‘యువీ’ అవసరం లేదు
♦ వదిలేసుకున్న ఢిల్లీ డేర్‌డెవిల్స్
♦ స్టెయిన్‌ను తప్పించిన హైదరాబాద్
♦ 101 మందిని కొనసాగించనున్న ఐపీఎల్ జట్లు
న్యూఢిల్లీ: భారీ విలువను భుజాన మోస్తూ ఐపీఎల్-8లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ప్రాతినిధ్యం వహించిన స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్‌ను ఆ జట్టు ఒక్క ఏడాదికే పరిమితం చేసింది. గత సీజన్‌లో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయిన యువీని ఊహించినట్లుగానే ఢిల్లీ వదిలేసుకుంది. 2015 ఐపీఎల్‌లో ఢిల్లీ తరఫున 13 ఇన్నింగ్స్‌లలో 19.07 సగటుతో 248 పరుగులు మాత్రమే చేసిన యువరాజ్ ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టాడు. ఆ సీజన్ కోసం రికార్డు స్థాయిలో యువీకి డేర్‌డెవిల్స్ రూ. 16 కోట్లు చెల్లించింది. భారత జట్టులో పునరాగమనం చేసినా ఢిల్లీ ఫ్రాంచైజీ యువీపై నమ్మకం ఉంచలేదు. ‘యువరాజ్ గొప్ప ఆటగాడు. మంచి ఫామ్‌లో ఉండి టీమిండియాకు ఎంపికయ్యాడు కూడా. అయితే మా బడ్జెట్ పరిమితుల కారణంగా అతడిని తప్పించాల్సి వస్తోంది.
ఈ విషయాన్ని యువీకి ముందే చెప్పాం కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు’ అని డేర్‌డెవిల్స్ సీఈఓ హేమంత్ దువా వెల్లడించారు. భారీ మొత్తం (రూ. 7 కోట్లు) చెల్లించిన శ్రీలంక కెప్టెన్ ఏంజెలో మ్యాథ్యూస్‌ను కూడా ఢిల్లీ వదిలేసింది. దాంతో ఇద్దరు ఆటగాళ్లను మాత్రమే తప్పించి ఆ జట్టు రూ. 23 కోట్లు ఆదా చేసుకుంది. జహీర్‌ఖాన్ రిటైర్ అయినా... ప్రధానంగా మెంటార్ బాధ్యత అప్పజెప్పే అవకాశం ఉండటంతో అతడిని డీడీ కొనసాగిస్తోంది. ఐపీఎల్-9 కోసం ఆటగాళ్లను మార్చుకునే లేదా తప్పించే అవకాశం కల్పించే తొలి విండో ట్రేడింగ్ గురువారం ముగిసింది.
ఇషాంత్‌శర్మ అవుట్...: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తమ ప్రధాన పేసర్లు డేల్ స్టెయిన్, ఇషాంత్ శర్మలను వదిలేసింది. గత సీజన్‌లో ట్రెంట్‌బౌల్ట్ ఫామ్ కారణంగా స్టెయిన్‌కు ఆరు మ్యాచ్‌లలో మాత్రమే ఆడే అవకాశం లభించగా, ఇషాంత్ నాలుగు మ్యాచ్‌లకే పరిమితమయ్యాడు. రూ.10.5 కోట్లు పెట్టి కొనుక్కున్న దినేశ్ కార్తీక్‌కు కూడా బెంగళూరు గుడ్‌బై చెప్పింది. ఈ ట్రేడింగ్ విండోలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు అత్యధికంగా 14 మందిని, కోల్‌కతా 10 మంది ఆటగాళ్లను తప్పించాయి. ఈ ట్రేడింగ్‌లో ఢిల్లీకి చెందిన కేదార్ జాదవ్ ఒక్కడినే మరో జట్టు తీసుకోవడం విశేషం. జాదవ్‌ను ఢిల్లీ తప్పించగా... బెంగళూరు సొంతం చేసుకుంది. ఇక్కడ వదిలేసిన ఆటగాళ్లందరూ వేలానికి అందుబాటులో ఉంటారు. వేలానికి ముందు ఢిల్లీ ఖాతాలో రూ. 36.85 కోట్లు, సన్‌రైజర్స్‌కు రూ. 30.15 కోట్లు ఉన్నాయి.
వివిధ జట్లు వదిలేసుకున్న కొందరు ప్రధాన ఆటగాళ్లు
♦ యువరాజ్, మ్యాథ్యూస్, మనోజ్ తివారి (ఢిల్లీ)
♦ బెయిలీ, అవానా, తిసార పెరీరా (పంజాబ్)
♦ డస్కటే, అజహర్ మహమూద్ (కోల్‌కతా), ్ఞ ప్రజ్ఞాన్ ఓజా, ఫించ్ (ముంబై)
♦ దినేశ్ కార్తీక్, డారెన్ స్యామీ, దిండా (బెంగళూరు)
♦ స్టెయిన్, ఇషాంత్, బొపారా, ప్రవీణ్ కుమార్, విహారి, మిలింద్ (సన్‌రైజర్స్)