Irrigation experts
-
'కృష్ణా'పై ఇదేం కిరికిరి?
సాక్షి, అమరావతి: ఉమ్మడి రాష్ట్రానికి బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీల కృష్ణా జలాలను రెండు రాష్ట్రాలకు చెరి సగం పంపిణీ చేయాలని తెలంగాణ సర్కారు తాజాగా కృష్ణా బోర్డుకు లేఖ రాయడాన్ని నీటిపారుదల రంగ నిపుణులు తప్పుబడుతున్నారు. బచావత్ ట్రిబ్యునల్ ప్రాజెక్టుల వారీగా చేసిన కేటాయింపుల ఆధారంగా ఏపీకి 512.04, తెలంగాణకు 298.96 టీఎంసీలను పంపిణీ చేస్తూ 2015 జూన్ 19న కేంద్రం తాత్కాలిక సర్దుబాటు చేసింది. దీనికి అంగీకరిస్తూ తెలంగాణ ప్రభుత్వం సంతకం కూడా చేసింది. 2017–18 నీటి సంవత్సరంలో ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో ఆవిరి నష్టాలు పోనూ లభ్యతగా ఉన్న నీటిని 66 : 34 చొప్పున పంపిణీ చేసుకునేందుకు ఏపీ, తెలంగాణ అంగీకరించాయి. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వెలువడే వరకూ ఇదే పద్ధతిలో నీటిని పంచుకోవాలని నిర్ణయించడంతో 2018–19, 2019–20, 2020–21, 2021–22లలో అదే విధానం ప్రకారం నీటిని కృష్ణా బోర్డు పంపిణీ చేస్తూ వస్తోంది. పదే పదే పేచీ.. తెలంగాణ సర్కార్ 2015, 2017–18లలో కుదిరిన ఒప్పందాలను తుంగలో తొక్కుతూ ప్రస్తుత నీటి సంవత్సరంలో కృష్ణా జలాల పంపిణీపై పదేపదే పేచీకి దిగుతోంది. రెండు రాష్ట్రాలకు చెరి సగం పంపిణీ చేయాలని తెలంగాణ సర్కార్ లేఖ రాయడంతో మే 6న నిర్వహించే బోర్డు సర్వ సభ్య సమావేశంలో చర్చించాలని బోర్డు ఛైర్మన్ ఎంపీ సింగ్ నిర్ణయించి అజెండాలో చేర్చారు. చెరి సగం అసాధ్యం.. కృష్ణా నదిలో 75 శాతం నీటి లభ్యత ఆధారంగా 2,060 టీఎంసీలు, పునరుత్పత్తి 70 టీఎంసీలతో కలిపి 2,130 టీఎంసీలు అందుబాటులో ఉంటాయని అంచనా వేసిన బచావత్ ట్రిబ్యునల్.. మహారాష్ట్రకు 585, కర్ణాటకకు 734, ఏపీకి 811 టీఎంసీలను కేటాయించింది. మిగులు జలాలను హక్కుగా కాకుండా వినియోగించుకునే స్వేచ్ఛను దిగువ రాష్ట్రమైన ఏపీకి ఇచ్చింది. ► ఉమ్మడి రాష్ట్రానికి బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీల్లో 1976కు ముందే పూర్తయిన ప్రాజెక్టులకు 749.16 టీఎంసీల వాటా కల్పించింది. నిర్మాణం, ప్రతిపాదన దశలో ఉన్న జూరాలకు 17.84, శ్రీశైలంలో ఆవిరి నష్టాలకు 33 టీఎంసీల వాటా ఇచ్చింది. పునరుత్పత్తి కింద 11 టీఎంసీలు కేటాయించింది. ► ఆ కేటాయింపుల ఆధారంగానే ఏపీకి 512.04, తెలంగాణకు 298.96 టీఎంసీలను పంపిణీ చేస్తూ 2015లో కేంద్రం తాత్కాలిక ఏర్పాటు చేసింది. ► బచావత్ ట్రిబ్యునల్ తీర్పు సుప్రీం కోర్టు డిక్రీతో సమానం. దాన్ని పునఃసమీక్షించడం చట్టవిరుద్ధం కాబట్టే బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ వాటిని కొనసాగించింది. వీటిని పరిగణలోకి తీసుకుంటే చెరి సగం వాటా కావాలని తెలంగాణ సర్కార్ లేఖ రాయడం చట్టవిరుద్ధమని న్యాయ నిపుణులు తేల్చి చెబుతున్నారు. -
