రఫేల్... గేమ్ చేంజర్
న్యూఢిల్లీ: చైనా అండదండలతో జిత్తులమారి పాకిస్తాన్ కూడా కయ్యానికి కాలుదువ్వుతుందన్న అంచనాలున్న నేపథ్యంలో భారత్ అమ్ములపొదిలోకి రఫేల్ చేరడంతో భారత్ వాయుసేన సామర్థ్యం మరింతగా పెరిగింది. సరిహద్దుల్లో చైనా ఆటలు ఇక సాగవని, రఫేల్ ఒక గేమ్ చేంజర్ అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చైనా యుద్ధవిమానం చెంగ్డూ జే–20 కంటే రఫేల్ అత్యంత శక్తిమంతమైనదని చెబుతున్నారు.
‘‘జే–20 కంటే రఫేల్ అత్యంత శక్తిసామర్థ్యాలు కలిగినది. జే–20 అయిదో తరానికి చెందిన యుద్ధవిమానమని చైనా చెబుతున్నప్పటికీ దాని ఇంజిన్ మూడో జనరేషన్‌కి చెందినది. సుఖోయ్ యుద్ధ విమానం తరహా ఇంజిన్ అందులో ఉంది’’ అని రఫేల్ యుద్ధ విమానాన్ని పరీక్షించి చూసిన రిటైర్డ్ ఎయిర్ మార్షల్ నంబియార్ చెప్పారు.
చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ దగ్గరున్న జే–20 అత్యంత ఆధునికమైనదైతే ఆ దేశం రష్యా నుంచి సుఖోయ్ యుద్ధ విమానాలను కొనాల్సిన అవసరమేముందని ప్రశ్నించారు. గగనతలం నుంచి గగనతలం లక్ష్యాలను ఛేదించే మీటియోర్ క్షిపణి వ్యవస్థ, ఉపరితల లక్ష్యాలను ఛేదించగలిగిన స్కాల్ప్ క్రూయిజ్ క్షిపణి వ్యవస్థ, స్పెక్ట్రా ఎలక్ట్రానిక్ యుద్ధ వ్యవస్థ కలిగి ఉన్న రఫేల్ యుద్ధ విమానం దరిదాపుల్లోకి కూడా చైనా జే–20 రాలేదని బాలా కోట్ దాడుల వ్యూహకర్త, మాజీ ఎయిర్ మార్షల్ బీఎస్ ధనూవా అభిప్రాయపడ్డారు.