Jaggery prices
-
మేడారం జాతర: నిలువెత్తు దోపిడి
సాక్షి, వరంగల్ : సమ్మక్క – సారలమ్మ జాతరకు వెళ్లాలనుకునే భక్తులు ముందుగానే నిలువు దోపిడీకి గురవుతున్నారు. నిలువెత్తు బంగారం(బెల్లం) అమ్మలకు సమర్పించే భక్తులకు వ్యాపారులు చుక్కలు చూపెడుతున్నారు. అడ్డదారిలో 14 దుకాణాలను దక్కించుకున్న పాలమూరుకు చెందిన ఓ కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా విక్రయాలు జరుపుతుండటం భక్తులకు శాపంగా మారుతోంది. జాతర సమీపిస్తున్న కొద్దీ ధరలు పెంచుతున్న వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం కిలో బెల్లం రూ.43కు విక్రయించగా.. ప్రస్తుతం రూ.60 నుంచి రూ.80కు అమ్ముతున్నారు. అమ్మవార్ల గద్దెల సమీపంలో మరో రూ.10 అదనంగానే తీసుకుంటున్నారని భక్తులు వాపోతున్నారు. లారీకి రూ.5లక్షలకు పైగానే లాభం నాందేడ్ తదితర ప్రాంతాల్లో 17 టన్నుల లారీలో కిలోకు రూ.33 చొప్పున రూ.5,61,000 పెట్టుబడితో తెప్పించే వ్యాపారులు... కిలోకు రూ.10 పెంచి అమ్మినా రూ.7,31,000 వస్తాయి. అంటే ఒక్క 17 టన్నుల లారీపై రూ.1.70లక్షలు లాభం వస్తుంది. కానీ కిలోకు రూ.27 నుంచి, రూ.47 వరకు అమ్ముతుండడంతో ఒక్కో లారీపై రూ.4,59,000 నుంచి రూ.7,99,000 వరకు లాభం పొందుతున్నారు. ఒక్క మేడారం జాతర సీజన్లో 200 లారీల (17 టన్నుల) బెల్లం విక్రయించే అవకాశం ఉండగా... ఈ బెల్లం రూ.60 కిలో చొప్పున అమ్మితే రూ.9.18 కోట్లు, రూ.80కి విక్రయిస్తే రూ.15.98 కోట్లు భక్తుల సొమ్ము అదనంగా వ్యాపారుల జేబుల్లోకి వెళ్లనుంది. కాగా బెల్లం కొనుగోలు చేసే భక్తులకు ఎలాంటి బిల్లులు ఇవ్వకుండా ‘అనామతు’గా రాసిస్తున్నారు. అమ్మవార్ల జాతరలోనే బంగారం కొనుగోలు చేయాలని దూరప్రాంతాల నుంచి మేడారం వస్తున్న తాము వ్యాపారుల తీరుతో నిలువుదోపిడీకి గురికావాల్సి వస్తోందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒచ్కో చోట ఒకలా... ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరంగల్, హన్మకొండ, భూపాలపల్లి, జనగామ, నర్సంపేట, మహబూబాబాద్, పరకాల తదితర ప్రాంతాలకు సమ్మక్క–సారలమ్మ జాతర సందర్భంగా లారీల కొద్దీ బెల్లం దిగుమతి అవుతోంది. ఈ మేరకు వ్యాపారులు ధరలను కొండెక్కిస్తున్నా రు. ప్రధానంగా వరంగల్ పాత బీటుబజార్‌కు చెందిన 9 మంది వ్యాపారులు ‘సిండికేట్’గా ఏర్పడి అధిక ధరలకు విక్రయిస్తూ రూ.