నీటి భద్రతతోనే భరోసా!
దేశ ఆహార భద్రతతో ముడివడి ఉన్న వ్యవసాయ రంగం మనుగడ సాగునీటి భద్రతపై ఆధారపడి ఉంది. వాతావరణ మార్పుల నేపథ్యంలో సాగు నీటి భద్రతకు నోచుకోని రైతులు నిత్యం ఆత్మహత్యల పాలవుతున్నారు. సంప్రదాయ, ఆధునిక పద్ధతుల కలబోతతో నీటి భద్రత సాధనకు నిర్మాణాత్మక చర్యలు తీసుకోవాల్సిన తరుణం ఇది. నీటి యాజమాన్యంలో గ్రామపంచాయితీలకు ముఖ్యభూమిక కల్పించడం అవసరం.
సమాజ మనుగడకు ఆహార భద్రతకు నీరు జీవనాధారమైన వనరు. మన దేశంలో మంచినీటి వాడకం సింహ భాగం(75 శాతం) వ్యవసాయానికే వెచ్చిస్తున్నాం. భూగర్భ జలాలు అడుగంటుతున్న కాలంలో తీవ్ర నీటి ఎద్దడి ఎదురవుతోంది. మరో వైపు పారిశ్రామిక అవసరాలు పోటి పడుతున్నాయి. గత రెండు దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భూగర్భ జలాలే సాగు నీటి అవసరాలను తీరుస్తున్నాయి. ఆధునిక నీటిపారుదల ప్రాజెక్ట్‌లు, సంప్రదాయ చెరువులు ఆశించిన మేర ఫలితాలనివ్వలేక పోతున్నాయి. ప్రాజెక్టుల కింద ఆయకట్టు రైతులకు కూడా నీటి లభ్యతపై భరోసా లేకుండా పోతోంది. వాతావరణ మార్పులు కూడా ఇందుకు కారణమౌతున్నాయి.
గృహావసరాలు, సాగుకు వాడిన నీటిలో 40-50% తిరిగి నీటి వనరులను చేరి కాలుష్య కారకాలవుతున్నాయి. గ్రామాల్లో బావులు ఎండిపోయి, చెరువులు నీటి నిల్వ సామర్థ్యాన్ని కోల్పోతున్నాయి. సాగు నీరందక రైతులు ఆత్మహత్యల పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో జలవనరుల సంరక్షణ దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ముందడుగేయాలి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 80 వేల చెరువులు అస్థిత్వాన్ని కోల్పోయాయి. తెలంగాణ ప్రభుత్వం చెరువుల పునరుద్ధరణ చర్యలు చేపట్టనున్నట్లు ప్రకటించడం ముదావహం. స్థానిక జలవనరుల పునరుద్ధరణ కృషిలో గత అనుభవాలు, స్వచ్ఛంద సంస్థల నమూనాలను పరిగణనలోకి తీసుకోవాలి. రైతులు, నీటి సంఘాలు, గ్రామ పంచాయితీలను భాగస్వాములను చేయాలి.
చెరువుల పునరుద్ధరణకు సూచనలు
గ్రామ పంచాయితీ, నీటి సంరక్షణసంఘాల నేతృత్వంలో రైతులను భాగస్వాములుగా చేసి రైతులే స్వచ్ఛందంగా పూడిక తీత చర్యలు చేపట్టే విధంగా చైతన్యవంతులను చేయాలి. చెరువు పూడిక తీసి.. ఆ మట్టిని పొలాలకు తరలించాలి. చెరువులు లోతై నీటి నిలువ సామర్థ్యం పెరుగుతుంది. ఈ మట్టి ద్వారా పొలాలు సారవంతమవుతాయి కాబట్టి రసాయనిక ఎరువుల వాడకం తగ్గుతుంది. చెరువుల నుంచి పూడిక మట్టిని తరలించే రైతుల వద్ద నుంచి చెరువుల నిర్వహణ కోసం కొద్దిపాటి పన్ను వసూలు చేయడం ద్వారా పంచాయితీలు బలోపేతమవ్వాలి.అధిక వర్షాలను తట్టుకునే విధంగా చెరువుల అలుగులు లేదా మత్తడులను డిజైన్లు మార్చాలి.
ఇంకుడు బావులుగా పాత బావులు!
తరాలుగా బావుల మీద ఆధారపడి వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నాం. బావులు ఎండిపోయి పూడికతో నిండిపోయాయి. ఇలాంటి బావులను పూడిక తీసి ఇంకుడు బావులుగా మార్చడం ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం పొందవచ్చు. ప్రభుత్వాలు వీటిపై పెద్దగా దృష్టి పెట్టడం లేదు. కొన్ని చోట్ల ఉమ్మడి బావుల మీద ఆధారపడి సాగు కొనసాగుతోంది. ఇలాంటి బావుల్లోనూ పూడికతీత పనులు చేపడితే రైతులకు లాభదాయకంగా ఉంటుంది. కొత్తగా బోరుబావులు తవ్వాల్సిన అవసరం ఉండదు. ఒక వైపు సంప్రదాయ జల వనరులను సంరక్షించుకుంటూనే వాటర్‌షెడ్ వంటి సాంకేతిక పద్ధతులను ఉపయోగించి నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలి. తక్కువ నీటితో సాగు సాధ్యమయ్యే విధానాల మీద పరిశోధనలు ప్రారంభించాలి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 30 లక్షలకు పైగా బోరుబావులున్నాయి. నీరు ఎండిపోయిన బోరు బావులను రీచార్జ్ చేసే పద్ధతులను ప్రోత్సహించాలి. తక్కువ నీరు అందుబాటులో ఉన్న బోరుబావులకు ‘ఒక ఎకరం డ్రిప్పు పద్ధతి’ని అందుబాటులోకి తేవాలి. బిందు సేద్య విధానాన్ని మెరుగుపరచడం, ఆటో స్టాపర్ పరికరాలను ఏర్పాటు చేయడం అవసరం. నీటి భద్రత విషయంలో సంస్థాగత మార్పులు, ప్రయోగాలు చేపట్టాలి. క్షేత్రస్థాయిలో గ్రామ పంచాయితీలను ఆర్థికంగా బలోపేతం చేసి నీటి యాజమాన్యంలో ముఖ్యభూమిక వహించేట్లు చేయాలి.
నీటి భద్రతకు నాలుగు ప్రధానాంశాలు
నీటి భద్రత సాధనకు చేపట్టాల్సిన ప్రధానాంశాలు: 1. సంప్రదాయ నీటి వనరుల సంరక్షణ. 2. నీటి వినియోగ సామర్థ్యం పెంపుదలకు నూతన సాంకేతిక ఆవిష్కరణలు. 3. పట్టణాల చుట్టుపక్కల ఉన్న సాగు వనరుల కాలుష్య నియంత్రణ. 4. నీటి శుద్ధి, తిరిగి వాడకాన్ని ప్రోత్సహించడం. తాగు, సాగు నీటి వాడకంతోపాటు.. మురుగునీటి శుద్ధి, తిరిగి వాడకానికి సంబంధించిన వ్యూహాల మేళవింపుతో ప్రాజెక్టుల రూపకల్పన జరగాలి. నీటి ‘జీవిత చక్రం’ విధానాన్ని అవలంబించడం ద్వారా మాత్రమే భవిష్యత్ తరాలకు జలనిధులను అందిచగలం. ముందుచూపుతో ఇందుకు అవసరమైన అన్ని చర్యలను పాలకులు చేపట్టాలి.
(వ్యాసకర్త జల వనరుల నిపుణులు, ‘సుగమ్’ ప్రాజెక్టు)