నదులకు జలకళ
సాక్షి, అమరావతి: నైరుతి రుతు పవనాల ప్రభావం వల్ల నదీ పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా, గోదావరి, వంశధార, నాగావళి నదుల్లో వరద ప్రవాహం ప్రారంభమైంది. నీటి సంవత్సరం ప్రారంభంలోనే నదులు జలకళను సంతరించుకోవడం.. జలాశయాల్లోకి వరద ప్రవాహం చేరుతుండటం శుభసూచకమని సాగునీటి రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ‘కృష్ణా’లో పరవళ్లు ► పశ్చిమ కనుమల్లో జూన్ 2 నుంచే వర్షాలు కురుస్తుండటంతో జూన్ 5 నుంచే కృష్ణా నదిలో ప్రారంభమైన వరద ప్రవాహం క్రమేణా పెరుగుతోంది. శనివారం ఆల్మట్టి జలాశయంలోకి 57,346 క్యూసెక్కులు చేరడంతో నీటి నిల్వ 45.9 టీఎంసీలకు చేరుకుంది. ► 19 రోజుల్లోనే 17.8 టీఎంసీలు ఆల్మట్టిలోకి చేరాయి. ఆల్మట్టిలోకి ఈ స్థాయిలో నీరు ఎన్నడూ చేరలేదని అధికారవర్గాలు చెబుతున్నాయి. ► కృష్ణా ప్రధాన ఉప నదులైన బీమా, తుంగభద్ర నదుల్లోనూ వరద ప్రవాహం ప్రారంభమైంది. భీమా నుంచి ఉజ్జయిని జలా శయంలోకి.. తుంగభద్ర నుంచి తుంగభద్ర జలాశయంలోకి వరద ప్రవాహం చేరుతోంది. ► వర్షాలు ఇదే రీతిలో కురిస్తే ఈ ఏడాది శ్రీశైలానికి ముందుగానే కృష్ణమ్మ చేరే అవకాశం ఉంది. ► ఈ ఏడాదీ కృష్ణాలో నీటి లభ్యత బాగుంటుందని సాగునీటి రంగ నిపుణులు వేస్తున్న అంచనాలు ఆయకట్టు పరిధిలోని రైతుల్లో ఆనందాన్ని నింపుతోంది. గోదావరి నిండా జలసిరి ► గోదావరి నదిలో వరద ప్రవాహం క్రమేణా పెరుగుతోంది. శనివారం ధవళేశ్వరం బ్యారేజీకి 25,978 క్యూసెక్కుల ప్రవాహం రాగా.. డెల్టాకు 12,500 క్యూసెక్కులు విడుదల చేసి మిగులుగా ఉన్న 13,478 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలారు. ► జూన్ 1 నుంచి ఇప్పటివరకు 8.328 టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలవడం గమనార్హం. ► వంశధార నది నుంచి గొట్టా బ్యారేజీలోకి చేరే వరద పెరుగుతోంది. బ్యారేజీకి 2,012 క్యూసెక్కుల వరద రాగా.. అంతే స్థాయిలో కాలువలకు, సముద్రంలోకి వదిలారు. ► నాగావళి నది నుంచి తోటపల్లి బ్యారేజీలోకి 898 క్యూసెక్కులు చేరుతున్నాయి. బ్యారేజీ గరిష్ట నీటి నిల్వ 2.51 టీఎంసీలు కాగా.. ఇప్పటికే 2.039 టీఎంసీలకు చేరడంతో కాలువలకు 639 క్యూసెక్కులు విడుదల చేసి.. 462 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ఆ జలాలు నారా యణపురం ఆనకట్టను చేరుతున్నాయి. -
హనుమంతరావు మృతికి పలువురి సంతాపం