లక్షల గడిస్తున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ఈ 9 మంది వ్యాపారుల ఇష్టారాజ్యం సాగుతోందని భక్తులు ఆరోపిస్తున్నారు. నాందేడ్, పూణే, ఛత్తీస్‌గఢ్, సోలాపూర్, అకోలా(మహారాష్ట్ర) తదితర ప్రాంతాల నుంచి సదరు వ్యాపారులు రోజుకు 20 లారీల వరకు బెల్లాన్ని దిగుమతి చేసుకుంటున్నారు. శనివా రం నుంచి ఈ వ్యాపారం మరింత పుంజుకునే అవకాశం ఉండగా.. ఫిబ్రవరి 8 వరకు సుమా రు 150 లారీల బెల్లం విక్రయించే అవకాశం ఉంది. ధరల నియంత్రణలో సంబంధిత శాఖల అధికారులు నిర్లక్ష్యం.. మేడారం వెళ్లకుండానే భక్తులు నిలువు దోపిడీకి కారణమవుతోంది. మేడారంలో పాలమూరు కాంట్రాక్టర్ గిరిజన సంక్షేమశాఖకు చెందిన ఓ కీలక అధికారి అండదండలతో పాలమూరుకు చెందిన ఓ కాంట్రాక్టర్ మేడారంలో 14 దుకాణాలను తెరిచి ధరలు పెంచి బెల్లం విక్రయాలు చేస్తున్నారు. ఇదేమిటని భక్తులు ప్రశ్నిస్తే ‘ఇష్టముంటే తీసుకో, లేకుంటే వెళ్లిపో.. రేటు మాత్రం తగ్గించేది లేదు’ అంటూ దబాయిస్తున్నారు. గిరిజన సంక్షేమం, దేవాదాయశాఖల అధికారులను అడిగితే ‘అధిక ధరలకు విక్రయిస్తే దుకాణాలు సీజ్ చేస్తాం’ అని చెబుతున్నారే తప్ప ఏ ఒక్కరిపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని భక్తులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా వరంగల్ పాత బీటుబజార్‌లో ఆ తొమ్మిది బెల్లం వర్తకుల హవా కొనసాగుతోంది. ప్రతీ శనివారం, ఆదివారం మేడారం వెళ్లే భక్తులు పాత బీటు బజార్‌కు వస్తే కిలో రూ.50 నుంచి 60 వరకు అమ్ముతున్నారు. ఎవరైనా వ్యాపారులు రూ.38, రూ.40కు అమ్మితే.. సంబంధిత అధికారులపై ఒత్తిడి తెచ్చి దాడులు చేయిస్తున్నారని వాపోతున్నారు. కాగా ‘అధిక ధరలకు విక్రయిస్తే వచ్చే లాభం ఒక్క మాకే కాదు.. ఈ వ్యాపారంపై అజమాయిషీ చేసే మూడు శాఖల అధికారులకు వాటా ఇస్తున్నాం.. ఎవరేం ఫిర్యాదు చేసినా మాకేం కాదు’’ అంటూ వ్యాపారులు దబాయిస్తుండడం గమనార్హం. -
బెల్లం మాఫియా!
సాక్షి ప్రతినిధి, వరంగల్ : సమ్కక్క – సారలమ్మ జాతరకు వెళ్లేందుకు భక్తులు ఓ వైపు సిద్ధం అవుతున్నారు. తల్లులకు సమర్పించేందుకు బంగారం (బెల్లం) కొనుగోలు చేసే యత్నాల్లో ఉన్న భక్తులను నిలువు దోపిడీ చేసేందుకు బెల్లం వ్యాపారులు ‘సిండికేట్’ అవుతున్నారు. మేడారం వెళ్లకముందే భక్తులకు శఠగోపం పెట్టేందుకు సిండికేట్‌గా ఏర్పడిన తొమ్మిది మంది వ్యాపారులు.. తమకు ఓ ఎక్సైజ్ «అధికారి అండ ఉందని బహిరంగంగానే చెబుతుండడం వ్యాపారవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కాగా, మేడారం సమ్మక్క – సారలమ్మ జాతర ప్రతిసారి వరంగల్ బీట్‌బజార్ కేంద్రంగా సుమారు 150 నుంచి 200 లారీల బెల్లం విక్రయాలు జరుగుతాయి. ఇదే అదునుగా భావించిన కొందరు అధికారులు, వ్యాపారులుమిలాఖత్ అయి ఈసారి పెద్ద మొత్తంలో ధరలు పెంచేందుకు సిద్ధం కావడం వివాదస్పదమవుతోంది. లారీకి రూ.1.70 లక్షల లాభం మహారాష్ట్రలోని పూణెతో పాటు నాందేడ్ తదితర ప్రాంతాల నుంచి వరంగల్ బీట్‌బజార్‌కు బెల్లం దిగుమతి అవుతుంది. 10 టైర్ల లారీ నుంచి 16 టైర్ల లారీ వరకు ఒక్కో లారీలో 17(17వేల కిలోలు) టన్నుల నుంచి 22(22వేల కిలోలు) టన్నులు తీసుకొస్తారు. ఇందుకోసం వ్యాపారులు డీడీ చెల్లిస్తే రవాణా చార్జీలతో సహా రూ.33కు కిలో చొప్పున దిగుమతి చేస్తారు. 17 టన్నుల్లో కిలోకు రూ.33 చొప్పున ఖరీదు చేస్తే పెట్టుబడిగా రూ.5,61,000 వెచ్చించాల్సి ఉంటుంది. వ్యాపారులు ఈ బెల్లాన్ని కిలోకు రూ.10 పెంచి అమ్మినా రూ.7,31,000 వస్తాయి. అంటే ఒక్క 17 టన్నుల లారీపై రూ.1.70లక్షలు, 22 టన్నులపై రూ.2.20లక్షల లాభం వస్తుంది. ఈ సీజన్లో ఇప్పటి వరకు అమ్మింది పోను ఇంకా సుమారు 150 లారీల (17 టన్నుల) బెల్లం విక్రయించే అవకాశం ఉందని వ్యాపారులే చెబుతున్నారు. అంటే కిలోకు రూ.10లు పెంచి (రూ.43కు కిలో) అమ్మినా రూ.2.25 కోట్ల లాభం వ్యాపారులకు అందుతుంది. కానీ ఇప్పటికే హోల్‌సేల్‌గా కిలోకు రూ.43 వరకు విక్రయిస్తుండగా.. బుధవారం నుంచి సిండికేట్‌గా మారి ధర పెంచితే ఎన్ని రూ.కోట్ల ఆదాయం వస్తుందో అంచనా వేయొచ్చని కొందరు వ్యాపారులే చెబుతున్నారు. ఈ వ్యవహారంపై ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి మేడారం జాతరను దృష్టిలో ఉంచుకుని బెల్లం ధరలు పెంచకుండా చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు. -
బెల్లం రైతుకు నష్టం
ఒక్కరోజులో క్వింటాకు రూ.420 తగ్గిన ధర రూ. 17 లక్షలు కోల్పోయిన మార్కెట్ వర్గాలు అనకాపల్లి: సంక్రాంతి కానుకలతో బెల్లం రైతులకు గట్టిగానే షాక్ తగిలింది. పెద్ద పండగకు ముందు బెల్లం ధరలు అన్నదాతలకు నిరాశను మిగిల్చాయి. ఒక్కరోజు వ్యవధిలో క్వింటాకు రూ.420లు ధర తగ్గిపోవడంతో రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారు. మార్కెట్ వర్గాలు ఏకంగా రూ.17 లక్షలు కోల్పోయాయి. అనకాపల్లి మార్కెట్లో మంగళవారం 27,027 బెల్లం దిమ్మల లావాదేవీలు జరిగాయి. మొదటిరకం క్వింటాకు గరిష్టంగా రూ.2780లు ధర పలికింది. భోగీ పండగ రోజైన బుధవారం నుంచి ఆదివారం వరకు మార్కెట్‌కు సెలవు ఉం టుంది. ఈ సెలవులు, పండగ అవసరాల దృష్ట్యా రైతులు సంక్రాం తికి ముందు భారీగానే బెల్లం తయారు చేసి మార్కెట్‌కు తీసుకు రావడం పరిపాటి. ఈ కీలక సమయంలో లభించిన ధర పండగ అవసరాలకు ఉపయోగపడుతుందని ఆశించారు. బెల్లం ధరలు బాగుం టాయని భావించారు. ఈదశలో సోమవారం 37,431 బెల్లం దిమ్మల లావాదేవీలు జరిగాయి. క్వింటా రూ.3200లకు అమ్ముడుపోయింది. మంగళవారం నాటికి ఇది రూ.2780కి పడిపోయింది. చంద్రన్న సంక్రాంతి కానుకల్లో భాగంగా తెల్లకార్డు దారులకు ఉచితంగా అరకిలో బెల్లం ఇవ్వడంతో పండగలో రిటైల్ బెల్లం అమ్మకాలు నిలిచిపోయాయి. ఈపరిణామంతో వ్యాపారులు మా ర్కెట్లో బెల్లం కొనుగోలుకు ఆసక్తి చూపలేదు. దీంతో ఒక్కరోజులో క్వింటాకు రూ.420లు తగ్గిపోయింది. రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారు. -
పతనావస్థలో బెల్లం ధరలు
అనకాపల్లి : జాతీయ స్థాయిలో రెండో స్థానంలో ఉన్న అనకాపల్లి బెల్లం మార్కెట్లో డిసెంబర్ రెండో వారం లావాదేవీలు అటు వర్తకులకు, ఇటు రైతులకు నిరాశనే మిగిల్చాయి. మూడేళ్లుగా అక్టోబర్, నవంబర్ నెలల్లో సంభవిస్తున్న ప్రకృతి వైపరీత్యాలు బెల్లం లావాదేవీలను ప్రభావితం చేస్తున్నాయి. జోరందుకోవాల్సిన సీజన్లో బెల్లం క్రయవిక్రయాలు పడిపోతున్నాయి. డిసెంబర్ 8 నుంచి 13వ తేదీ వరకు 74,040 క్వింటాళ్ల బెల్లం క్రయవిక్రయాలు జరగ్గా, క్వింటాల్‌కు కనిష్ట ధర ఈ వారంలో రూ.2,130కి పడిపోయింది. గరిష్ట ధర సైతం 2,900 రూపాయల వద్దే నిలిచింది. బెల్లం లావాదేవీలు తగ్గినప్పుడు సహజంగా ధరలు పెరగాలి. కానీ రెండవ వారంలో క్వింటాలు బెల్లం 3 వేల రూపాయలకు చేరుకోకపోవడం మార్కెట్ వర్గాలను నిరాశపరిచింది. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి చెరకు బెల్లాన్ని వండినప్పటికీ అనకాపల్లి మార్కెట్లో గిట్టుబాటు ధర లభించలేదనేది రైతుల ఆవేదన. 2013లో డిసెంబర్ రెండో వారంలో 82,721 క్వింటాళ్ల లావాదేవీలు జరిగాయి. ఆరు రోజుల లావాదేవీల్లో భాగంగా క్వింటాలు బెల్లం కనిష్టంగా 2,340 రూపాయలు పలకగా, గరిష్టంగా 2,850 రూపాయలు పలికింది. అంటే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది డిసెంబర్ రెండో వారం లావాదేవీలు 8,681 క్వింటాళ్లు తగ్గినట్లయింది. మూడో రకం బెల్లం కనిష్ట ధర గత ఏడాది కంటే ఈసారి మరీ దయనీయంగా 2,130 రూపాయలు పలికిందంటే ధరలు పతనావస్థలో ఉన్నట్లు గమనించవచ్చు. ఇక గరిష్ట ధర విషయంలో గత ఏడాది 2,850 రూపాయలు పలకగా, ఈ ఏడాది 2,900 వద్ద గరిష్ట ధర నిలిచింది. మూడో రకం బెల్లం ధర తగ్గినప్పటికీ ఈ ఏడాది చెరకు రైతులు విపత్కర పరిస్థితులను చవిచూశారు. హుద్‌హుద్ కారణంగా చెరకు పంట ధ్వంసం కాగా కాస్తోకూస్తో మిగిలిన చెరకు నేలపాలయింది. కరెంట్ కోత కారణంగా నేలపాలైన చెరకును అక్కడికక్కడే వండకపోవడంతో మార్కెట్‌కు సరఫరా అయ్యే బెల్లం అధికంగా నలుపురంగే వస్తుంది. ఈ కారణంగా ఈ ఏడాది రైతులు దిగుబడిపరంగానే కాకుండా గిట్టుబాటుపరంగా కూడా నష్టపోయారు. అటువంటి సంకేతాలే రెండో వారం మార్కెట్ ప్రస్ఫుటం చేసింది. గత ఏడాది డిసెంబర్ 16వ తేదీన అనకాపల్లి మార్కెట్‌కు అప్పటివరకు కొనసాగిన ఆ సీజన్‌కు గరిష్టంగా 25,535 దిమ్మల లావాదేవీలు జరిగాయి. మరి ఈ సీజన్లో బెల్లం లావాదేవీలు 25 వేల దిమ్మల క్రయవిక్రయాలకు దాటుతాయో లేదో మూడో వారం లావాదేవీలను బట్టి తెలుస్తుంది.