మోక్షం కోసం.. 83 ఏళ్ల వయసులో ఆమరణదీక్ష
మోక్షం సాధించడం కోసం 83 ఏళ్ల మహిళ కటక్‌లో గత 50 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆమె ఆమరణ దీక్ష ప్రారంభించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కటక్‌లోని ఫ్రెండ్స్ కాలనీకి చెందిన భవర్లాల్ సేథి భార్య అయిన విక్కీ దేవి సేథి సెప్టెంబర్ 2వ తేదీ నుంచి ఈ దీక్ష చేస్తున్నారని, ఈ భౌతిక శరీరాన్ని వదిలిపెట్టి మోక్షాన్ని సాధించాలన్న జైన సంప్రదాయం ప్రకారమే ఆమె ఇలా చేస్తున్నారని కుటుంబ సభ్యులు చెప్పారు. ఇందుకు తన కుటుంబం నుంచి, మత పెద్దల నుంచి అనుమతి కూడా తీసుకున్నారు.
అయితే.. ఇది చట్ట విరుద్ధమని, దీనిపై ఒడిషా పోలీసులు చర్యలు తీసుకోవాలంటూ 'స్ట్రగుల్ ఫర్ జస్టిస్' అనే స్వచ్ఛంద సంస్థ ఒరిస్సా హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలుచేసింది. ఇలా దీక్ష చేయడం రాజ్యాంగ విరుద్ధమని, రాజ్యాంగంలోని 21వ అధికరణాన్ని, ఐపీసీ 306, 309 సెక్షన్ల కింద శిక్షార్హమని ఆ సంస్థ కార్యదర్శి శశికాంత్ శర్మ అన్నారు. అయితే ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించాలా, వద్దా అనే విషయంలో హైకోర్టు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.