IVRS system
-
65 మందితో టీటీడీపీ రాష్ట్ర కమిటీ
సాక్షి, విజయవాడ బ్యూరో: టీడీపీ తెలంగాణ రాష్ట్ర కమిటీని 65 మందితో ఏర్పాటు చేయాలని ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నిర్ణయించారు. మూడు, నాలుగు రోజుల్లో కమిటీని ప్రకటించనున్నారు. మంగళవారమిక్కడ తన క్యాంపు కార్యాలయంలో తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. తెలంగాణలో కార్యకర్తలు బలంగా ఉన్నారని, నాయకులు ముందుండి వారిని నడిపించాలని చంద్రబాబు సూచించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేయాలని, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుంటామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని ఐవీఆర్ఎస్ విధానం ద్వారా కార్యకర్తల అభిప్రాయం మేరకు ఎంపిక చేస్తామని చంద్రబాబు చెప్పినట్లు తెలిసింది. సమావేశం ప్రారంభానికి ముందు నేతలు ఎర్రబెల్లి దయాకరరావు, రేవంత్‌రెడ్డి మధ్య వాగ్వాదం జరిగినట్లు సమాచారం. అంతా కలసి సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్దామని చెప్పిన రేవంత్.. అందరినీ అక్కడికి పంపించి తాను మాత్రం చంద్రబాబు నివాసానికి వెళ్లినట్లు తెలిసింది. తర్వాత నేరుగా చంద్రబాబుతో కలసి క్యాంపు కార్యాలయానికి రావడంతో ఎర్రబెల్లి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. గొడవ ముదురుతుండటంతో అక్కడున్న వారు జోక్యం చేసుకుని సర్దిచెప్పారు. ఎంపీ రమేష్ రాథోడ్, నేత లు మోత్కుపల్లి, నామా నాగేశ్వరరావు, వివేక్, ఉమామాధవరెడ్డి, సీతక్క, మండవ వెం కటేశ్వరరావు, సాయన్నసమావేశంలో పాల్గొన్నారు. -
భగ్గు..భగ్గు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: తెలుగుదేశం పార్టీ జిల్లాలో అభ్యర్థులను ప్రకటించినప్పటి నుంచి ఆ పార్టీ నాయకులు, కార్యకర్తల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. అభ్యర్థులపై అసమ్మతి పెరిగిపోతోంది. ఐవీఆర్ఎస్ విధానం ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తామని పేర్కొన్న పార్టీ అధిష్టానం హామీ ఏమైందని కార్యకర్తలు నిలదీస్తుండటంతో ఏం చెప్పాలో తెలియక నాయకులు నీళ్లు నములుతున్నారు. ఐవీఆర్ఎస్ విధానంలో తాము సూచించిన పేర్లు కాకుండా..అధిష్టానం నిర్ణయం మేరకే అభ్యర్థులను ప్రకటిస్తున్నారని అంటున్నారు. అంతమాత్రానికి ఐవీఆర్ఎస్ విధానంలో తమ సూచనలు తీసుకోవడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో తొమ్మిది నియోజకవర్గాలకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించింది. వీటిలో దర్శి, పర్చూరు నియోజకవర్గాలు తప్ప మిగిలిన అభ్యర్థులందరిపైనా ఆపార్టీ నాయకులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంకా రెండు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. సంతనూతలపాడును బీజేపీకి కేటాయించడంతో ఆ నియోజకవర్గంలోని టీడీపీ కార్యకర్తలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. శనివారం కూడా సమావేశమై, ఇటీవల తెలుగుదేశంలో చేరిన కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే విజయకుమార్‌ను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయించడానికి తీర్మానం ఆమోదించారు. అద్దంకి నియోజకవర్గానికి తాము కరణం బలరాం పేరును సూచించగా కరణం వెంకటేష్‌ను అభ్యర్థిగా ప్రకటించారని కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చీరాల అభ్యర్థిగా పోతుల సునీత పేరును తాము వ్యతిరేకించామని అక్కడి కార్యకర్తలు చెబుతున్నారు. స్థానికేతరురాలైన సునీత తెలంగాణ ప్రాంతానికి చెందిన మహిళని, దీంతో ఆమె పేరును తాము సూచించకపోయినా..ఆమెనే అభ్యర్థిగా ఖరారు చేశారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒంగోలు అభ్యర్థిత్వంపై దామచర్ల కినుక: టీడీపీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్ కందుకూరు సీటు ఇవ్వాలని చంద్రబాబును కోరారు. అయితే ఆయనకు ఒంగోలు సీటు కేటాయించడంతో ఆయన అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఒంగోలులో గెలిచే అవకాశాలు తక్కువని..అయినా పార్టీ తనకు ఈ సీటు కేటాయించిందని వాపోతున్నారు. ఒంగోలులో పోటీ చేయడం కన్నా ..పోటీ నుంచి విరమించుకోవడం ఉత్తమమనే భావనలో ఉన్నట్లు సమాచారం. కనిగిరిలో కదిరి బాబూరావును అభ్యర్థిగా ప్రకటించడంపై కూడా కార్యకర్తలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేయడం కూడా సరిగ్గా రాని వ్యక్తిని తిరిగి అదే స్థానం నుంచి ఎందుకు పోటీ చేయిస్తున్నారని, ఆయన తప్ప ఆ నియోజకవర్గంలో అభ్యర్థులే కరువయ్యారా అని ప్రశ్నిస్తున్నారు. మార్కాపురంలో సిట్టింగ్ ఎమ్మెల్యే పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉందని తెలిసి కూడా కందుల నారాయణరెడ్డికి సీటును కేటాయించడంపై కేడర్ అసంతృప్తితో ఉంది.