సాక్షి, హైదరాబాద్: సాగునీటి రంగ నిపుణుడు, రిటైర్డ్ ఈఎన్సీ టి.హనుమంతరావు మృతిపై రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు, రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాజస్తాన్ లో నీటి వనరుల అభివృద్ధికి హనుమంతరావు అందించిన సేవలు మరువ లేనివని వసుంధర కొనియాడారు. చిన్న నీటిపారుదల రంగంలో హనుమంతరావు ప్రయో గాలు ప్రామాణికంగా ఉన్నట్టు మంత్రి హరీశ్‌రావు గుర్తుచేశారు. తెలంగాణలో గుర్తింపుపొందిన ఇంజనీర్లలో హనుమంతరావు ఒకరని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. హనుమంతరావు అంత్యక్రియలు మంగళవారం జరుగనున్నాయి. హనుమంతరావు మృతి పట్ల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి సంతాపం తెలిపారు. నీటిపారుదల శాఖలో వివిధ హోదాల్లో పనిచేసి, చతుర్విద జల ప్రకియను అభివృద్ధి చేశారని పేర్కొన్నారు. ఆయన రూపొందించిన టెక్నాలజీని పలు దేశాల్లో, మన దేశంలోని వివిధ రాష్ట్రాలు ఉపయోగించుకుని తక్కువ ఖర్చుతో వ్యవసాయాన్ని సాగిస్తున్నారని నివాళులర్పించారు. ఐక్యరాజ్యసమితికి సలహాదారుగా వ్యవహరించడంతోపాటు ఆఫ్రికా, ఆసియా, పసిఫిక్ దేశాల్లో పలు సాగునీటి ప్రాజెక్టుల అమల్లో భాగస్వాములయ్యారని పేర్కొన్నారు. శ్రీరాం వెదిరె సంతాపం సాక్షి, న్యూఢిల్లీ: నీటి పారుదల రంగ నిపుణులు టి.హనుమంతరావు మృతికి కేంద్ర జలవనరుల శాఖ సలహాదారు శ్రీరాం వెదిరె సంతాపం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ సహా దేశవ్యాప్తంగా నీటి పారుదల రంగానికి సేవలందించి హనుమంతరావు మార్గదర్శిగా నిలిచారని ఆయన సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
‘పట్నం’ జలసిరికి కొర్రీ!
దశాబ్దాలుగా నీళ్లులేక నోళ్లు తెరిచిన చారిత్రక ఇబ్రహీంపట్నం చెరువుకు జలకళ సంతరింపజేసే విషయంలో జలమండలి కొర్రీలు పెడుతోంది. ఇప్పటికే పూర్తయిన కృష్ణా మూడో దశ పైపులైన్ ద్వారా నల్గొండ జిల్లా కోదండాపూర్ ఏఎంఆర్పీ కాల్వ నుంచి గ్రేటర్ హైదరాబాద్‌కు 90 ఎంజీడీల కృష్ణాజలాలను తరలించనున్నారు. అయితే ఇదే మార్గంలోఉన్న ఈ చెరువును శుద్ధిచేయని (రా వాటర్) జలాలతో నింపే అవకాశం ఉన్నప్పటికీ జలమండలి అభ్యంతరం వ్యక్తం చేయడం ‘పట్నం’ చెరువుకు శాపంగా పరిణమిస్తోంది. చెరువును నింపే విషయంలో వాటర్‌బోర్డు అధికారుల మోకాలడ్డు! - కృష్ణా మూడోదశ ద్వారా మొత్తం తరలించనున్న నీరు 5.5 టీఎంసీలు - పట్నం చెరువు నింపడానికి అవసరమయ్యేది 0.5 టీఎంసీలే - సాంకేతికంగా సాధ్యమేనంటున్న నీటిపారుదల రంగ నిపుణులు సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ‘పట్నం’ చెరువు నింపే అంశంపై వాటర్‌బోర్డు యంత్రాంగం మల్లగుల్లాలు పడుతోంది. చెరువు నింపేందుకు అన్ని రకాలుగా అవకాశాలున్నప్పటికీ అధికారులు తటపటాయిస్తున్నారు. ఇటీవల గులాబీ గూటికి చేరిన స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఇబ్రహీంపట్నం చెరువును శుద్ధిచేయని జలాలతో నింపాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును కోరిన విషయం తెలిసిందే. ఈ ప్రధాన డిమాండ్ నెరవేర్చేందుకు హామీ ఇచ్చినందునే పార్టీలో చేరుతున్నట్లు కిషన్‌రెడ్డి ప్రకటించారు కూడా. అయితే చెరువు నింపేందుకు అన్ని అవకాశాలున్నప్పటికీ వాటర్‌బోర్డు అధికారులు అందుకు ససేమిరా అనడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇబ్రహీంపట్నంలో ఇటీవల జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. ఖరీదైన శుద్ధి చేసిన జలాలతో చెరువును నింపడం సాధ్యంకాదని.. కానీ రా వాటర్‌ను నింపే అంశంపై అధ్యయనం చేస్తామని ప్రకటించడంతో స్థానికుల్లో కొత్త ఆశలు చిగురించాయి. 0.5 టీఎంసీలు చాలు! ఇబ్రహీం కులీ కుతుబ్‌షా నిర్మించిన ఈ చెరువు సామర్థ్యం 0.5 టీఎంసీలు మాత్రమే. ఒకసారి ఈ చెరువు నిండితే మూడేళ్లలో సుమారు 42 గ్రామాల కరువు తీరనుంది. సబ్బండ చేతివృత్తుల కులాలకు కరువుతీరా ఉపాధి లభించనుంది. అయితే, ఈ చెరువు నింపే అంశంపై సానుకూలంగా స్పందిస్తే కోదండాపూర్ నుంచి సాహెబ్‌నగర్ (103 కి.మీ) వరకు మార్గమధ్యంలోని చెరువులకు కూడా జలాలను తరలించాలనే డిమాండ్ వస్తుందని జలమండలి అనుమానిస్తోంది. దీంతో గ్రేటర్లో తాగునీటి అవసరాలకు ఈ పరిణామం ఆశనిపాతంగా మారుతుందని భావిస్తోంది. వాస్తవానికి కృష్ణా మూడో దశ కింద 40 ఫిల్టర్ బెడ్లను (కోదండాపూర్) పూర్తి చేయాల్సివుంది. దీంట్లో ఇప్పటికీ పది ఫిల్టర్ బెడ్లను మాత్రమే నిర్మించారు. వీటి ద్వారా 45 ఎంజీడీలను రాజధాని తాగునీటి అవసరాలకు తరలించారు. మరో 35 ఫిల్టర్బెడ్ల నిర్మాణానికి మూడు నెలల సమయం పట్టే అవకాశముంది. ఈ మధ్యకాలంలో 0.5 టీఎంసీల శుద్ధిచేయని జలాలతో ఇబ్రహీంపట్నం చెరువు నింపేందుకు అన్నివిధాలా అవకాశముందని, మూడోదశ ద్వారా తరలించనున్న మొత్తం 5.5 టీఎంసీల్లో 0.5 టీఎంసీల నీళ్లు పెద్ద విషయమేమీ కాదని నీటిపారుదలశాఖ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కానీ, ‘పట్నం’ చెరువుకు జలసిరి రాకుండా వాటర్‌బోర్డు ఉన్నతాధికారులు మోకాలడ్డుతుండడం చర్చనీయాంశంగా మారింది. చెరువు నింపడం తథ్యం: మంచిరెడ్డి శుద్ధిచేయని కృష్ణాజలాలతో ‘పట్నం’ చెరువును నింపేందుకు వాటర్‌బోర్డు కార్యాచరణ సిద్ధం చేస్తుంది. సోమవారం ఇదే అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశా. 35 ఫిల్టర్బెడ్ల నిర్మాణంలోపు నగరానికి వచ్చే 45 ఎంజీడీల నుంచి 0.5 టీఎంసీలను చెరువు నింపేందుకు ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చారు. వాటర్‌బోర్డు అధికారులు కూడా అందుకనుగుణంగా ప్రతిపాదనలు తయారు చేస్తున్నారు.