
సాక్షి, అమరావతి: నైరుతి రుతు పవనాల ప్రభావం వల్ల నదీ పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా, గోదావరి, వంశధార, నాగావళి నదుల్లో వరద ప్రవాహం ప్రారంభమైంది. నీటి సంవత్సరం ప్రారంభంలోనే నదులు జలకళను సంతరించుకోవడం.. జలాశయాల్లోకి వరద ప్రవాహం చేరుతుండటం శుభసూచకమని సాగునీటి రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
‘కృష్ణా’లో పరవళ్లు
► పశ్చిమ కనుమల్లో జూన్ 2 నుంచే వర్షాలు కురుస్తుండటంతో జూన్ 5 నుంచే కృష్ణా నదిలో ప్రారంభమైన వరద ప్రవాహం క్రమేణా పెరుగుతోంది. శనివారం ఆల్మట్టి జలాశయంలోకి 57,346 క్యూసెక్కులు చేరడంతో నీటి నిల్వ 45.9 టీఎంసీలకు చేరుకుంది.
► 19 రోజుల్లోనే 17.8 టీఎంసీలు ఆల్మట్టిలోకి చేరాయి. ఆల్మట్టిలోకి ఈ స్థాయిలో నీరు ఎన్నడూ చేరలేదని అధికారవర్గాలు చెబుతున్నాయి.
► కృష్ణా ప్రధాన ఉప నదులైన బీమా, తుంగభద్ర నదుల్లోనూ వరద ప్రవాహం ప్రారంభమైంది. భీమా నుంచి ఉజ్జయిని జలా శయంలోకి.. తుంగభద్ర నుంచి తుంగభద్ర జలాశయంలోకి వరద ప్రవాహం చేరుతోంది.
► వర్షాలు ఇదే రీతిలో కురిస్తే ఈ ఏడాది శ్రీశైలానికి ముందుగానే కృష్ణమ్మ చేరే అవకాశం ఉంది.
► ఈ ఏడాదీ కృష్ణాలో నీటి లభ్యత బాగుంటుందని సాగునీటి రంగ నిపుణులు వేస్తున్న అంచనాలు ఆయకట్టు పరిధిలోని రైతుల్లో ఆనందాన్ని నింపుతోంది.
గోదావరి నిండా జలసిరి
► గోదావరి నదిలో వరద ప్రవాహం క్రమేణా పెరుగుతోంది. శనివారం ధవళేశ్వరం బ్యారేజీకి 25,978 క్యూసెక్కుల ప్రవాహం రాగా.. డెల్టాకు 12,500 క్యూసెక్కులు విడుదల చేసి మిగులుగా ఉన్న 13,478 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలారు.
► జూన్ 1 నుంచి ఇప్పటివరకు 8.328 టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలవడం గమనార్హం.
► వంశధార నది నుంచి గొట్టా బ్యారేజీలోకి చేరే వరద పెరుగుతోంది. బ్యారేజీకి 2,012 క్యూసెక్కుల వరద రాగా.. అంతే స్థాయిలో కాలువలకు, సముద్రంలోకి వదిలారు.
► నాగావళి నది నుంచి తోటపల్లి బ్యారేజీలోకి 898 క్యూసెక్కులు చేరుతున్నాయి. బ్యారేజీ గరిష్ట నీటి నిల్వ 2.51 టీఎంసీలు కాగా.. ఇప్పటికే 2.039 టీఎంసీలకు చేరడంతో కాలువలకు 639 క్యూసెక్కులు విడుదల చేసి.. 462 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ఆ జలాలు నారా
యణపురం ఆనకట్టను చేరుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment