ఎఫెక్షన్.. పర్ఫెక్షన్
పెళ్లి, కుటుంబం, పిల్లల పరిరక్షణ, సమాజంలో పురుషుల భాగస్వామ్యం, ఘనతలు, విజయాలను గుర్తు చేసుకుంటూ జరుపుకునే పండుగే ‘ఇంటర్నేషనల్ మెన్స్ డే’. అదే సమయంలో వారిపై జరుగుతున్న దురాగతాలు, వివక్షనూ ప్రశ్నిస్తోంది ఈ దినోత్సవం. ప్రపంచంలో అరవైకి పైగా దేశాల్లోని మగవారు ఏటా నవంబర్ 19న దీన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
దారులు వేరైనా... సమాజంలో కనీస మానవ విలువలు పాటించే దిశగా ప్రోత్సహించడమే ఈ డే అసలు ఉద్దేశం. ఈవారం ‘క్యాంపస్ కబుర్లు’లో టాపిక్ కూడా ఇదే. నాడు- నేడు... కుటుంబంలో మగవారి పాత్ర, అనుబంధం, అవగాహనలో వచ్చిన మార్పులు, తీరుతెన్నులపై రాంకోఠి ‘జాగృతి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ’ విద్యార్థులు ఆసక్తికరమైన చర్చకు తెరలేపారు.
మై ఇన్స్పిరేషన్...
అమ్మ కంటే నాన్నతోనే ఎక్కువ అటాచ్మెంట్. అమ్మ ఎంత గారాం చేసినా నాన్న పిలుపులో ఏదో కమ్మదనం. హ్యాపీ, అన్‌హ్యాపీ... ఏదైనా మొదట నాన్నతోనే షేర్ చేసుకుంటా. ఇంట్లో ఉంటే... చటుక్కున వెళ్లి నాన్న ఒడిలో కూర్చొని మాట్లాడతా. బయట ఉంటే ఫోన్ చేస్తా. మై ఫాదర్ ఈజ్ మై బెస్ట్ బడ్డీ... ఇన్స్పిరేషన్. అమ్మ కంటే నాన్నకు ఓర్పు కూడా ఎక్కువే. ఎవర్నైనా ప్రేమించినా... అతడి కంటే మా నాన్నకే ముందు చెబుతా.
- పూర్ణిమ
అన్నింటికీ నాన్నే ..
మా నాన్నంటే నాకో క్లోజ్ ఫ్రెండ్‌లా అనిపిస్తారు. సినిమాలకు వెళ్లాలన్నా, షాపింగ్‌కు వెళ్లాలన్నా.. అన్నింటికీ డాడీతోనే. కానీ... మా నాన్నకు వాళ్ల నాన్నను చూస్తే షివరింగట. ఏం కావాలన్నా అమ్మమ్మని కిచెన్‌లోకి తీసుకెళ్లి... సీక్రెట్‌గా అడిగేవారట. నాకా ఇబ్బందులు లేవులేండి. నాన్న నాతో ఎంతో కూల్‌గా, ఫ్రెండ్లీగా ఉంటారు. కాలేజీ విషయాలు కూడా ఆయనతో డిస్కస్ చేస్తా. ఐయామ్ డ్యాడ్స్ క్యూటీ పెట్!
- మానస
ఇప్పుడంతా షేరింగ్...
జనరేషన్ బట్టి జనాల్లో చాలా మార్పులొచ్చాయి. తాతల కాలంలో అమ్మమ్మ ఇంట్లో వంటావార్పూ చూసుకొనేది. తాతయ్య ఉద్యోగం చేసి సాయంత్రానికి ఇంటికొచ్చేవాడు. ఆడవారు వంటింటికే పరిమితమవడం వల్ల నాడు వారికి లోకజ్ఞానం తక్కువగా ఉండేది. ఇప్పుడు... ఇద్దరూ చదువుకుంటున్నారు. ఉద్యోగాలు చేస్తున్నారు. అంటే కష్టాన్ని ఇద్దరూ షేర్ చేసుకొంటున్నారు. పిల్లలకు లగ్జరీ లైఫ్ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారు.
- మహ్మద్ అబ్దుల్ సిరాజ్
నో ఆర్గ్యుమెంట్స్...
నేటితరంలో అంతా చదువుకున్నవారే. సో... అందరిలో పద్ధతి, కూల్ గోయింగ్, సింపుల్నెస్తో లైఫ్ లీడ్ చేయాలని కోరుకుంటున్నాం. ఏదేమైనా రెస్పాండ్ అయ్యే ముందు ‘ఎందుకు’ అని ఓసారి ఆలోచిస్తే అంతా కూల్‌గా సాగిపోతుంది. చాలా గొడవలు తగ్గిపోతాయి. సంబంధాలు గట్టిపడతాయి. అలాకాక ఆర్గ్యుమెంట్స్ చేసుకుంటూ పోతే మనసులు వికలమై... సంబంధాలపై ప్రభావం చూపుతాయి. ఆ సెన్స్‌తోనే నేటి యువకులు మసులుకుంటున్నారనేది నా అభిప్రాయం.
- మహ్మద్ అష్రాఫ్ఖాన్
మాటల్లో చెప్పలేను...
కామన్‌గా ఫాదర్స్ పిల్లల్ని చదివిస్తారేమో! కానీ మా నాన్న అలా కాదు... నా రికార్డ్స్, ప్రాజెక్ట్స్... అన్నింట్లో సాయం చేస్తారు. అమ్మ జాగ్రత్తలు చెబుతుంది. కానీ నాన్న... ఏం జరిగినా నేనున్నానంటూ ధైర్యాన్నిస్తారు. కుటుంబ బాధ్యతల్లో మగవాళ్లకి అంత పేషెన్స్, డెడికేషన్ ఉండటం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. పాపా నన్ను ఓ గాజు బొమ్మలా అపురూపంగా చూసుకుంటారు. నేటితరం మగవాళ్లలో ఆడవారిపై గౌరవం, మర్యాద, అవగాహన చాలా పెరిగాయి.
- పాయల్