JAC chairman dashamantha reddy
-
‘జనగామ’ కోసం ఆమరణ దీక్ష
జనగామ : నూతన జిల్లాల ముసాయిదాలో ప్రభుత్వం జనగామకు అన్యాయం చేయడాన్ని నిరసిస్తూ జేఏసీ నాయకులు ఆమరణ దీక్షకు దిగారు. జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంతరెడ్డి, పాలకుర్తి జేఏసీ కన్వీనర్ డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్‌తో పాటు మరో పదిమంది దీక్షలో కూర్చున్నారు. తొలుత జేఏసీ నాయకులు జూబ్లీ ఫంక్షన్ హాల్ నుంచి మద్దతుదారులతో కలిసి దీక్షా శిబిరం వద్దకు చేరుకున్నారు. మాజీ ఎమ్మెల్యే, జేఏసీ సభ్యులు సీహెచ్. రాజారెడ్డి.. దశమంతరెడ్డి, లక్ష్మీనారాయణ నాయక్, ఆకుల దుర్గాప్రసాద్, జక్కుల వేణుమాదవ్, పూల సుధాకర్, మంతెన మణి, అనంతుల శ్రీనివాస్, ఊడ్గుల రమేష్, సత్యం, వెంకట్, సీతారాములు, పానుగంటి ప్రవీణ్‌కు పూలమాల వేసి దీక్షలను ప్రారంభించారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, మున్సిపల్ చైర్పర్సన్ గాడిపెల్లి ప్రేమలతారెడ్డి సంఘీభావం తెలిపారు. అన్ని వనరులున్న జనగామను జిల్లా చేయక పోవడం ప్రభుత్వ అవివేకానికి నిదర్శనమని ధర్మారావు మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే సీహెచ్.రాజారెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరిగిన అన్యాయం, నేడు స్వరాష్ట్రంలో జనగామకు జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. చేర్యాల, మద్దూరు మండలాలను సిద్ధిపేటలో కలుపుతూ కొమురవెల్లి మల్లన్న ఆదాయంతో పాటు నీళ్లు దోచుకునే ప్రయత్నంలో భాగంగానే జనగామ జిల్లాకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. జనగామ జిల్లా కోసం ఉద్యమిస్తున్న నాయకులు సన్నాసులని సంబోధించిన సీఎం కేసీఆర్.. నాడు ఈ ప్రాంత ఉద్యమంతోనే తెలంగాణ వచ్చిన సంగతి గుర్తుంచుకోవాలని హితవు పలికారు. స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఆత్మ బలిదానం చేసుకుంటారా?.. తన పదవికి రాజీనామా చేసి ప్రజలతో కలసి ఉద్యమం చేస్తారా తేల్చుకోవాలని డిమాండ్ చేశారు. మద్దూరు మండలంలో 15 గ్రామాలు జనగామ జిల్లా కోసం ఏకగ్రీవ తీర్మానం చేశాయన్నారు. ప్రాణత్యాగానికైనా సిద్ధం : దశమంతరెడ్డి జనగామ ప్రజల ఆకాంక్ష కోసం ప్రాణాత్యాగానికైనా వెనుకాడే ప్రసక్తే లేదని జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంతరెడ్డి అన్నారు. దీక్షా శిబిరం వద్ద ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో 11వ నూతన జిల్లా జనగామ అంటూ ఎన్నికల సమయంలో కేసీఆర్ ప్రకటించి, ఇప్పుడు మోపం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ఏర్పాటుకు అవసరమైన అన్ని అర్హతలు జనగామకు ఉన్నాయని సీసీఎల్ రేమండ్ పీటర్ సైతం ఒప్పుకున్నారని గుర్తు చేశారు. జిల్లావద్దంటూ గొడవ చేస్తున్న నిర్మల్, హన్మకొండలను చేసి, కావాలని ఎనిమిది నెలలుగా ఉద్యమిస్తుంటే తమను విస్మరించడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వానికి ఒకరోజులోనే వేల సంఖ్యలో అభ్యంతరాలు పంపించామని, ఇంకా నెల రోజుల పాటు భారీ సంఖ్యలో పంపించాలని ప్రజలను కోరారు. భారీగా పోలీసుల మోహరింపు ఆమరణ దీక్ష నేపథ్యంలో జనగామలో భారీగా పోలీసులు మోహరించారు. డీఎస్పీ పద్మనాభరెడ్డి పర్యవేక్షణలో జనగామ, చేర్యాల సీఐలు ముసికె శ్రీనివాస్, చంద్రశేఖర్‌గౌడ్ ఆధ్వర్యంలో బందోబస్తు చేపట్టారు. దీక్షా శిబిరం ఆవరణలో కొత్తగా టెంట్ వేయడంతో పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. -
కుట్రలు బహిర్గతం
