
దుబాయ్: ఐపీఎల్–13ను యూఏఈలో నిర్వహించడానికి రంగం సిద్ధమవుతోంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పంపిన అంగీకార పత్రం తమకు అందిందని ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) జనరల్ సెక్రటరీ ముబాషిర్ ఉస్మాని సోమవారం వెల్లడించారు. ఇక లీగ్ నిర్వహణకు భారత ప్రభుత్వ ఆమోదమే మిగిలి ఉందని ఆయన పేర్కొన్నారు. కరోనా విజృంభణతో ఈ ఏడాది జరగాల్సిన ఐపీఎల్ టోర్నీ వాయిదా పడింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్‌లో లీగ్ నిర్వహించడం కష్టంగా మారింది. దీంతో తమకు అవకాశం ఇవ్వాల్సిందిగా ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ముందుకు రావడంతో... అందుకు బీసీసీఐ అంగీకరించింది. తాజాగా దానికి సంబంధించిన ‘అంగీకార పత్రాన్ని’ ఈసీబీకి మెయిల్ ద్వారా బీసీసీఐ పంపింది. 13వ సీజన్ పోటీలు సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 8 వరకు యూఏఈలో జరుగుతాయని ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్æ పటేల్ ఇదివరకే ప్రకటించారు. అందుకోసం అబుదాబి, షార్జా, దుబాయ్ వేదికలను ఎంపిక చేశారు.
Comments
Please login to add a commentAdd a comment