పారిపోయారని హతమార్చారు..
బాగ్దాద్: ఇరాక్‌లో ఇస్లామ్ రాజ్యం పేరిట భీతావహం సృష్టిస్తున్న ఐఎస్ ఉగ్రవాదుల రాక్షసకృత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా తన సంస్థలోని నలుగురు సీనియర్ కమాండర్స్ను శుక్రవారం ఉరితీసింది. ఇరాక్ లోన్ ఉత్తర ప్రావిన్స్‌లోని సలాహుద్దీన్ కు చెందిన అధికారులు ఇరాక్ ప్రభుత్వ దళాలతో జరిగిన ఘర్షణల సందర్భంగా పారిపోయినందుకుగాను ఈ శిక్ష విధించినట్టుగా తెలుస్తోంది.
తీవ్ర భయోత్పాతం సృష్టించిన ఈ సంఘటన రాజధాని బాగ్దాద్ కు సమీపంలోని షిర్ఖిత్ లో చోటు చేసుకుంది. ఐఎస్ సంస్థ చీఫ్ ఇబ్రహీం- అల్- సమర్రా అలియాస్ అబు బకర్ బాగ్దాది ఈ ఆదేశాలు జారీ చేసినట్టుగా సమాచారం. గత ఫిబ్రవరిలో కూడా సుమారు రెండు డజన్ల మంది మిలిటెంట్లను ఈ కారణంగానే ఉరి తీసిన సంగతి తెలిసిందే.