Iraq Victims
-
ఇరాక్ నుంచి స్వదేశానికి..
స్వదేశానికి చేరిన గల్ఫ్ బాధితులు జన్నారం/సిరిసిల్ల: ఇరాక్ బాధితులు ఎట్టకేలకు మాతృభూమిపై అడుగుపెట్టారు. ఎన్నారై శాఖ మంత్రి కేటీఆర్ సహాయంతో తెలంగాణ గల్ఫ్ వెల్ఫేర్, కల్చరల్ అసోసియేషన్ అధికార ప్రతినిధి పాట్కూరి బసంతరెడ్డి, ఇరాక్ ప్రతినిధి మాటేటి కొమురయ్య, ఎంబసీ అధికారి దీపక్విజ్ఞాని కృషితో సోమవారం తెల్లవారుజామున ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. వీరికి ఢిల్లీలో బసంతరెడ్డి స్వాగతం పలికారు. మంత్రి కేటీఆర్ ఆదేశంతో తెలంగాణ భవన్ అసిస్టెంట్ కమిషనర్ రామ్మోహన్.. వారిని తెలంగాణ భవన్‌కు తీసుకొచ్చి వసతి, భోజన ఏర్పాటు చేశారు. రైలు టిక్కెట్లు ఇచ్చి హైదరాబాద్‌కు సాగనంపారు. ఢిల్లీ నుంచి ఎపీ ఎక్స్‌ప్రెస్‌లో బయల్దేరిన బాధితులు మంగళవారం ఉదయం మంచిర్యాల రైల్వేస్టేషన్‌కు చేరుకొని, అక్కడినుంచి తమ స్వగ్రామాలకు వెళతారు. ఇరాక్‌లో చిక్కుకున్న వీరి దీనగాథను ‘సాక్షి’ వెలుగులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణ గల్ఫ్ వెల్ఫేర్, కల్చరల్ అసోసియేషన్ అధికార ప్రతినిధి పాట్కూరి బసంతరెడ్డి విషయాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి.. ఆయన కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అక్కడి అధికారులు బాధితులకు ఎలాంటి జరిమానా లేకుండా ఆదివారం గల్ఫ్ నుంచి పంపించగా.. సోమవారం వారు ఢిల్లీ చేరుకున్నారు. చాలా బాధలు పడ్డా.. ఏడాది కింద ఇరాక్‌కు వెళ్లిన. రెండు నెలలు పని చేసిన తర్వాత అకామా లేదని పని చేయడం కుదరదన్నరు. ఏజెంట్‌ను సంప్రదిస్తే దాటవేసి దొరక్కుండా పోయిండు. దొంగచాటుగా రోజు విడిచి రోజు పని చేస్తూ కడుపునింపుకున్నా. ‘సాక్షి’ పేపర్లో వచ్చిన వార్తలతో ప్రభుత్వం స్పందించడంతోనే ఇండియాకు వచ్చిన. మంత్రి కేటీఆర్, ‘సాక్షి’ పేపర్‌కు రుణపడి ఉంటా. – మేడి ప్రవీణ్, వెల్గటూర్, కరీంనగర్ జిల్లా ‘సాక్షి’ని మరిచిపోను మేము ఇరాక్‌లో పడుతున్న ఇబ్బందులపై ‘సాక్షి’ పేపర్లో వచ్చిన వార్త చదివి బసంతరెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయారు. పలుసార్లు ఇరాక్‌లో ఉంటున్న మాటేటి కొమురయ్యతో ఎర్బిల్లోని భారత రాయబార కార్యాలయానికి పంపి వారిపై ఒత్తిడి తేవడంతోనే మమ్ములను పంపారు. మా రాకకు కారణమైన ‘సాక్షి’కి, మంత్రి కేటీఆర్, బసంతరెడ్డిలకు ధన్యవాదాలు. – దుర్గం రవి, ఇప్పలపల్లి, జన్నారం, మంచిర్యాల జిల్లా ఉపాధి కల్పించాలి ఏజెంట్ల మోసానికి గురై, అప్పుల పాలైన తెలంగాణ కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి. దళారీ వ్యవస్థను ప్రభుత్వం రూపుమాపాలి. నకిలీ ఏజెంట్ల మోసానికి ఇరాక్‌లో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. నకిలీ ఏజెంట్లను శిక్షించేందుకు కఠినమైన చట్టాలు తీసుకురావాలి. బాధితులను భారత్‌కు తీసుకురావడానికి కృషి చేసిన మంత్రి కేటీఆర్, ‘సాక్షి’కి ధన్యవాదాలు. – బసంతరెడ్డి, గల్ఫ్ వెల్ఫేర్, కల్చరల్ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి -
బతుకుతమనుకోలె!
ఎక్కడా చూసినా బాంబుల మోతలే...ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఓ అడవి ప్రాంతంలో తలదాచుకున్నం...తిండి లేదు... నిద్రలేదు... మురుగునీళ్లు తాగినం... ఇంటికి వస్తామన్న ఆశలేదు. జేబులో పైసల్లేవు... మా బాధ ఏం చెప్పాలె.. కళ్లు మూసుకుంటే ఇల్లు.. తల్లిదండ్రులు.. పెళ్లాం పిల్లలే కనబడేవారు. వారికి ఆఖరు చూపైనా దక్కుతుందా లేదా అని బోరున ఏడ్చాం. ఊర్లో ఉపాధి లేదని ఇంతదూరం వచ్చినం.. చివరకు ఊరు కాని ఊరు.. దేశం కాని దేశంలో పానాలు పోగొట్టుకుంటున్నామా అన్న బాధతో ఏడ్చాం. అక్కడ మమ్మల్ని పట్టించుకునే వారు లేరు. మా గోడు వినేవారు లేరు. చివరకు ఆ భయంకర పరిస్థితుల నుంచి బయటపడినం. ఇంటికి చేరి పిల్లాజెల్లలతో కలిసినం అంటూ ఇరాక్‌కు వెళ్లి అంతర్యుద్ధంలో నలిగిన వలస కూలీలు వారి బాధలు చెప్పుకున్నారు. రుణపడి ఉన్నాం లక్ష 25 వేలు బాకీ చేసి కొడుకును కానని దేశం పంపిస్తే వట్టి చేతులతో ప్రాణాలు కాపాడుకుని ఇంటి కొచ్చాడు. ఇంట్లో మాకే గంజీగాసం సరిగ్గాలేక ఇబ్బంది పడుతున్నాం. గవర్నమెంటు అధికారులు, నాయకులు మా పిల్లల్ని ఊరికి క్షేమంగా పంపినందుకు రుణపడి ఉన్నాం. అప్పులు తీర్చి కుటుంబం గడిచేందుకు సహాయం చేస్తే పుణ్యం ఉంటది. - గుండెవోని పెంటయ్య, బాధితుడు యాదయ్య తండ్రి తిరిగి వచ్చేది కష్టమన్నారు దూర దేశంలో మా భర్త పడుతున్న కష్టాలు తెలుస్తుంటే తిండి తినబుద్ధి కాలేదు. అన్నీ నిద్రలేని రాత్రులే. తిరిగి వచ్చేది కష్టమన్నారు. అలసు బతికున్నది కూడా పక్కాగా ఎవరికి తెలుసు... అంటూ ఒక్కొక్కరు ఓ విధంగా మాట్లాడుతుంటే భయమేసింది. ఆయన కట్టిన తాళిబొట్టు గట్టిదైతే సల్లంగా తిరిగొస్తాడని అనుకున్నా... దేవుడి దయవల్ల వచ్చాడు. - జ్యోతి, పిడుగు మల్లేశం భార్య బాధితులను చేర్చినందుకు కృతజ్ఞతలు మా గ్రామం నుంచి ఇరాక్ వలస వెళ్లి ఇబ్బందులకు గురైన ఆరుగురిని క్షేమంగా ఇంటికి చేర్చడంలో చొరవ చూపిన ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, జిల్లా అధికారులు, ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఇప్పటి వరకు విదేశాలకు వలస వెళ్లిన పలువురు చనిపోవడంతో ఇరాక్ బాధితుల కుటుంబ సభ్యులు ఆందోళన పడ్డారు. బాధితులను కుటుంబసభ్యులకు కలిసే అదృష్టం చేసినందుకు గ్రామంలో సంతోషంగా ఉంది. - నర్సిములు నాయుడు, ఎంపీటీసీ సభ్యుడు ఒక్క రొట్టెలో ఆరు ముక్కలు యుద్ధ సమయంలో తిండి కోసం అవస్థలు పడ్డామని చెప్పారు. ‘కాంట్రాక్టర్ తన ఇష్టం వచ్చినప్పుడు వచ్చి ఇంత తిండి వేసేవాడు. మాతో పాటు మరో 143 మంది బాధితులున్నారు. ఒక్క రొట్టె(కబూస్)ను ఆరు ముక్కలుగా చేసి ఆరుగురికి ఇచ్చాడు. కొత్తిమీర, గర్కగడ్డితో చేసింది పెట్టారు. తిండిని ఆకలికి భరించలేక తిన్నాం. ‘‘పెట్టిందంతా తినాలి.. లేకుంటే చస్తారు’’ అంటూ ఇరాక్ భాషలో గుడ్లురుమి చూసి భయపెట్టారు. ప్లేటు అన్నంలో ఆరుగురం తిన్నాం. ఇట్లా 11 దినాలు గడిపాం. మరో రెండ్రోజులు పక్కనే ఉన్న రేని పండు వంటి కాయలు తిని ఆకలి తీర్చుకున్నాం. 10 కిలోల ఆలుగడ్డ కూరలో 50 లీటర్ల నీళ్లు, పావు కిలో పచ్చిమిర్చి, ఐదారు టమాటలు వేసి వండిన నీళ్లచారుకు చిన్నపిల్లలు తినేంత అన్నం ముద్ద వేసేవారు.’ అని బాధితులు ఆ చేదు ఘటనలను గుర్తు చేసుకున్నారు. ఎప్పుడు కాలుస్తారోనని భయపడ్డాం ఇరాక్ వెళ్లేందుకు లక్ష రూపాయలు ఏజెంట్‌కు చెల్లించాం. ఆడికి పోయినాక నిర్మానుష్యంగా ఉన్న ఎయిర్‌పోర్ట్‌ను చూడగానే భయం కలిగింది. కన్స్ట్రక్షన్ కంపెనీకి వెళ్లగానే చిన్నగదిలో 33 మంది చొప్పున వదిలేశారు. తిండి ఘోరంగా ఉండేది. ఉదయం కబూస్ (రొట్టె), సాస్ ఇచ్చేవారు. క్యాంపులో బాత్రూంలు కూడా లేవు. స్నానాలకు, తాగడానికి మురికినీళ్లే దిక్కయ్యాయి. ఇట్లా నెల రోజులు హరిగోసపడ్డాం. గదిలో గాలి ఆడక గిన్నెలను విసన కర్రలుగా ఊపుకున్నాం. వీసాలు లాక్కుని కలివేలు (వీసాలు కోల్పోయిన వ్యక్తులు)గా దిక్కులేని పక్షులను చేస్తామని బెదిరిచిండ్రు. యుద్ధం జరుగుతున్నప్పుడు ఇక బతుకుతామనుకోలేదు. బందీలుగా ఉన్నప్పుడు వేరే దేశం వ్యక్తి ఒకాయన అప్పుడప్పుడు మాకు తిండిపెట్టాడు. ఆయన సాయంతో విదేశీ వలస జీవుల హెల్ప్‌లైన్ నారాయణ ద్వారా ఎంబీఎస్ కార్యాలయానికి సమాచారం అందించాం. అయినా ఇంటికి చేరుతామనే నమ్మకం లేదు. బతుకుల మీద ఆశ అంతకన్నా లేదు. తెలంగాణ నుంచి వెళ్లిన 58 మందిమి ఐదు బస్సుల్లో నదాబ్ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చాం. తిరుగు ప్రయాణంలోనూ ఎక్కడ బాంబు పెడతారోనని, ఎప్పుడు తుపాకులతో కాలుస్తారో అనే భయపడ్డాం. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో దిగాక ధైర్యమోచ్చింది. సొంత ఊరును చూసే అదృష్టం కలిగించారు. రెండు బోర్లు వేసి అప్పుల పాలయ్యాను. అప్పును తీర్చేందుకు దూర దేశం వెళ్లి ఖాళీ చేతులతో తిరిగొచ్చాను. ఇద్దరు పెళ్లీడుకొచ్చిన కూతుర్లు ఉన్నారు. - పాలెపల్లి చంద్రయ్య, ఇరాక్ బాధితుడు -
ఆశపెట్టి.. అగాధంలోకి..
