ఇరాక్ నుంచి స్వదేశానికి..
స్వదేశానికి చేరిన గల్ఫ్ బాధితులు
జన్నారం/సిరిసిల్ల: ఇరాక్ బాధితులు ఎట్టకేలకు మాతృభూమిపై అడుగుపెట్టారు. ఎన్నారై శాఖ మంత్రి కేటీఆర్ సహాయంతో తెలంగాణ గల్ఫ్ వెల్ఫేర్, కల్చరల్ అసోసియేషన్ అధికార ప్రతినిధి పాట్కూరి బసంతరెడ్డి, ఇరాక్ ప్రతినిధి మాటేటి కొమురయ్య, ఎంబసీ అధికారి దీపక్‌విజ్ఞాని కృషితో సోమవారం తెల్లవారుజామున ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. వీరికి ఢిల్లీలో బసంతరెడ్డి స్వాగతం పలికారు. మంత్రి కేటీఆర్ ఆదేశంతో తెలంగాణ భవన్ అసిస్టెంట్ కమిషనర్ రామ్మోహన్.. వారిని తెలంగాణ భవన్‌కు తీసుకొచ్చి వసతి, భోజన ఏర్పాటు చేశారు. రైలు టిక్కెట్లు ఇచ్చి హైదరాబాద్‌కు సాగనంపారు.
ఢిల్లీ నుంచి ఎపీ ఎక్స్‌ప్రెస్‌లో బయల్దేరిన బాధితులు మంగళవారం ఉదయం మంచిర్యాల రైల్వేస్టేషన్‌కు చేరుకొని, అక్కడినుంచి తమ స్వగ్రామాలకు వెళతారు. ఇరాక్‌లో చిక్కుకున్న వీరి దీనగాథను ‘సాక్షి’ వెలుగులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణ గల్ఫ్ వెల్ఫేర్, కల్చరల్ అసోసియేషన్ అధికార ప్రతినిధి పాట్కూరి బసంతరెడ్డి విషయాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి.. ఆయన కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అక్కడి అధికారులు బాధితులకు ఎలాంటి జరిమానా లేకుండా ఆదివారం గల్ఫ్ నుంచి పంపించగా.. సోమవారం వారు ఢిల్లీ చేరుకున్నారు.
చాలా బాధలు పడ్డా..
ఏడాది కింద ఇరాక్‌కు వెళ్లిన. రెండు నెలలు పని చేసిన తర్వాత అకామా లేదని పని చేయడం కుదరదన్నరు. ఏజెంట్‌ను సంప్రదిస్తే దాటవేసి దొరక్కుండా పోయిండు. దొంగచాటుగా రోజు విడిచి రోజు పని చేస్తూ కడుపునింపుకున్నా. ‘సాక్షి’ పేపర్‌లో వచ్చిన వార్తలతో ప్రభుత్వం స్పందించడంతోనే ఇండియాకు వచ్చిన. మంత్రి కేటీఆర్, ‘సాక్షి’ పేపర్‌కు రుణపడి ఉంటా.
– మేడి ప్రవీణ్, వెల్గటూర్, కరీంనగర్ జిల్లా
‘సాక్షి’ని మరిచిపోను
మేము ఇరాక్‌లో పడుతున్న ఇబ్బందులపై ‘సాక్షి’ పేపర్‌లో వచ్చిన వార్త చదివి బసంతరెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయారు. పలుసార్లు ఇరాక్‌లో ఉంటున్న మాటేటి కొమురయ్యతో ఎర్బిల్‌లోని భారత రాయబార కార్యాలయానికి పంపి వారిపై ఒత్తిడి తేవడంతోనే మమ్ములను పంపారు. మా రాకకు కారణమైన ‘సాక్షి’కి, మంత్రి కేటీఆర్, బసంతరెడ్డిలకు ధన్యవాదాలు.
– దుర్గం రవి, ఇప్పలపల్లి, జన్నారం, మంచిర్యాల జిల్లా
ఉపాధి కల్పించాలి
ఏజెంట్ల మోసానికి గురై, అప్పుల పాలైన తెలంగాణ కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి. దళారీ వ్యవస్థను ప్రభుత్వం రూపుమాపాలి. నకిలీ ఏజెంట్ల మోసానికి ఇరాక్‌లో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. నకిలీ ఏజెంట్లను శిక్షించేందుకు కఠినమైన చట్టాలు తీసుకురావాలి. బాధితులను భారత్‌కు తీసుకురావడానికి కృషి చేసిన మంత్రి కేటీఆర్, ‘సాక్షి’కి ధన్యవాదాలు.
– బసంతరెడ్డి, గల్ఫ్ వెల్ఫేర్, కల్చరల్ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి