Jabbar
-
నిర్వాసితులకు న్యాయం చేయాలి
నాగర్‌కర్నూల్ : పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులో ముంపునకు గురై భూమి, ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులకు న్యాయం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎం.డి.జబ్బార్ అన్నారు. శనివారం నాగర్‌కర్నూల్‌లోని సీఐటీయూ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. జీఓ నం.123ని ప్రభుత్వం అమలు చేయాలని చూస్తే భూ నిర్వాసితుల పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఉద్యమించడం వల్ల హైకోర్టు ఈ జీఓను కొట్టివేసిందన్నారు. 2013చట్టం ప్రకారమే రైతులకు పరిహారం చెల్లించాలని సూచించిందన్నారు. అయినా మరోసారి జీఓ నం.190, సమన్వయ కమిటీ పేరుతో భూనిర్వాసితులను ప్రభుత్వం మోసం చేయాలని చూస్తోందని ఆరోపించారు. నార్లాపూర్, వట్టెం, కర్వెన, ఉద్దండాపూర్, ఏదుల రిజర్వాయర్ పరిధిలో 39గ్రామాలు మునిగిపోతే ఇప్పటికీ ఆదుకోలేదన్నారు. తక్షణమే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడంతోపాటు భూ నిర్వాసితులను అన్నివిధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు ఆర్.శ్రీనివాస్, నాయకులు లక్ష్మణ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. -
రైతులను పట్టించుకోని ప్రభుత్వం
పాన్‌గల్ : రైతులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జబ్బార్ ఆరోపించారు. శుక్రవారం పాన్గల్లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ కరువు జిల్లాగా ప్రకటించి ఎనిమిది నెలలైనా రైతులకు పరిహారం అందలేదన్నారు. దీంతో ఖరీఫ్ సీజన్ పెట్టుబడులకోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారన్నారు. ఇటు మూడోవిడత రుణమాఫీ, అటు పరిహారం అందక నానా కష్టాలు ఎదుర్కొంటున్నారన్నారు. భీమా కాల్వల లైనింగ్, పంట కాల్వలను పూర్తి చేశాకే నీటిని విడుదల చేయాలన్నారు. దళిత, గిరిజనులకు భూపంపిణీ, మైనారిటీలకు రిజర్వేషన్ అమలు కాలేదని ఆయన విమర్శించారు. ఇలా ఆయా వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోతే ఈనెల 17 తర్వాత పోరాటాలు చేస్తామన్నారు. ఈ సమావేశంలో పార్టీ మండల నాయకులు వెంకటయ్య, ఫయాజ్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. -
పునరావాస చట్టం అమలు చేయాలి
ఆలూరు (గట్టు ) : పునరావాస చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జబ్బార్ డిమాండ్ చేశారు. ఆదివారం గట్టు మండలంలోని ఆలూరు గ్రామస్తులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2005లో ఈ గ్రామం ర్యాలంపాడుపాడు రిజర్వాయర్‌లో ముంపునకు గురైందన్నారు. దీంతో మూడువేల ఎకరాలను రైతులు కోల్పోవాల్సి వచ్చిందన్నారు. పరిహారం చాలా తక్కువగా ఇచ్చినట్లు ఆరోపించారు. చెరువులో ముంపునకు గురైన 32 ఎకరాలకు పరిహారమే ఇవ్వలేదన్నారు. పునరావాస కేంద్రంలో పూర్తిస్థాయిలో ప్లాట్లు కేటాయించలేదని, కనీస సౌకర్యాలు కల్పించకుండా గ్రామాన్ని ఖాళీ చేయించేందుకు అధికారులు ఒత్తిడి తెస్తున్నారన్నారు. 2013 చట్టం ప్రకారం నిర్వాసితులకు అన్నివిధాలా న్యాయం చేయాలన్నారు. ఈనెల 26న పోరాట నిర్వాసిత కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టనున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల నాయకులు ఉప్పేరు నర్సింహ, రాజు, మహబూబ్ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
మహబూబ్‌నగర్(దేవరకద్ర): రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన సోమవారం రాత్రి మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలంలో చోటుచేసుకుంది. వివరాలు... దేవరకద్ర మండలం చౌదరిపల్లి గ్రామం వద్ద ఓ ట్యాంకర్ అదుపు తప్పి వంతెనను ఢీకొట్టింది. దీంతో ఆ రోడ్డులో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సంఘటనా స్థలంలో ట్రాఫిక్‌ను మల్లిస్తున్న హెడ్ కానిస్టేబుల్ జబ్బర్ను ఒక బైక్ పై ముగ్గురు వేగంగా వెళుతూ ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, కానిస్టేబుల్, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స కోసం మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితుల వివరాలు ఇంకా తెలియరాలేదు.