దుబాయ్: తమ దేశంలో జరిగే ఐపీఎల్–13 మ్యాచ్‌లు ప్రత్యక్షంగా వీక్షించేందుకు ప్రేక్షకులను అనుమతిస్తామని ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) తెలిపింది. ప్రభుత్వ ఆమోదం లభిస్తే... సీటింగ్ సామర్థ్యంలో 30 నుంచి 50 శాతం వరకు ప్రేక్షకులను అనుమతించే అవకాశం ఉందని ఈసీబీ కార్యదర్శి ముబాషిర్ ఉస్మాని చెప్పారు. ఐపీఎల్ తుది షెడ్యూల్ ఖరారు చేశాక లీగ్ చైర్మన్ బ్రిజేశ్ పటేల్ మాట్లాడుతూ... ప్రేక్షకులను అనుమతించే విషయం పూర్తిగా యూఏఈ ప్రభుత్వం, ఈసీబీ పరిధిలోనే ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం బీసీసీఐ... భారత ప్రభుత్వ అమోదం కోసం ఎదురుచూస్తోంది. భారత్ నుంచి అధికారిక ఆమోదం లభించిన వెంటనే యూఏఈ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతామని ముబాషిర్ తెలిపారు. తమ దేశంలో పూర్తిస్థాయిలో జరిగే ఐపీఎల్‌లో కచ్చితంగా ప్రేక్షకులు ఉండాలనే కోరుకుంటున్నట్లు చెప్పారు. అయితే పూర్తి సామర్థ్యం ఉండదని 30 నుంచి 50 శాతం మేర అనుమతిస్తామని, దీనిపై తుది నిర్ణయం ప్రభుత్వానిదేనని ఆయన వెల్లడించారు. యూఏఈ లో కరోనా నియంత్రణలోనే ఉంది. ప్రస్తుతం 6000 కేసులే ఉన్నాయి. సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 8 వరకు యూఏఈలో ఐపీఎల్ 13వ సీజన్ పోటీలు జరుగుతాయి.
Comments
Please login to add a commentAdd a comment