మోదీ, వెంకయ్య మోసగించారు
- కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు రాష్ట్ర ప్రజలను వంచించారని కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్ ఆరోపించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చి...అధికారంలోకి వచ్చాక అమలుకు చర్యలు తీసుకోలేదన్నారు. హైదరాబాద్‌లోని ఇందిర భవన్‌లో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ప్రత్యేక హోదా పదేళ్ల పాటు కొనసాగించాలంటూ అప్పట్లో రాజ్యసభలో డిమాండ్ చేసిన వెంకయ్య... ఇప్పుడు మాట మార్చడాన్ని తప్పుబట్టారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించినా ముందుకు సాగడం లేదన్నారు. చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టుకు, వెంకయ్య నాయుడు ప్రత్యేక హోదాకు అడ్డుపడుతున్నారన్నారు. ప్రైవేటు వ్యక్తులకు అనుకూలమైన సవరణలు ఉండటం వల్లే 2013 భూసేకరణ చట్టం ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తున్నామన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాజ్యసభలో వాటి బిల్లును ఆమోదించబోమన్నారు.
రైతు అనుకూల పార్టీలుగా చెప్పుకొనే టీడీపీ, టీఆర్‌ఎస్ కూడా దీనిని వ్యతిరేకించాలన్నారు. ప్రైవేటు కంపెనీలు భూ సేకరణ చేస్తే 80 శాతం రైతుల అనుమతి తప్పనిసరని 2013 నాటి చట్టం చెబుతోందన్నారు. అయితే ఎవరి ప్రయోజనాలకోసం పీపీపీ ప్రాజెక్టులకు 70 శాతం అనుమతి తప్పనిసరంటూ నిర్దేశించారని ప్రశ్నించారు. పారిశ్రామిక కారిడార్ల వరకు మాత్రమే భూసేకర ణ చేయాలని చట్టం చెబుతుంటే...వాటికి చుట్టుపక్కల కిలో మీటర్ మేరకు భూసేకరణ చేయొచ్చంటూ బీజేపీ ప్రభుత్వం సవరణలు తేవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారన్నారు. ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజు, జంగా గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.