టీపీఎస్సీ ఆవిర్భావం
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం చైర్మన్‌గా ఘంటా చక్రపాణి..!
నేడో రేపో ఉత్తర్వులు మార్గదర్శకాలు ఖరారు
హైదరాబాద్: నిరుద్యోగులు ఎదురుచూస్తున్న తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీపీఎస్సీ) ఆవిర్భవించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్ శర్మ శుక్రవారం జీవో జారీ చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 315 ప్రకారం కొత్తగా ఏర్పడిన రాష్ట్రం పబ్లిక్ సర్వీసు కమిషన్‌ను ఏర్పాటు చేసుకోవచ్చని, ఆ నిబంధనల మేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్‌ను ఏర్పాటు చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆర్టికల్ 320 ప్రకారం కమిషన్ నిర్వహణ నియమావళి ఉంటుందని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం జూన్ 2న ఆవిర్భవించిందని, దీంతో కమిషన్ ఏర్పాటు ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని గెజిట్ నోటిఫికేషన్లో ప్రచురించనున్నట్లు వెల్లడించారు. తెలంగాణలో ఉద్యోగాల భర్తీ బాధ్యతలను వెంటనే కమిషన్ చూస్తుందని పేర్కొన్నారు. అలాగే, టీపీఎస్సీ చైర్మన్‌గా బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణిని నియమించనున్నారు. ఒకటీ రెండు రోజుల్లో ఆయన నియామక ఉత్తర్వులు వెలువడనున్నాయి. కమిషన్ సభ్యులను ప్రభుత ్వం నియమించనుంది. మరోవైపు కమిషన్ మార్గదర్శకాలను జారీ చేయనుంది. కమిషన్ ఏర్పాటుకు గవర్నర్ నరసింహన్ ఆమోద ముద్ర వేసిన రెండు రోజులకే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం విశేషం.
సభ్యుల నియామకంపై కసరత్తు..
టీపీఎస్సీలో ఎంతమందిని మొదట సభ్యులుగా నియమించేలా అంశంపైనా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వారి నియామకాలకు సంబంధించి కూడా మూడు నాలుగు రోజుల్లో ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. వీలైతే చైర్మన్ నియామకంతోపాటే సభ్యుల నియామక ఉత్తర్వులు కూడా జారీ చేయనుంది. గతంలో ఏపీపీఎస్సీ ఏర్పాటు చేసినపుడు ముగ్గురు సభ్యులు, ఒక చైర్మన్‌తో మొత్తంగా నలుగురితో ఏపీపీఎస్సీ ఏర్పాటైంది. ఆ తరువాత క్రమంగా సభ్యులను సంఖ్య రాష్ట్ర ప్రభుత్వం తమ అభీష్టం మేరకు పెంచుకుంది. అలాగే, ప్రస్తుతం టీపీఎస్సీలో కూడా నలుగురు లేదా ఐదుగురు సభ్యులు, ఒక చైర్మన్‌ను నియమించనుంది. ఆ తరువాత అవసరం అనుకుంటే సభ్యుల సంఖ్యను పెంచాలని భావిస్తోంది. కార్యదర్శిగా అనుభవం కలిగిన ఐఏఎస్ అధికారిని నియమించే ఆలోచనలు చేస్తోంది.
త్వరలో ఉద్యోగాల భర్తీపై స్పష్టత
ఉద్యోగుల కేటాయింపుపై పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చాక ఇంకా ఎంత మంది రాష్ట్ర స్థాయి అధికారులు అవసరం అవుతారు? శాఖాధిపతి కార్యాలయాల్లో ఎంతమంది సిబ్బందిని నియమించుకోవాల్సి ఉంటుందనే అంశాలపై ఆలోచనలు చేస్తోంది. ఆ తరువాత అవసరమైన నియామకాలపై చర్యలు చేపట్టనుంది. దీనికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చని, వీలైతే ఆగస్టు నెలలో నియామకాలకు చర్యలు చేపట్టే అవకాశం ఉంటుందని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. జిల్లాల్లోని పోస్టులకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉండబోవని, వాటిని యథావిధిగా భర్తీ చేసుకునే వీలుంటుందని తెలిపారు. గతంలో ఆర్థిక శాఖ ఇచ్చిన ఆమోదం ప్రకారం టీపీస్సీ ద్వారా 15 వేల వరకు ఉద్యోగాల భర్తీ చేపట్టే అవకాశం ఉంది.
‘కేసీఆర్ చొరవతోనే టీపీఎస్సీ’
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చొరవతోనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీపీఎస్సీ) త్వరగా ఏర్పాటయిందని తెలంగాణ గ్రూపు-1 అధికారుల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్‌గౌడ్, ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి వేర్వేరు ప్రకటనల్లో హర్షం వ్యక్తంచేశారు. కాగా, టీపీఎస్సీ ఏర్పాటు చరిత్రాత్మకమని తెలంగాణ బీసీ టీచర్స్ యూనియన్ ఒక ప్రకటనలో పేర్కొంది.