సమంత ఐటెం సాంగ్ రచ్చ, ఇతర సాంగ్స్‌పై చర్చ
సాక్షి, హైదరాబాద్: స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రత్యేక పాత్రలో నటించిన పుష్ప మూవీ హిట్‌టాక్‌తో దూసుకు పోతోంది. మరోవైపు స్టార్ హీరోయిన్ సమంత స్పెషల్ సాంగ్ ఊ అంటావా మావా.. ఊ ఊ అంటావా మావా అనే స్పెషల్ సాంగ్ అంతే వివాదాన్ని సృష్టిస్తోంది. మగజాతిని అవమానించారంటూ ఏకంగా పురుషుల సంఘం సమంతపై కేసు నమోదు చేసేదాకా వ్యవహారం వచ్చిందంటే ఈ సాంగ్‌పై జరుగుతున్న రచ్చను అర్థం చేసుకోవచ్చు. ఈ సందర్భంగా మహిళలను కించపరుస్తూ, అవహేళన చేస్తూ గతంలో అనేక సినిమాల్లో వచ్చిన సాంగ్స్‌పై తీవ్ర చర్చకు తెర తీసింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. రష్మిక మందన్న ప్రధాన పాత్రగా వచ్చిన పుష్ప మూవీలో హీరోయిన్ సమంత పుష్ప సినిమాలో చేసిన ఐటెం సాంగ్ వివాదంలో చిక్కుకుంది. దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్‌లో.ఫోక్ సింగర్ ఇంద్రావతి చౌహాన్ మత్తు వాయిస్‌తో పాడిన ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావ పాట యూత్‌ను షేక్ చేస్తోంది. మరోవైపు ఈ పాట మగాళ్లను కించపరిచేలా ఉందంటూ ఏపీలోని పురుషుల సంఘం కోర్టు కెక్కింది. దీనిపై గీతరచయిత చంద్రబోస్ క్షమాపణ చెప్పినా వివాదం సద్దు మణిగినట్టు కనిపించడం లేదు. అంతేకాదు ఆల్ ఐటెం సాంగ్స్ డివోషనల్ సాంగ్సే.. అంటూ ఆ ట్యూన్లో భక్తిగీతం పాడి తన ధోరణిని సమర్ధించుకోవడం పెద్ద దుమారాన్ని రాజేస్తోంది. ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా స్పందించారు ఐటెం నెంబర్లూ దేవుడి పాటలూ రెండూ ఒకటేనా? హిందూ సమాజానికి దేవిశ్రీ క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ అగ్గి గుగ్గిలమయ్యారాయన.
ఈ వివాదం ఇలా కొనసాగుతుండగానే ఈ పాటకు పేరడిగా మేల్ వెర్షన్ అంటూ రచయిత ప్రశాంత్ రాసిన పాటను జానపద గాయకుడు రమణ ఆలపించిన పాట ప్రస్తుతం యూ ట్యూబ్‌లో పెద్ద సంచలనంగా మారింది. మిలియన్స్ వ్యూస్‌తో దూసుకుపోతుంది. పుష్ప సినిమాలో సమంత స్పెషల్ సాంగ్ యూట్యూబ్‌ను ఎంత షేక్ చేస్తోందో దాదాపు అంతే క్రేజ్ ఈ పేరడీసాంగ్కు రావడం విశేషంగా నిలిచింది.
ఈ సందర్భంగా అలనాటి జ్యోతి లక్ష్మి చీర కట్టింది పాట దగ్గరనుంచి బావలు సయ్యా అంటూ సిల్క్ స్మితతో పిచ్చి గంతులు వేయించిన పాట వరకు, ఇటీవల రాంచరణ్ మూవీ ‘రంగస్థలం’ లోని జిల్ జిల్ జిగేల్ రాజా ఐటమ్ సాంగ్, ఆర్య-2 సినిమాలోని రింగ రింగ రింగ రింగరింగారే వరకు పాటలపై నెటిజన్లు తీవ్రంగా చర్చిస్తున్నారు. ఈ రెండు పాటలకు చంద్రబోస్ సాహిత్యాన్ని అందించగా, డీఎస్పీ సంగీతం సమకూర్చారు. అంతేకాదు రింగ రింగ పాట చాలా అసభ్యంగా ఉందంటూ అభ్యంతరాలు కూడా వ్యక్తమైనాయి. లోక్‌సత్తా లీగల్ సెల్ సినిమా దర్శక నిర్మాతలకు, మ్యూజిక్ కంపెనీకీ లీగల్ నోటీసులు పంపించిన సంగతి తెలిసిందే. అలాగే ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్ళే, జనతా గ్యారేజ్ సినిమాలో రామజోగయ్యశాస్త్రి రాసిన పక్కా లోకల్ పాటలోని సాహిత్యం గురించి పెద్ద చర్చే నడించింది.
టాలీవుడ్ సూపర్ స్టార్లుగా చెప్పుకునే బాలకృష్ణ, నాగార్జున, చిరంజీవి, పవన్‌కళ్యాణ్, మహేష్ ఇలా టాప్ హీరోల సినిమాల్లోని ఐటెం సాంగ్స్ ఉన్నాయి. రౌడీ ఇన్స్పెక్టర్ సినిమాలోని లంగాబాడీ లంబాడీ ఆడేస్కుంటా కబాడీ, కిల్లర్ నుంచి రంభలకి రంజుమొగుడ్ని, ఇంతులకి ఇంటిమొగుడ్ని , పవన్ కళ్యాన్ గబ్బర్ సింగ్ మూవీలోని కెవ్వు కేక నా సామిరంగా కేవ్ కేక, మహేష్ సూపర్ డూపర్ హిట్ మూవీ పోకిరి లోని ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్ళేపాట పాటల్లోని సాహిత్యం గురించి ఎంత తక్కువ ప్రస్తావించుకుంటే అంత మంచింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన అల్లుడా మజాకా పెద్దపాపకేమొ పైట కాస్త పెద్దదాయె, అమ్మడు లెట్స్ డు కుమ్ముడు ఇలా.. మహాసముద్రం లాంటి సినీ సాహిత్యంలో ఆడవాళ్ల శరీరాలపై, అంగాంగ వర్ణనపై వచ్చిన అభ్యంతరకర సాహిత్యం గురించి చెప్పుకోవాలంటే చాలా ఉటుంది. ఐటెంసాంగ్ అనే పేరు లేకుండానే ద్వంద్వార్థాలతో మహిళాలోకాన్ని కించపర్చిన సాహిత్యం కొండంత ఉంది. అంతేకాదు ప్రత్యేక డ్యాన్సర్లకు, లేదా యాక్టర్లకు మాత్రమే పరితమైన ఐటెం సాంగ్స్‌కు ఇపుడు స్టార్ హీరోయిన్లు క్యూ కడుతున్న ధోరణి పెరుగుతోంది. శరీరాన్ని, వ్యక్తిత్వాన్ని, అమ్మకానికి పెడుతున్నారంటూ ఫీమేల్ ఆర్టిస్టులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు మొత్తంగా సినీ ప్రపంచంలోని సాహిత్యంలో విలువులకు పెద్ద పీట వేయాలని పలువురు సినీ విమర్శకులు, మహిళా ఉద్యమ నేతలు కోరుతున్నారు.