Jairam Ramesh Special status
-
చంద్రబాబు, మోదీతో మ్యాచ్ ఫిక్సింగ్
విజయవాడ : పార్లమెంటులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో కలిసి మ్యాచ్ ఫిక్సింగ్‌కి పాల్పడ్డాడని మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ఆరోపించారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్లో విలేకరులతో మాట్లాడుతూ..చంద్రబాబు దుబాయ్‌లో ఉండి పార్లమెంటులో ఎంపీలను ఆడిస్తున్నాడని ఆరోపించారు. పార్లమెంటులో టీడీపీ చేసేది ముమ్మాటికి డ్రామానేనని వ్యాఖ్యానించారు. విభజన చట్టం సరిగ్గాలేదని విమర్శలు చేసే చంద్రబాబు చట్టాన్ని సవరణ చేసేందుకు నాలుగేళ్లుగా ఎందుకు ప్రయత్నించలేదని మండిపడ్డారు. నాలుగేళ్లుగా టీడీపీ, బీజేపీ ప్రభుత్వాలు ఏం చేశాయని ప్రశ్నించారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతిలో మోదీ ఇచ్చిన హోదా హామీ ఏమైందని ప్రశ్నించారు. విభజన చట్టంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని, అప్పటి ప్రధాని మన్మోహన్ స్పష్టంగా చెప్పారని తెలిపారు. తాము అధికారంలోకి వస్తే పదేళ్లు హోదా ఇస్తామని చెప్పిన వెంకయ్య ఇపుడు ఏం అంటారని ప్రశ్నించారు. 14 వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా వద్దు అని చెప్పిందని కేంద్రం చెబుతున్న మాట పచ్చి అబద్ధమని అన్నారు. 11 రాష్ట్రాలు ప్రత్యేక హోదా అనుభవిస్తుంటే ఏపీకి 12వ రాష్ట్రంగా ఉండటానికి మోదీ అభ్యంతరం ఏంటని అడిగారు. పోలవరం కేంద్రం కట్టాలని ఉంటే రాష్ట్రం ఎందుకు కడుతోందని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని ఆశాస్త్రీయంగా విభజన చేశారని చెబుతున్న బాబు ఎందుకు సవరణ చేయటం లేదని అడిగారు. సవరణకు ప్రయత్నిస్తే పార్లమెంటులో టీడీపీకి తాము మద్ధతు తెలుపుతామన్నారు. నాలుగేళ్ళ వైఫల్యాలను కప్పి పుచ్చటానికే టీడీపీ కొత్త డ్రామాలు ఆడుతోందని ధ్వజమెత్తారు. 2019లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని, మొదటి సంతకం ఏపీకి హోదా పైనే పెడతామని చెప్పారు. -
మోదీ, వెంకయ్య మోసగించారు
కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్ సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు రాష్ట్ర ప్రజలను వంచించారని కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్ ఆరోపించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చి...అధికారంలోకి వచ్చాక అమలుకు చర్యలు తీసుకోలేదన్నారు. హైదరాబాద్‌లోని ఇందిర భవన్లో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రత్యేక హోదా పదేళ్ల పాటు కొనసాగించాలంటూ అప్పట్లో రాజ్యసభలో డిమాండ్ చేసిన వెంకయ్య... ఇప్పుడు మాట మార్చడాన్ని తప్పుబట్టారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించినా ముందుకు సాగడం లేదన్నారు. చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టుకు, వెంకయ్య నాయుడు ప్రత్యేక హోదాకు అడ్డుపడుతున్నారన్నారు. ప్రైవేటు వ్యక్తులకు అనుకూలమైన సవరణలు ఉండటం వల్లే 2013 భూసేకరణ చట్టం ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తున్నామన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాజ్యసభలో వాటి బిల్లును ఆమోదించబోమన్నారు. రైతు అనుకూల పార్టీలుగా చెప్పుకొనే టీడీపీ, టీఆర్ఎస్ కూడా దీనిని వ్యతిరేకించాలన్నారు. ప్రైవేటు కంపెనీలు భూ సేకరణ చేస్తే 80 శాతం రైతుల అనుమతి తప్పనిసరని 2013 నాటి చట్టం చెబుతోందన్నారు. అయితే ఎవరి ప్రయోజనాలకోసం పీపీపీ ప్రాజెక్టులకు 70 శాతం అనుమతి తప్పనిసరంటూ నిర్దేశించారని ప్రశ్నించారు. పారిశ్రామిక కారిడార్ల వరకు మాత్రమే భూసేకర ణ చేయాలని చట్టం చెబుతుంటే...వాటికి చుట్టుపక్కల కిలో మీటర్ మేరకు భూసేకరణ చేయొచ్చంటూ బీజేపీ ప్రభుత్వం సవరణలు తేవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారన్నారు. ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజు, జంగా గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.