ఫైల్ ఫొటో
న్యూఢిల్లీ: ప్రధాని హోదాలో ఉన్న నరేంద్ర మోదీ.. ప్రతిపక్ష నేతలను కలవాలని సలహా ఇచ్చారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగాల పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న వెంకయ్యనాయుడు.. ఈ మేరకు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పుస్తక ఆవిష్కరణలో ముందుగా ప్రధాని మోదీపై ప్రశంసలు గుప్పించారు వెంకయ్యనాయుడు. భారతదేశం ఇప్పుడు లెక్కించదగిన శక్తి. దాని స్వరం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తోంది. మోదీ పాలనలో దేశం ఆరోగ్య రంగం, విదేశాంగ విధానం, సాంకేతికత.. ఇలా అన్ని రంగాల్లో లక్ష్యసాధనతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కించుకుందని కొనియాడారు. ఇంత తక్కువ టైంలో ఇలాంటి ఘనత సాధించడం సర్వసాధారణ విషయం కాదని, అద్బుతమన్న వెంకయ్యనాయుడు.. మోదీ నిర్ణయాలు, ఆ మార్గంలో యావత్ దేశపౌరులు పయనించడమే కారణమని చెప్పారు. కానీ,
మోదీ పాలనాపరమైన విధానాలపై కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత ఉందని.. అందుకు రాజకీయపరమైన కారణాలు, అపార్థాలు కూడా కారణం అయ్యి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు వెంకయ్యనాయుడు. వాటిని చెరిపేసేందుకు తరచూ మోదీ రాజకీయ వర్గాలను కలుస్తూ ఉండాలని, ముఖ్యంగా ప్రతిపక్షాలను కలుస్తూ ఉండాలని వెంకయ్యనాయుడు సూచించారు. తద్వారా అపార్థాలు తొలగిపోతాయన్నారు. అదే సమయంలో, రాజకీయ పార్టీలు కూడా విశాల దృక్పథంతో ఉండాలని, ప్రజల ఆదేశాన్ని గౌరవించాలని నాయుడు పేర్కొన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు రాజకీయ ప్రత్యర్థులే తప్ప.. శత్రువులు కారని గుర్తించాలని అని సూచించారు. ముఖ్యమంత్రి, రాష్ట్రపతి.. ఇలా ఉన్నతపదవులకు గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారాయన.
2019 మే-2010 మే మధ్య ప్రధాని మోదీ ప్రసంగాలతో కూడిన ‘సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్’ పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి కేరళ గవర్నర్ అరిఫ్ మహ్మద్, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, ఐబీ సెక్రెటరీ అపూర్వ చంద్ర హాజరయ్యారు.
ఇదీ చదవండి: హర్తాల్ కోసమే కాంగ్రెస్ యాత్రకు బ్రేక్!
Comments
Please login to add a commentAdd a comment