భారతీయ నర్సులకు విముక్తి
* విడుదల చేసినఇరాక్ సున్నీ మిలిటెంట్లు
* స్వదేశానికి తీసుకొచ్చేందుకు విమానాన్ని పంపిన భారత్
* నేటి ఉదయం కొచ్చికి..
న్యూఢిల్లీ/కొచ్చి: ఇరాక్ సున్నీ మిలిటెంట్ల చెర నుంచి 46 మంది భారతీయ నర్సులకు విముక్తి లభించింది. మిలిటెంట్లు వీరిని శుక్రవారం నాటకీయ పరిణామాల మధ్య ఉన్నట్టుండి విడుదల చేశారు. ఇరాక్‌లో ఘర్షణలు లేని ఎర్బిల్ నుంచి వీరు ఎయిరిండియాకు చెందిన ప్రత్యేక బోయింగ్ విమానంలో స్వదేశానికి రానున్నారు. ఈ విమానం శనివారం ఉదయం నేరుగా కొచ్చికి చేరుకోనుంది. కేరళకు చెందిన ఈ నర్సులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం శుక్రవారం సాయంత్రం ఢిల్లీ నుంచి ఈ విమానాన్ని ఎర్బిల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి పంపింది.
వీరిని ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐఎస్ఐఎస్) మిలిటెంట్లు గురువారం తమ అధీనంలోని తిక్రిత్ పట్టణ ఆస్పత్రి నుంచి బలవంతంగా మోసుల్ పట్టణానికి తరలించడం తెలిసిందే. ఉత్తర ఇరాక్‌లోని కుర్దిస్థాన్ రాజధాని అయిన ఎర్బిల్.. మోసుల్కు 80 కి.మీ దూరంలో ఉంది. నర్సులు ఎర్బిల్లోని భారత ఎంబసీని సంప్రదిస్తున్నారని విదేశాంగ ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ ఢిల్లీలో తెలిపారు. వారు క్షేమంగా ఉన్నారని, వారిని తీసుకొచ్చే విమానంలో కిర్కుక్ నుంచి మరో 70 మంది భారతీయులు, కేరళకు చెందిన ఓ మహిళా ఐఏఎస్ అధికారి, ఓ ఐఎఫ్ఎస్ అధికారి వస్తున్నారన్నారు.
అన్ని సాధనాలనూ వినియోగించుకున్నాం..
నర్సులు నాటకీయ పరిణామాల మధ్య విడుద లైనట్లు అక్బరుద్దీన్ వ్యాఖ్యల ద్వారా తె లుస్తోంది. వీరి విడుదలకు జరిపిన సంప్రదింపుల్లో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పాత్ర ఉందా అని విలేకర్లు అడగ్గా ఆయన నేరుగా సమాధానమివ్వలేదు. ‘సంప్రదింపుల్లో దౌత్యస్థాయిలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ స్వయంగా పాల్గొన్నారు. క్షేత్రస్థాయి వివరాలు చెప్పలేం’ అని అన్నారు. దౌత్యం.. ముందు తలుపుల గుండా పనిచేస్తుందని, అయితే తాము ఇతర తలుపులనూ వాడుకున్నామన్నారు. వాటిలో ఒక తలుపు తెరచి తమ పౌరులను తరలించగలిగామని, పూర్తి వివరాలు ఇప్పుడు చెప్పలేమన్నారు. నర్సుల విడుదలకు అనేక ప్రయత్నాలు చేశామని, అన్ని సాధనాలనూ వినియోగించుకున్నామన్నారు. కాగా, నర్సులు మోసుల్ నుంచి బస్సులో ఎర్బిల్ విమానాశ్రయానికి దగ్గర్లోని అంతర్జాతీయ సరిహద్దుకు చేరుకున్నారని కేరళ సీఎం ఊమెన్ చాందీ ఢిల్లీలో చెప్పారు. భారత ప్రభుత్వం, బాగ్దాద్‌లోని భారత ఎంబసీ, తమ రాష్ట్ర ప్రభుత్వం కలసికట్టుగా కృషిచేసి వీరిని స్వదేశానికి తీసుకొస్తున్నామన్నారు.
తమను తిక్రిత్ నుంచి తరలించిన మిలిటెంట్లు మోసుల్ దగ్గర్లోని ఓ ఆస్పత్రి దగ్గరున్న పాత భవనంలో ఉంచారని నర్సులో ఒకరు కొట్టాయంలోని కుటుంబ సభ్యులకు ఫోన్లో తెలిపారు. కాగా, భారత ప్రభుత్వం నర్సుల ఉదంతాల్లాటివి తలెత్తకుండా పటిష్ట వలస చట్టాన్ని తేవాలని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ భారత ప్రభుత్వాన్ని కోరింది. నర్సులకు సకాలంలో జీతాలు చెల్లించి ఉంటే వారు ఇదివరకే భారత్‌కు చేరుకుని ఉండేవారంది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా ఊరట చెందారు. తనకు సంతోషంగా ఉందని, వారు సురక్షితంగా తిరిగిరావాలని ఓ సందేశంలో పేర్కొన్నారు.