కార్యక్రమంలో వెంకయ్య, బృందాకారత్, మీరాకుమార్ తదితరులు
ముంబై: సుపరిపాలనకు శాసనసభ్యులు సమష్టిగా కృషిచేయాలని ప్రధాని మోదీ ఉద్భోదించారు. ముంబైలో మూడ్రోజులుగా జరుగుతున్న జాతీయ శాసనసభ్యుల సదస్సుకు ప్రధాని మోదీ శనివారం ఒక సందేశం పంపించారు. అందులో మోదీ ఏమన్నారంటే.. ‘ సుపరిపాలన, విజయవంతమైన శాసనాల పరిశీలన, అభివృద్ధి నమూనాలు వంటి ప్రజాస్వామ్య విధానాల రూపకల్పన, వాటి పటిష్టత కోసం భిన్న పార్టీల ప్రతినిధులైన శాసనసభ్యులు ఇలా ఒక్క చోటుకు చేరడం నిజంగా విశేషమైన పరిణామం. దేశం అమృతకాలంలో పయనిస్తున్న ఈ తరుణంలో విధాననిర్ణేతలంతా సమష్టిగా చేసే కృషి.. దేశం అభివృద్ధి పథంలో సమున్నత శిఖరాలకు చేరుస్తుందన్న దృఢ విశ్వాసం నాలో ఇనుమడిస్తోంది.
క్షేత్ర స్థాయి నుంచే నిరంతరాయంగా అభివృద్ధిని కాంక్షిస్తూ చేసే కృషి చివరకు ‘వైభవోపేత, అభివృద్ధి చెందిన భారత్’ అనే స్వప్నాన్ని నిజం చేస్తుంది’ అని అన్నారు. ‘ ప్రజలతో మమేకమవడంలో, వారి సమస్యలను పరిష్కరించడంలో ప్రజా ప్రతినిధుల పాత్ర అత్యంత కీలకం. దేశం నలుమూలల నుంచి విచ్చేసిన శాసనసభ్యులు ఒకరినొకరు తెల్సుకుని ఆయా నియోజకవర్గాల్లో వారి సమర్థ పనితీరును అర్థం చేసుకునేందుకు జాతీయ శాసనసభ్యుల సదస్సు చక్కని వేదిక. పనితీరును బేరేజువేసుకుని మెరుగైన అభివృద్ధి నమూనాలతో శాసనసభ్యులు మరింతగా దూసుకుపోగలరనే నమ్మకం నాలో ఎక్కువైంది’ అని మోదీ వ్యాఖ్యానించారు. ఐఎంఐ–స్కూల్ ఆఫ్ గవర్నెన్స్ ఈ సదస్సును ఏర్పాటుచేసింది. శనివారంతో ముగిసిన ఈ మూడ్రోజుల సదస్సులో దేశవ్యాప్తంగా మొత్తంగా 1,500 మందికిపైగా శాసనసభ్యులు పాల్గొన్నారు.
న్యాయవ్యవస్థ చట్టాలు చేయలేదు
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య
చట్టాల రూపకల్పనలో అత్యున్నతమైన, తుది నిర్ణయాధికారం శాసనవ్యవస్థదేనని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. శనివారం ముంబైలో జాతీయ శాసనసభ్యుల సదస్సులో ఆయన ప్రసంగించారు.‘ చట్టాలు చేయడంలో శాసనవ్యవస్థ పాత్ర సర్వోన్నతం. ఈ ప్రక్రియలో న్యాయవ్యవస్థకు ఎలాంటి పాత్ర లేదు. కార్యనిర్వాహక వ్యవస్థ, శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థల పాత్రలను రాజ్యాంగం సుస్పష్టంగా నిర్వచించింది. ఏదైనా అంశంలో తామే సర్వోన్నతులమని భావించి పరిధులను దాటడానికి ఈ వ్యవస్థలు ప్రయత్నించకూడదు. శాసనాలను చేసే బాధ్యత రాజ్యాంగం కేవలం శాసనవ్యవస్థలకే అప్పజెప్పింది. రాజ్యాంగానికి బద్దమై ఆయా చట్టాలు ఉన్నాయో లేదో అని తేల్చే సమీక్షాధికారం మాత్రం న్యాయవ్యవస్థకే ఉంది. కోర్టులు చట్టాన్ని రూపొందించలేవు. ఈ విషయాన్ని అవి మననం చేసుకుంటే చాలు’ అని వెంకయ్య వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment