బతుకుతమనుకోలె! | Iraq victims are safely return to home land | Sakshi
Sakshi News home page

బతుకుతమనుకోలె!

Published Sat, Jul 19 2014 2:59 AM | Last Updated on Sat, Sep 2 2017 10:29 AM

బతుకుతమనుకోలె!

బతుకుతమనుకోలె!

ఎక్కడా చూసినా బాంబుల మోతలే...ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఓ అడవి ప్రాంతంలో తలదాచుకున్నం...తిండి లేదు... నిద్రలేదు... మురుగునీళ్లు తాగినం... ఇంటికి వస్తామన్న ఆశలేదు. జేబులో పైసల్లేవు... మా బాధ ఏం చెప్పాలె.. కళ్లు మూసుకుంటే ఇల్లు.. తల్లిదండ్రులు.. పెళ్లాం పిల్లలే కనబడేవారు. వారికి ఆఖరు చూపైనా దక్కుతుందా లేదా అని బోరున ఏడ్చాం.
 
ఊర్లో ఉపాధి లేదని ఇంతదూరం వచ్చినం.. చివరకు ఊరు కాని ఊరు.. దేశం కాని దేశంలో పానాలు పోగొట్టుకుంటున్నామా అన్న బాధతో ఏడ్చాం. అక్కడ మమ్మల్ని పట్టించుకునే వారు లేరు. మా గోడు వినేవారు లేరు. చివరకు ఆ భయంకర పరిస్థితుల నుంచి బయటపడినం. ఇంటికి చేరి పిల్లాజెల్లలతో కలిసినం అంటూ ఇరాక్‌కు వెళ్లి అంతర్యుద్ధంలో నలిగిన వలస కూలీలు వారి బాధలు చెప్పుకున్నారు.
 
రుణపడి ఉన్నాం
లక్ష 25 వేలు బాకీ చేసి కొడుకును కానని దేశం పంపిస్తే వట్టి చేతులతో ప్రాణాలు కాపాడుకుని ఇంటి కొచ్చాడు. ఇంట్లో మాకే గంజీగాసం సరిగ్గాలేక ఇబ్బంది పడుతున్నాం. గవర్నమెంటు అధికారులు, నాయకులు మా పిల్లల్ని ఊరికి క్షేమంగా పంపినందుకు రుణపడి ఉన్నాం. అప్పులు తీర్చి కుటుంబం గడిచేందుకు సహాయం చేస్తే పుణ్యం ఉంటది.
- గుండెవోని పెంటయ్య, బాధితుడు యాదయ్య తండ్రి  
 
తిరిగి వచ్చేది కష్టమన్నారు
దూర దేశంలో మా భర్త పడుతున్న కష్టాలు తెలుస్తుంటే తిండి తినబుద్ధి కాలేదు. అన్నీ నిద్రలేని రాత్రులే. తిరిగి వచ్చేది కష్టమన్నారు. అలసు బతికున్నది కూడా పక్కాగా ఎవరికి తెలుసు... అంటూ ఒక్కొక్కరు ఓ విధంగా మాట్లాడుతుంటే భయమేసింది. ఆయన కట్టిన తాళిబొట్టు గట్టిదైతే సల్లంగా తిరిగొస్తాడని అనుకున్నా... దేవుడి దయవల్ల వచ్చాడు.
 - జ్యోతి, పిడుగు మల్లేశం భార్య
 
బాధితులను చేర్చినందుకు కృతజ్ఞతలు
మా గ్రామం నుంచి ఇరాక్ వలస వెళ్లి ఇబ్బందులకు గురైన ఆరుగురిని క్షేమంగా ఇంటికి చేర్చడంలో చొరవ చూపిన ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, జిల్లా అధికారులు, ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఇప్పటి వరకు విదేశాలకు వలస వెళ్లిన పలువురు చనిపోవడంతో ఇరాక్ బాధితుల కుటుంబ సభ్యులు ఆందోళన పడ్డారు. బాధితులను కుటుంబసభ్యులకు కలిసే అదృష్టం చేసినందుకు గ్రామంలో సంతోషంగా ఉంది.
- నర్సిములు నాయుడు, ఎంపీటీసీ సభ్యుడు
 
ఒక్క రొట్టెలో ఆరు ముక్కలు
యుద్ధ సమయంలో తిండి కోసం అవస్థలు పడ్డామని చెప్పారు. ‘కాంట్రాక్టర్ తన ఇష్టం వచ్చినప్పుడు వచ్చి ఇంత తిండి వేసేవాడు. మాతో పాటు మరో 143 మంది బాధితులున్నారు. ఒక్క రొట్టె(కబూస్)ను ఆరు ముక్కలుగా చేసి ఆరుగురికి ఇచ్చాడు. కొత్తిమీర, గర్కగడ్డితో చేసింది పెట్టారు. తిండిని ఆకలికి భరించలేక తిన్నాం.
 
‘‘పెట్టిందంతా తినాలి.. లేకుంటే చస్తారు’’ అంటూ ఇరాక్ భాషలో గుడ్లురుమి చూసి భయపెట్టారు. ప్లేటు అన్నంలో ఆరుగురం తిన్నాం. ఇట్లా 11 దినాలు గడిపాం. మరో రెండ్రోజులు పక్కనే ఉన్న రేని పండు వంటి కాయలు తిని ఆకలి తీర్చుకున్నాం. 10 కిలోల ఆలుగడ్డ కూరలో 50 లీటర్ల నీళ్లు, పావు కిలో పచ్చిమిర్చి, ఐదారు టమాటలు వేసి వండిన నీళ్లచారుకు చిన్నపిల్లలు తినేంత అన్నం ముద్ద వేసేవారు.’ అని బాధితులు ఆ చేదు ఘటనలను గుర్తు చేసుకున్నారు.
 
ఎప్పుడు కాలుస్తారోనని భయపడ్డాం
ఇరాక్ వెళ్లేందుకు లక్ష రూపాయలు ఏజెంట్‌కు చెల్లించాం. ఆడికి పోయినాక నిర్మానుష్యంగా ఉన్న ఎయిర్‌పోర్ట్‌ను చూడగానే భయం కలిగింది. కన్స్‌ట్రక్షన్ కంపెనీకి వెళ్లగానే చిన్నగదిలో 33 మంది చొప్పున వదిలేశారు. తిండి ఘోరంగా ఉండేది. ఉదయం కబూస్ (రొట్టె), సాస్ ఇచ్చేవారు.

క్యాంపులో బాత్‌రూంలు కూడా లేవు. స్నానాలకు, తాగడానికి మురికినీళ్లే దిక్కయ్యాయి. ఇట్లా నెల రోజులు హరిగోసపడ్డాం. గదిలో గాలి ఆడక గిన్నెలను విసన కర్రలుగా ఊపుకున్నాం. వీసాలు లాక్కుని కలివేలు (వీసాలు కోల్పోయిన వ్యక్తులు)గా దిక్కులేని పక్షులను చేస్తామని బెదిరిచిండ్రు.
 
యుద్ధం జరుగుతున్నప్పుడు ఇక బతుకుతామనుకోలేదు. బందీలుగా ఉన్నప్పుడు వేరే దేశం వ్యక్తి ఒకాయన అప్పుడప్పుడు మాకు తిండిపెట్టాడు. ఆయన సాయంతో విదేశీ వలస జీవుల హెల్ప్‌లైన్ నారాయణ ద్వారా ఎంబీఎస్ కార్యాలయానికి సమాచారం అందించాం. అయినా ఇంటికి చేరుతామనే నమ్మకం లేదు. బతుకుల మీద ఆశ అంతకన్నా లేదు. తెలంగాణ నుంచి వెళ్లిన 58 మందిమి ఐదు బస్సుల్లో నదాబ్ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చాం.
 
తిరుగు ప్రయాణంలోనూ ఎక్కడ బాంబు పెడతారోనని, ఎప్పుడు తుపాకులతో కాలుస్తారో అనే భయపడ్డాం. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో దిగాక ధైర్యమోచ్చింది. సొంత ఊరును చూసే అదృష్టం కలిగించారు. రెండు బోర్లు వేసి అప్పుల పాలయ్యాను. అప్పును తీర్చేందుకు దూర దేశం వెళ్లి ఖాళీ చేతులతో తిరిగొచ్చాను. ఇద్దరు పెళ్లీడుకొచ్చిన కూతుర్లు ఉన్నారు.        
 
 - పాలెపల్లి చంద్రయ్య, ఇరాక్ బాధితుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement