బెల్లం రైతుకు నష్టం
ఒక్కరోజులో క్వింటాకు రూ.420 తగ్గిన ధర
రూ. 17 లక్షలు కోల్పోయిన మార్కెట్ వర్గాలు
అనకాపల్లి: సంక్రాంతి కానుకలతో బెల్లం రైతులకు గట్టిగానే షాక్ తగిలింది. పెద్ద పండగకు ముందు బెల్లం ధరలు అన్నదాతలకు నిరాశను మిగిల్చాయి. ఒక్కరోజు వ్యవధిలో క్వింటాకు రూ.420లు ధర తగ్గిపోవడంతో రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారు. మార్కెట్ వర్గాలు ఏకంగా రూ.17 లక్షలు కోల్పోయాయి. అనకాపల్లి మార్కెట్‌లో మంగళవారం 27,027 బెల్లం దిమ్మల లావాదేవీలు జరిగాయి. మొదటిరకం క్వింటాకు గరిష్టంగా రూ.2780లు ధర పలికింది. భోగీ పండగ రోజైన బుధవారం నుంచి ఆదివారం వరకు మార్కెట్‌కు సెలవు ఉం టుంది. ఈ సెలవులు, పండగ అవసరాల దృష్ట్యా రైతులు సంక్రాం తికి ముందు భారీగానే బెల్లం తయారు చేసి మార్కెట్‌కు తీసుకు రావడం పరిపాటి. ఈ కీలక సమయంలో లభించిన ధర పండగ అవసరాలకు ఉపయోగపడుతుందని ఆశించారు. బెల్లం ధరలు బాగుం టాయని భావించారు.
ఈదశలో సోమవారం 37,431 బెల్లం దిమ్మల లావాదేవీలు జరిగాయి. క్వింటా రూ.3200లకు అమ్ముడుపోయింది. మంగళవారం నాటికి ఇది రూ.2780కి పడిపోయింది. చంద్రన్న సంక్రాంతి కానుకల్లో భాగంగా తెల్లకార్డు దారులకు ఉచితంగా అరకిలో బెల్లం ఇవ్వడంతో పండగలో రిటైల్ బెల్లం అమ్మకాలు నిలిచిపోయాయి. ఈపరిణామంతో వ్యాపారులు మా ర్కెట్లో బెల్లం కొనుగోలుకు ఆసక్తి చూపలేదు. దీంతో ఒక్కరోజులో క్వింటాకు రూ.420లు తగ్గిపోయింది. రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారు.