ఇనుప చక్రంతో రోడ్డెక్కితే రంగు పడుద్ది
కేజ్వీల్ ట్రాక్టర్లు, ఎడ్లబండ్లు ఇక జప్తు
జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు {పభుత్వ ఆదేశం
తీవ్రంగా దెబ్బతింటున్న రోడ్లు
కొత్త రోడ్ల నిర్మాణం నేపథ్యంలో కఠినంగా వ్యవహరించనున్న సర్కార్
హైదరాబాద్: ఇనుప పట్టాతో ఉన్న ఎడ్ల బండి రోడ్డెక్కితే ఇక ఎడ్లు, బండి రెండూ పోలీసు స్టేషన్కు వెళ్లాల్సిందే. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు త్వరలో స్పష్టమైన ఆదేశాలు అందనున్నాయి. పొలం పనులకు వాడే కేజ్ వీల్స్ (ఇనుప చట్రాల చక్రాలు) ఉన్న వాహనాల వల్ల రోడ్లు పాడవుతుండటంతో నేరుగా రోడ్లపై తిరగకూడదనే నిబంధనను కఠినతరం చేసే క్రమంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా రూ.10 వేల కోట్ల వ్యయంతో కొత్తగా రోడ్లు నిర్మిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ మేరకు కఠినంగా వ్యవహరించనుంది. మంగళవారం మధ్యాహ్నం రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆ శాఖ ఉన్నతాధికారులతో దీనిపై చర్చించారు.
ఐదేళ్లు మనాల్సిన రోడ్లు రెండేళ్లకే నాశనం
కేజ్ వీల్స్ బిగించిన ట్రాక్టర్లు, ఇనుప పట్టాలున్న ఎడ్ల బండ్ల మూలంగా ఐదేళ్లు మనాల్సిన రోడ్లు కాస్తా రెండేళ్లకే పూర్తిగా దెబ్బతింటున్నాయి. దీంతో వాటి మరమ్మతుకు కొత్త రోడ్డు నిర్మాణానికి అయ్యే ఖర్చు చేయాల్సి వస్తోంది. అసలే కాంట్రాక్టర్లు అంతంతమాత్రం నాణ్యతప్రమాణాలను పాటిస్తుండటంతో రోడ్లు ఎక్కువకాలం మన్నటం లేదు.
ఎడ్లబండ్లకూ టైర్లు...
రైతులు వ్యవసాయ పనుల సమయంలో మాత్రమే ఎడ్లబండ్లకు కేజ్ వీల్స్ ఏర్పాటు చేసి ఆ తర్వాత వాటిని తొలగించి సాధారణ టైర్లను బిగించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక చెరుకు పంట ఎక్కువగా సాగయ్యే ప్రాంతాల్లో చెరుకు తరలించే సమయంలో ఎడ్లబండ్లు భారీగా రోడ్లెక్కుతున్నాయి. దీనిపై రైతుల్లో విస్తృతస్థాయిలో అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించింది. ఒకసారి చెప్పినా మళ్లీ ఆ వాహనం రోడ్డెక్కితే సీజ్ చేయాలని ఆదేశాలివ్వనుంది. వెంటనే ఇది అమలులోకి రాబోతోంది.