నేటి నుంచి టెట్ హాల్‌టికెట్లు
పేపర్ –1 పరీక్ష సమయంలో మార్పులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) హాల్‌టికెట్లను ఈ నెల 13 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని టెట్ డైరెక్టర్ జగన్నాథరెడ్డి వెల్లడించారు. 3.73 లక్షల మంది దరఖాస్తు చేసుకున్న ఈ టెట్‌ను ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే ఈ నెల 22న నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడంతో పరీక్ష కేంద్రాలు మారాయని పేర్కొన్నారు. గతంలో డౌన్లోడ్ హాల్‌టికెట్లు పనికిరావని, ఈ నెల 13 ఉదయం 11 గంటల తర్వాత తాజా హాల్‌టికెట్లు tstet.cgg. gov.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.
కొత్త హాల్టికెట్లలో ఉన్న కేంద్రాల్లోనే పరీక్షలకు హాజరు కావాలని పేర్కొన్నారు. ముందస్తు షెడ్యూల్లో పేర్కొన్నట్లు కాకుండా పేపర్–1 పరీక్ష సమయంలో మార్పులు చేసినట్లు తెలిపారు. పేపర్-1 పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఉంటుందని పేర్కొన్నారు. పేపరు-2 పరీక్ష సమయంలో ఎలాంటి మార్పు లేదని, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందని వివరించారు. హాల్‌టికెట్ వెనక ఉన్న సూచనలను అభ్యర్థులు క్షుణ్నంగా చదవాలని సూచించారు. అభ్యర్థుల బయోమెట్రిక్ డేటాను సేకరిస్తున్నామని, పరీక్ష కేంద్రంలో ఇన్విజిలేటర్ సమక్షంలో హాల్‌టికెట్‌లో కేటాయించిన స్థలంలో సంతకం చేయాలని, ఎడమ చేతి బొటన వేలి ముద్రలు వేయాలని చెప్పారు. నిర్ణీత పరీక్ష సమయానికి మించి ఆలస్యమైతే పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోమని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రంలోకి సెల్ ఫోన్లు, కాలిక్యులేటర్ల వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించబోమన్నారు.