మే 5న జీఎస్ఎల్వీ ఎఫ్–09 ప్రయోగం
శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లోని రెండో ప్రయోగ వేదికపై నుంచి మే 5న సాయంత్రం 4.57 గంటలకు జీఎస్ఎల్వీ ఎఫ్–09ను ప్రయోగించనుంది. బుధవారం బ్రహ్మప్రకాష్ హాలులో జరిగిన మిషన్ సంసిద్ధతా సమావేశం (ఎంఆర్ఆర్)లో ఈ నిర్ణయం తీసు కున్నారు. ఎంఆర్ఆర్ కమిటీ చైర్మన్ బీఎన్ సురేష్ ఆధ్వర్యంలో ఇస్రోలోని అన్ని సెంటర్ల డైరెక్టర్లు సమావేశమై నిర్ణయం తీసుకున్నారు.
రెండో ప్రయోగ వేదికకు సంబంధించి వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్లో జీఎస్ఎల్వీ ఎఫ్–09 రెండు దశల అనుసంధానం పనులు పూర్తి చేశారు. మూడో దశ క్రయోజనిక్ దశను వచ్చే వారంలో అమర్చనున్నారు. సమావేశంలో షార్ డైరెక్టర్ పి కున్హికృష్ణన్, వీఎస్ఎస్సీ డైరెక్టర్ డాక్టర్ శివన్, ఎన్పీఎస్సీ డైరెక్టర్ ఎస్ సోమనాథ్, ఐపీఆర్సీ డైరెక్టర్ రాకేశ్, ఐసాక్ డైరెక్టర్ అన్నాదురైతో పాటు శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.