తగ్గని ‘సమైక్య’ వేడి
ఒంగోలు, న్యూస్‌లైన్: ఉద్యోగులంతా దాదాపు సమైక్య సమ్మె విరమించినప్పటికీ సమైక్య వాదులు మాత్రం కేంద్రం నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. దసరా శరన్నవరాత్రుల సమయంలో కూడా వేడుకలకు దూరంగా ఉండి ఉద్యమిస్తున్నారు. సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ జిల్లా కన్వీనర్ రాయపాటి జగదీష్ ఆధ్వర్యంలో స్థానిక మంగమూరు రోడ్డులోని ఎన్ఎస్పీ కాలువలో ఆదివారం అరగంటపాటు నిలబడి జలదీక్ష చేపట్టారు. సమైక్యాంధ్ర ప్లకార్డులు చేతబట్టి.. సమైక్యాంధ్ర కోసం ప్రాణాలైనా అర్పిస్తామని ప్రతిజ్ఞ చేశారు. జగదీష్ మాట్లాడుతూ శరద్‌పవార్ చెప్పినట్లు.. మైనారిటీలో ఉన్న యూపీఏకు క్యాబినెట్ నోట్‌ను పెట్టే హక్కు లేదన్నారు. ఇప్పటికైనా సీమాంధ్రకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి రాజకీయ సంక్షోభం సృష్టించాలని కోరారు. లేదంటే వారికి బుద్ధి చెబుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నగర కన్వీనర్ చెన్నుబోయిన అశోక్, వరప్రసాద్, మహేష్, రవి, వెంకట్, శ్రీనాథ్ పాల్గొన్నారు.
మభ్యపెడితే ఊరుకోం..
చీరాలలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలకు నియోజకవర్గ సమన్వయకర్తలు పాలేటి రామారావు, అవ్వారు ముసలయ్య, ఎడం చినరోశయ్య సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్‌కు చెందిన కేంద్ర మంత్రుల మాటలకు.. సీఎం సహా ఇతర రాష్ట్ర నేతల మాటలకు పొంతన లేకుండా ఉంటోందన్నారు. ప్రజలను మభ్యపెడితే ఊరుకోమని హెచ్చరించారు. యడం చినరోశయ్య, ఎన్ఆర్ఐ విభాగం నాయకుడు యడం బాలాజీలు 530 మంది ఆర్టీసీ కార్మికులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. రెండు నెలలకు పైగా ఉద్యమంలో పాల్గొన్న కార్మికులకు సహాయం అందించాల్సిన బాధ్యత ఉందన్నారు. వేటపాలెంలో.. పర్చూరులో దీక్షలు కొనసాగాయి.
అన్నదమ్ములను విడదీస్తారా?
పెద్దదోర్నాలలో నూర్‌బాషాలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. వీరికి మండల ఉద్యోగ జేఏసీ మద్దతు తెలిపింది. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుంచి ఫారెస్టు చెక్ పోస్టు, మార్కెట్ యార్డుల మీదుగా భారీ ర్యాలీ నిర్వహించారు. నటరాజ్ సెంటర్లో రాస్తారోకో చేపట్టడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. నాయకులు మాట్లాడుతూ అన్నదమ్ముల్లా కలిసి మెలిసి ఉన్న తెలుగు వారిని విడదీయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం పునరాలోచించకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. ఉమ్మడిగా అభివృద్ధి చేసిన హైదరాబాద్‌పై అన్ని ప్రాంతాలవారికీ హక్కు ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న అస్థిరత్వానికి రాజకీయ నాయకుల నిర్ణయాలే కారణమని మండిపడ్డారు.