రూపాయి 37 పైసలు అప్
ముంబై: ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు ధరలు దిగిరావడంతో.. దేశీ కరెన్సీపై కూడా ఇది సానుకూల ప్రభావం చూపింది. ఇరాన్‌తో అమెరికా సహా ఇతర అగ్రదేశాలు కుదుర్చుకున్న అణు ఒప్పందం ప్రభావంతో ఇరాన్ ముడిచమురు ఎగుమతులపై ఇక ఆంక్షలు ఎత్తివేయొచ్చనే అంచనాలు దీనికి కారణంగా నిలిచాయి. డీల్‌లో భాగంగా అణు కార్యకలాపాలను తగ్గించుకోవడానికి ఇరాన్ అంగీకరించింది. అణు వివాదాదానికి తెరపడటంతో ఆ దేశంపై పాశ్చాత్య అగ్రరాజ్యాలు విధించిన ఆంక్షలు క్రమంగా తొలగే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో డాలరుతో రూపాయి మారకం విలువ 37 పైసలు బలపడింది.
క్రితం ముగింపు 62.87తో పోలిస్తే... 62.50 వద్ద స్థిరపడింది. ముడిచమురు ధరలు దిగొస్తుండటంతో దేశ క్రూడ్ దిగుమతుల బిల్లు శాంతించడంతోపాటు కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్)కు కూడా కళ్లెం పడొచ్చనే ఆశాభావం వ్యక్తమవుతోంది. ఇది అంతిమంగా రూపాయిపై సానుకూల సెంటిమెంట్‌కు దోహదం చేసినట్లు ఫారెక్స్ మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. దేశ క్రూడ్ అవసరాల్లో 80 శాతం మేర విదేశీ దిగుమతులే కావడం, ఇందులోకూడా ఇరాన్ నుంచి అత్యధికంగా క్రూడ్‌పై ఆధారపడుతోంది. మరోపక్క దేశీ స్టాక్ మార్కెట్లు సైతం భారీగా పుంజుకోవడం(సెన్సెక్స్ 388 పాయింట్లు లాభపడింది) కూడా రూపాయికి చేదోడుగా నిలిచింది.