మోర్తాడ్ (నిజామాబాద్): భారీ వేతనం.. మంచి వసతి అంటూ ఆశపెట్టి విదేశాలకు పంపుతున్న ఏజెంట్లు వారి బతుకులను అగాథంలోకి నెడుతున్నారు. ఇరాక్‌లోని వివిధ కంపెనీల్లో పని కోసం పంపిన ఏజెంట్ల మోసపూరిత విధానాలు మన కార్మికుల పాలిట శాపంగా మారాయి. ఇరాక్ అంతర్యుద్ధం నేపథ్యంలో ఏజెంట్ల మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. నిరుద్యోగులను మాయ చేసిన ఏజెంట్లు వర్క్ వీసాల పేర రూ. 1.50 లక్షల నుంచి రూ. 1.75వరకు వసూలు చేసి విజిట్ వీసాలను చేతిలో పెట్టి చేతులు దులుపుకున్నారు. ప్రస్తుతం వర్క్ వీసా ఉన్నవారిని మాత్రమే స్వస్థలాలకు వెళ్లడానికి ఇరాక్ ప్రభుత్వం అనుమతినిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్నవారికి అనుమతి ఇవ్వకపోవడంతో వేలాది మంది కార్మికుల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారయ్యింది. కిర్కుక్ ప్రాంతంలోని కార్వంచ్ సాఫ్ట్ డ్రింక్స్ అండ్ గ్రూపు కంపెనీలో ఉన్న 250 మంది కార్మికులకు వర్క్ వీసాలు లేవు. ఈ ఒక్క కంపెనీలోనే కాక ఇరాక్‌లోని వివిధ ప్రాంతాలలో ఉన్న అనేక కంపెనీల్లో పని చేస్తున్న కార్మికుల పరిస్థితి అలాగే ఉంది. ఏళ్ల తరబడి ఇలాగే... దుబాయ్, ఖతర్, మస్కట్, బెహరాన్, సౌదీ అరేబియా తదితర గల్ఫ్ దేశాలకు వెళ్లడం తెలంగాణ, ఆంధ్ర ప్రాంతం నుంచి ఏళ్లుగా సాగుతోంది. గల్ఫ్‌లో పని చేస్తున్న వారి సంఖ్య పెరగడంతో పోటీ ఎక్కువై వేతనాలు తగ్గాయి. అయితే, ఇరాక్, ఆఫ్ఘానిస్తాన్ దేశాల్లో పునర్నిర్మాణం పనుల కోసం అమెరికా కంపెనీలు ఏర్పాటు చేసిన క్యాంపుల్లో పని చేయడానికి కార్మికులు అధికంగా అవసరం అయ్యారు. అంతేకాక మిలట్రీ క్యాంపుల్లోను పని చేయడానికి కార్మికులు కావాల్సి వచ్చింది. దీంతో కార్మికులకు అక్కడి కంపెనీలు వేతనాలను ఎరగా వేసింది. ఇరాక్‌లో పని చేస్తే నెలకు 400 నుంచి 500 అమెరికన డాలర్లు వేతనంగా లభిస్తాయని, భోజనం.. వసతి సౌకర్యం ఉంటుందని ఏజెంట్లు ఆశ పెట్టారు. ఈ పరిస్థితుల్లో వర్క్ వీసాలు లేకున్నా.. వేతనాలు వస్తాయనే ఉద్దేశంతో ఎంతో మంది భారతీయులు ఇరాక్, ఆప్ఘనిస్థాన్‌కు వెళ్లారు. ఇందులో తెలుగువాళ్లే ఎక్కువగా ఉన్నారు. అయితే, ఏజెంట్లు తమకు మూడు నెలల విజిట్ వీసాలను ఇచ్చారని, ఇరాక్ వెళ్లిన తరువాత వర్క్ పర్మిట్ ఇస్తారని చెప్పారని కార్మికులు ‘సాక్షి’కి తెలిపారు. అయితే, వర్క్ పర్మిట్ మాత్రం ఇవ్వలేదని, వేతనం వస్తుంది కదా అని వీసాల విషయం ఎవరిని అడగలేదని పేర్కొంటున్నారు. ఏజెంట్ల హుండీ దందా.. వర్క్ వీసాలు లేని వారు కంపెనీ క్యాంపులను విడిచి బయట తిరిగే పరిస్థితి లేదు. దీంతో కార్మికులు ప్రతి నెల వారి వేతనాలను ఇంటికి పంపడానికి అధికారికంగా ఉన్న మనీ ట్రాన్స్ఫర్ కేంద్రాలను వినియోగించుకునే అవకాశం లేకుండా పోయింది. దీంతో హుండీ దందాకు అవకాశం ఏర్పడింది. నిరుద్యోగులను పంపించిన ఏజెంట్లే హుండీ దందా చేస్తున్నారు తమ ప్రతినిధులను నియమించుకుని కార్మికులు ప్రతి నెలా పంపే సొమ్మును హవాలా ద్వారా కార్మికుల ఇళ్లలో చెల్లిస్తున్నారు. దొరకని లెక్కలు.. భారత్ నుంచి ఇరాక్‌కు నేరుగా వెళ్లే అవకాశం లేకపోవడం.. ఏజెంట్లు వయా దుబాయిగా ఇరాక్‌కు పంపుతుండడంతో ఇక్కడి నుంచి ఇరాక్‌కు వెళ్లిన వారెందరు అనే లెక్క తేలడం కష్టంగా మారింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి వేలాది మంది ఇరాక్ వెళ్లినప్పటికీ వారిలో చాలా మంది దుబాయ్ నుంచి వెళ్లడంతో వారికి సంబంధించిన వివరాలు తెలియరావడం లేదు. దీంతో ఇరాక్‌లో ఉన్న వారి లెక్క కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున కసరత్తు చేస్తోంది.