‘జనగామ’ కోసం ఆమరణ దీక్ష
Published Wed, Aug 24 2016 12:52 AM | Last Updated on Mon, Sep 4 2017 10:33 AM
జనగామ : నూతన జిల్లాల ముసాయిదాలో ప్రభుత్వం జనగామకు అన్యాయం చేయడాన్ని నిరసిస్తూ జేఏసీ నాయకులు ఆమరణ దీక్షకు దిగారు. జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంతరెడ్డి, పాలకుర్తి జేఏసీ కన్వీనర్ డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్‌తో పాటు మరో పదిమంది దీక్షలో కూర్చున్నారు. తొలుత జేఏసీ నాయకులు జూబ్లీ ఫంక్షన్ హాల్ నుంచి మద్దతుదారులతో కలిసి దీక్షా శిబిరం వద్దకు చేరుకున్నారు. మాజీ ఎమ్మెల్యే, జేఏసీ సభ్యులు సీహెచ్. రాజారెడ్డి.. దశమంతరెడ్డి, లక్ష్మీనారాయణ నాయక్, ఆకుల దుర్గాప్రసాద్, జక్కుల వేణుమాదవ్, పూల సుధాకర్, మంతెన మణి, అనంతుల శ్రీనివాస్, ఊడ్గుల రమేష్, సత్యం, వెంకట్, సీతారాములు, పానుగంటి ప్రవీణ్‌కు పూలమాల వేసి దీక్షలను ప్రారంభించారు.
బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, మున్సిపల్ చైర్‌పర్సన్ గాడిపెల్లి ప్రేమలతారెడ్డి సంఘీభావం తెలిపారు. అన్ని వనరులున్న జనగామను జిల్లా చేయక పోవడం ప్రభుత్వ అవివేకానికి నిదర్శనమని ధర్మారావు మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే సీహెచ్.రాజారెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరిగిన అన్యాయం, నేడు స్వరాష్ట్రంలో జనగామకు జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. చేర్యాల, మద్దూరు మండలాలను సిద్ధిపేటలో కలుపుతూ కొమురవెల్లి మల్లన్న ఆదాయంతో పాటు నీళ్లు దోచుకునే ప్రయత్నంలో భాగంగానే జనగామ జిల్లాకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. జనగామ జిల్లా కోసం ఉద్యమిస్తున్న నాయకులు సన్నాసులని సంబోధించిన సీఎం కేసీఆర్.. నాడు ఈ ప్రాంత ఉద్యమంతోనే తెలంగాణ వచ్చిన సంగతి గుర్తుంచుకోవాలని హితవు పలికారు. స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఆత్మ బలిదానం చేసుకుంటారా?.. తన పదవికి రాజీనామా చేసి ప్రజలతో కలసి ఉద్యమం చేస్తారా తేల్చుకోవాలని డిమాండ్ చేశారు. మద్దూరు మండలంలో 15 గ్రామాలు జనగామ జిల్లా కోసం ఏకగ్రీవ తీర్మానం చేశాయన్నారు.
ప్రాణత్యాగానికైనా సిద్ధం : దశమంతరెడ్డి
జనగామ ప్రజల ఆకాంక్ష కోసం ప్రాణాత్యాగానికైనా వెనుకాడే ప్రసక్తే లేదని జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంతరెడ్డి అన్నారు. దీక్షా శిబిరం వద్ద ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో 11వ నూతన జిల్లా జనగామ అంటూ ఎన్నికల సమయంలో కేసీఆర్ ప్రకటించి, ఇప్పుడు మోపం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ఏర్పాటుకు అవసరమైన అన్ని అర్హతలు జనగామకు ఉన్నాయని సీసీఎల్ రేమండ్ పీటర్ సైతం ఒప్పుకున్నారని గుర్తు చేశారు. జిల్లావద్దంటూ గొడవ చేస్తున్న నిర్మల్, హన్మకొండలను చేసి, కావాలని ఎనిమిది నెలలుగా ఉద్యమిస్తుంటే తమను విస్మరించడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వానికి ఒకరోజులోనే వేల సంఖ్యలో అభ్యంతరాలు పంపించామని, ఇంకా నెల రోజుల పాటు భారీ సంఖ్యలో పంపించాలని ప్రజలను కోరారు.
భారీగా పోలీసుల మోహరింపు
ఆమరణ దీక్ష నేపథ్యంలో జనగామలో భారీగా పోలీసులు మోహరించారు. డీఎస్పీ పద్మనాభరెడ్డి పర్యవేక్షణలో జనగామ, చేర్యాల సీఐలు ముసికె శ్రీనివాస్, చంద్రశేఖర్‌గౌడ్ ఆధ్వర్యంలో బందోబస్తు చేపట్టారు. దీక్షా శిబిరం ఆవరణలో కొత్తగా టెంట్ వేయడంతో పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో కొద్దిసేపు వాగ్వాదం జరిగింది.
Advertisement
Advertisement