ ప్లేయర్లు ఈ సీజన్‌లో ఆడే అవకాశాలు క్లిష్టమవుతున్నాయి. దీంతో ‘మిస్టర్‌ 360’ డివిలియర్స్‌ మెరుపులు ఉండవేమో! అలాగే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, విండీస్‌ ఆటగాళ్లు తొలి రౌండ్‌ పోటీలకు అందుబాటులో ఉండరు. ద్వైపాక్షిక సిరీస్‌లతో బిజీగా ఉండటం వల్లే సెప్టెంబర్‌లో జరిగే పోటీల్లో ఆడకపోవచ్చు. కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ వల్ల విండీస్‌ ఆటగాళ్లు ఆలస్యంగా ఐపీఎల్‌ ఆడేందుకు వస్తారు. ఆటగాళ్ల వెంట భార్యలను, గర్ల్‌ఫ్రెండ్స్‌ను అనుమతించే అంశంపైనే పాలక మండలి తుది నిర్ణయం తీసుకుంటుంది. ఇది ఒక్కో జట్టులోని గరిష్ట పరిమితికి లోబడి ఉండొచ్చని బోర్డు వర్గాలు తెలిపాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement