పతనావస్థలో బెల్లం ధరలు
అనకాపల్లి : జాతీయ స్థాయిలో రెండో స్థానంలో ఉన్న అనకాపల్లి బెల్లం మార్కెట్‌లో డిసెంబర్ రెండో వారం లావాదేవీలు అటు వర్తకులకు, ఇటు రైతులకు నిరాశనే మిగిల్చాయి. మూడేళ్లుగా అక్టోబర్, నవంబర్ నెలల్లో సంభవిస్తున్న ప్రకృతి వైపరీత్యాలు బెల్లం లావాదేవీలను ప్రభావితం చేస్తున్నాయి. జోరందుకోవాల్సిన సీజన్‌లో బెల్లం క్రయవిక్రయాలు పడిపోతున్నాయి. డిసెంబర్ 8 నుంచి 13వ తేదీ వరకు 74,040 క్వింటాళ్ల బెల్లం క్రయవిక్రయాలు జరగ్గా, క్వింటాల్‌కు కనిష్ట ధర ఈ వారంలో రూ.2,130కి పడిపోయింది.
గరిష్ట ధర సైతం 2,900 రూపాయల వద్దే నిలిచింది. బెల్లం లావాదేవీలు తగ్గినప్పుడు సహజంగా ధరలు పెరగాలి. కానీ రెండవ వారంలో క్వింటాలు బెల్లం 3 వేల రూపాయలకు చేరుకోకపోవడం మార్కెట్ వర్గాలను నిరాశపరిచింది. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి చెరకు బెల్లాన్ని వండినప్పటికీ అనకాపల్లి మార్కెట్‌లో గిట్టుబాటు ధర లభించలేదనేది రైతుల ఆవేదన. 2013లో డిసెంబర్ రెండో వారంలో 82,721 క్వింటాళ్ల లావాదేవీలు జరిగాయి. ఆరు రోజుల లావాదేవీల్లో భాగంగా క్వింటాలు బెల్లం కనిష్టంగా 2,340 రూపాయలు పలకగా, గరిష్టంగా 2,850 రూపాయలు పలికింది.
అంటే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది డిసెంబర్ రెండో వారం లావాదేవీలు 8,681 క్వింటాళ్లు తగ్గినట్లయింది. మూడో రకం బెల్లం కనిష్ట ధర గత ఏడాది కంటే ఈసారి మరీ దయనీయంగా 2,130 రూపాయలు పలికిందంటే ధరలు పతనావస్థలో ఉన్నట్లు గమనించవచ్చు. ఇక గరిష్ట ధర విషయంలో గత ఏడాది 2,850 రూపాయలు పలకగా, ఈ ఏడాది 2,900 వద్ద గరిష్ట ధర నిలిచింది.
మూడో రకం బెల్లం ధర తగ్గినప్పటికీ ఈ ఏడాది చెరకు రైతులు విపత్కర పరిస్థితులను చవిచూశారు. హుద్‌హుద్ కారణంగా చెరకు పంట ధ్వంసం కాగా కాస్తోకూస్తో మిగిలిన చెరకు నేలపాలయింది. కరెంట్ కోత కారణంగా నేలపాలైన చెరకును అక్కడికక్కడే వండకపోవడంతో మార్కెట్‌కు సరఫరా అయ్యే బెల్లం అధికంగా నలుపురంగే వస్తుంది.
ఈ కారణంగా ఈ ఏడాది రైతులు దిగుబడిపరంగానే కాకుండా గిట్టుబాటుపరంగా కూడా నష్టపోయారు. అటువంటి సంకేతాలే రెండో వారం మార్కెట్ ప్రస్ఫుటం చేసింది. గత ఏడాది డిసెంబర్ 16వ తేదీన అనకాపల్లి మార్కెట్‌కు అప్పటివరకు కొనసాగిన ఆ సీజన్‌కు గరిష్టంగా 25,535 దిమ్మల లావాదేవీలు జరిగాయి. మరి ఈ సీజన్‌లో బెల్లం లావాదేవీలు 25 వేల దిమ్మల క్రయవిక్రయాలకు దాటుతాయో లేదో మూడో వారం లావాదేవీలను బట్టి తెలుస్తుంది.