అప్పుల బెంగతో వ్యక్తి ఆత్మహత్య
తణుకు : చేసిన అప్పులు తీర్చలేక మనస్తాపం చెందిన వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తణుకులోని ఇరగవరం కాలనీకు చెందిన మహాశిభట్టు విద్యాసాగర్ (30) తన ఇంట్లో బలవన్మరణానికి పాల్పడ్డాడు. పట్టణ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లా కత్తిపూడికి చెందిన విద్యాసాగర్ తణుకు మునిసిపాలిటీలో కాంట్రాక్టు వర్కర్‌గా పని చేస్తున్నాడు. ఇరగవరం కాలనీకు చెందిన యువతిని ఆరేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి అయిదేళ్లు పాప ఉండగా ప్రస్తుతం భార్య తొమ్మిది నెలల గర్భిణి. ఇటీవలి కాలంలో మద్యానికి బానిసైన విద్యాసాగర్ అప్పులు చేశాడు. దీంతో కుటుంబ సభ్యులతో తగాదా పడుతున్నాడు. ఈ క్రమంలో ఇదే ప్రాంతంలో ఉన్న పుట్టింటికి భార్య వెళ్లింది. శుక్రవారం రాత్రి కనిపించిన విద్యాసాగర్ శనివారం ఉదయం నుంచి కనిపించకపోవడంతో చుట్టుపక్కల వాకబు చేసి చివరికి ఇంటి తలుపులు తెరిచి చూసేసరికి ఫ్యానుకు ఉరేసుకుని కనిపించాడు. పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పట్టణ ఎస్సై జి.శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం తణుకు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.