జనగామ జిల్లాను అడ్డుకుంటున్నారు కలెక్టర్ నివేదిక తప్పుల తడక మాది రెండు వారాల ఉద్యమమేనట.. కడియం శ్రీహరి సాక్షిగా ఎమ్మెల్యేలు ఇచ్చిన లేఖ ఎక్కడ? జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంతరెడ్డి జనగామ : జనగామ జిల్లా కాకుండా అడ్డుకుంటున్న కుట్రలు సమాచార హక్కు చట్టం ద్వారా బట్ట బయలయ్యాయని జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంతరెడ్డి తెలిపారు. పట్టణంలోని విజయ ఫంక్షన్ హాల్లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లా ప్రతిపాదనపై ఆర్టీఏ చట్టం ద్వారా వివరాలు కావాలని కలెక్టర్‌ను కోరగా, 92 పేజీల నివేదిక ఇచ్చారని తెలిపారు. అయితే, అదంతా తప్పుల తడకగా ఉందని ఆరోపించారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సాక్షిగా ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, తాటికొండ రాజయ్య లేఖలతో పాటు మండల, గ్రామ పంచాయతీల తీర్మాన కాపీలను జూన్ 16న కలెక్టర్ వాకాటి కరుణకు అందజేశామని వివరించారు. ఇప్పుడు సమాచార హక్కు చట్టంతో అందరి కుట్రలు వెలుగు చూశాయన్నారు. గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఎగిసి పడుతున్న జిల్లా ఉద్యమం సీఎం కేసీఆర్ దృష్టికి వెళ్లిందని స్వయాన ఎమ్మెల్యే ఒప్పుకుంటే, రెండు వారాలుగా ఉద్యమం జరుగుతోందని కలెక్టర్ నివేదికలో పేర్కొనడం హాస్యాస్పదమన్నారు. కష్టకాలంలో మొరపెట్టుకోవాల్సిన అధికారే అన్యాయం చేస్తుంటే తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలని దశమంతరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. చేర్యాల, మద్దూరు మండలాలను సిద్దిపేట జిల్లాలో, బచ్చన్నపేట, నర్మెట, జనగామ రూరల్, దేవరుప్పుల, లింగాలఘణపురం మండలాలను యాదాద్రి జిల్లాలో కలపాలని ప్రతిపాదనలు పంపించిన కలెక్టర్.. జనగామ మున్సిపాలిటీని ఎక్కడ కలుపుతారో పేర్కొనకపోవడంలో మతలబు ఏమిటని ప్రశ్నించారు. జిల్లాను అడ్డుకుంటున్న అదృశ్య శక్తులు... జనగామ జిల్లా ఏర్పాటును అడ్డుకునేందుకు బలమైన అదృశ్య శక్తులు పనిచేస్తున్నాయని ఈ నివేదిక చూస్తే అర్థమవుతోందని దశమంతరెడ్డి అన్నారు. చేర్యాల, మద్దూరు మండలాలను సిద్దిపేటలో, మిగతా మండలాలను యాదాద్రిలో కలపాలని ఎవరు ప్రతిపాదించారో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. జనగామ జిల్లా కాకుంటే ఎమ్మెల్యే, ఎంపీతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు సమాధానం చెప్పాల్సి వస్తుందన్నారు. తప్పుల తడకగా ఉన్న ఈ నివేదికలను సీఎం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, సీసీఎల్ దృష్టికి తీసుకుపోతామని, కొత్త ప్రతిపాదన పంపించాలని కోరుతామని అన్నారు. పట్టణంలో 144 సెక్షన్ అమలు చేస్తూ ఉద్యమాన్ని అణచి వేయాలని చూస్తున్నారని, మరో 48 గంటల్లో ఎత్తివేయకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆయన వెంట జేఏసీ నాయకులు డాక్టర్ రాజమౌళి, ఆకుల వేణు, మేడ శ్రీనివాస్, మంగళ్లపల్లి రాజు, ఆకుల సతీష్, పోకల లింగయ్య, ధర్మపురి శ్రీనివాస్, పిట్టల సత్యం, మాజీద్, తీగల సిద్దూగౌడ్, పిట్టల సురేష్, చిన్నం నర్సింహులు, రెడ్డి రత్నాకర్ రెడ్డి, వీరస్వామి, ఉడుగుల రమేష్, కిరణ్ ఉన్నారు. -
రెపరెపలాడిన జనగామ జిల్లా జెండా
ఇంటింటికీ జెండా ఎగురవేసిన ప్రజలు జనగామ : సకల జనులు మరోసారి తమ జిల్లా ఆకాంక్షను తెలిపారు. జేఏసీ పిలుపు మేరకు ఆదివారం ఇంటింటా జనగామ జిల్లా జెండాను ఎగురవేశారు. జనగామ జిల్లా కోరుతూ ఉద్యమాలు చేస్తున్న మండలాల పరిధిలో సకల జనులు ఇంటిపై జెండాను ఎగురవేసి ప్రభుత్వానికి బలమైన సంకేతాలు పంపించారు. అంతకుముందు చౌరస్తాలో జేఏసీ చైర్మన్ దశమంతరెడ్డి జిల్లా జెండాను ఎగురవేశారు. శాంతియుత ఉద్యమాలతో జనగామ జిల్లా సాధించుకుంటామని దశమంతరెడ్డి తెలిపారు. అక్రమ కేసులు, నిర్బంధాలు ఉద్యమాన్ని ఆపలేరన్నారు. వాడవాడలా జనం తమ గుండె నిండా జిల్లా ఆకాంక్షను ఇంటిపై జెండా రూపంలో చూపించారు.