భగ్గు..భగ్గు | party leaders have been dissatisfied with the community | Sakshi
Sakshi News home page

భగ్గు..భగ్గు

Published Sun, Apr 13 2014 4:01 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

భగ్గు..భగ్గు - Sakshi

భగ్గు..భగ్గు

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: తెలుగుదేశం పార్టీ జిల్లాలో అభ్యర్థులను ప్రకటించినప్పటి నుంచి ఆ పార్టీ నాయకులు, కార్యకర్తల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. అభ్యర్థులపై అసమ్మతి పెరిగిపోతోంది. ఐవీఆర్‌ఎస్ విధానం ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తామని పేర్కొన్న పార్టీ అధిష్టానం హామీ ఏమైందని కార్యకర్తలు నిలదీస్తుండటంతో ఏం చెప్పాలో తెలియక నాయకులు నీళ్లు నములుతున్నారు.
 
ఐవీఆర్‌ఎస్ విధానంలో తాము సూచించిన పేర్లు కాకుండా..అధిష్టానం నిర్ణయం మేరకే అభ్యర్థులను ప్రకటిస్తున్నారని అంటున్నారు. అంతమాత్రానికి ఐవీఆర్‌ఎస్ విధానంలో తమ సూచనలు తీసుకోవడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో తొమ్మిది నియోజకవర్గాలకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించింది. వీటిలో దర్శి, పర్చూరు నియోజకవర్గాలు తప్ప మిగిలిన అభ్యర్థులందరిపైనా ఆపార్టీ నాయకులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
 
ఇంకా రెండు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. సంతనూతలపాడును బీజేపీకి కేటాయించడంతో ఆ నియోజకవర్గంలోని టీడీపీ కార్యకర్తలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. శనివారం కూడా సమావేశమై, ఇటీవల తెలుగుదేశంలో చేరిన కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే విజయకుమార్‌ను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయించడానికి తీర్మానం ఆమోదించారు.
 
అద్దంకి నియోజకవర్గానికి తాము కరణం బలరాం పేరును సూచించగా కరణం వెంకటేష్‌ను అభ్యర్థిగా ప్రకటించారని కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చీరాల అభ్యర్థిగా పోతుల సునీత పేరును తాము వ్యతిరేకించామని అక్కడి కార్యకర్తలు చెబుతున్నారు. స్థానికేతరురాలైన సునీత తెలంగాణ ప్రాంతానికి చెందిన మహిళని, దీంతో ఆమె పేరును తాము సూచించకపోయినా..ఆమెనే అభ్యర్థిగా ఖరారు చేశారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
 
ఒంగోలు అభ్యర్థిత్వంపై దామచర్ల కినుక:

టీడీపీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్ కందుకూరు సీటు ఇవ్వాలని చంద్రబాబును కోరారు. అయితే ఆయనకు ఒంగోలు సీటు కేటాయించడంతో ఆయన అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఒంగోలులో గెలిచే అవకాశాలు తక్కువని..అయినా పార్టీ తనకు ఈ సీటు కేటాయించిందని వాపోతున్నారు. ఒంగోలులో పోటీ చేయడం కన్నా ..పోటీ నుంచి విరమించుకోవడం ఉత్తమమనే భావనలో ఉన్నట్లు సమాచారం.
 
కనిగిరిలో కదిరి బాబూరావును అభ్యర్థిగా ప్రకటించడంపై కూడా కార్యకర్తలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేయడం కూడా సరిగ్గా రాని వ్యక్తిని తిరిగి అదే స్థానం నుంచి ఎందుకు పోటీ చేయిస్తున్నారని, ఆయన తప్ప ఆ నియోజకవర్గంలో అభ్యర్థులే కరువయ్యారా అని ప్రశ్నిస్తున్నారు.
 
మార్కాపురంలో సిట్టింగ్ ఎమ్మెల్యే పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉందని తెలిసి కూడా కందుల నారాయణరెడ్డికి సీటును కేటాయించడంపై కేడర్ అసంతృప్తితో ఉంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement