విలేకరులతో మాట్లాడుతున్న కాంగ్రెస్ నేత జైరాం రమేష్, ఇతర కాంగ్రెస్ నేతలు
విజయవాడ : పార్లమెంటులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో కలిసి మ్యాచ్ ఫిక్సింగ్‌కి పాల్పడ్డాడని మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ఆరోపించారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ..చంద్రబాబు దుబాయ్‌లో ఉండి పార్లమెంటులో ఎంపీలను ఆడిస్తున్నాడని ఆరోపించారు. పార్లమెంటులో టీడీపీ చేసేది ముమ్మాటికి డ్రామానేనని వ్యాఖ్యానించారు. విభజన చట్టం సరిగ్గాలేదని విమర్శలు చేసే చంద్రబాబు చట్టాన్ని సవరణ చేసేందుకు నాలుగేళ్లుగా ఎందుకు ప్రయత్నించలేదని మండిపడ్డారు.
నాలుగేళ్లుగా టీడీపీ, బీజేపీ ప్రభుత్వాలు ఏం చేశాయని ప్రశ్నించారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతిలో మోదీ ఇచ్చిన హోదా హామీ ఏమైందని ప్రశ్నించారు. విభజన చట్టంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని, అప్పటి ప్రధాని మన్మోహన్ స్పష్టంగా చెప్పారని తెలిపారు. తాము అధికారంలోకి వస్తే పదేళ్లు హోదా ఇస్తామని చెప్పిన వెంకయ్య ఇపుడు ఏం అంటారని ప్రశ్నించారు. 14 వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా వద్దు అని చెప్పిందని కేంద్రం చెబుతున్న మాట పచ్చి అబద్ధమని అన్నారు.
11 రాష్ట్రాలు ప్రత్యేక హోదా అనుభవిస్తుంటే ఏపీకి 12వ రాష్ట్రంగా ఉండటానికి మోదీ అభ్యంతరం ఏంటని అడిగారు. పోలవరం కేంద్రం కట్టాలని ఉంటే రాష్ట్రం ఎందుకు కడుతోందని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని ఆశాస్త్రీయంగా విభజన చేశారని చెబుతున్న బాబు ఎందుకు సవరణ చేయటం లేదని అడిగారు. సవరణకు ప్రయత్నిస్తే పార్లమెంటులో టీడీపీకి తాము మద్ధతు తెలుపుతామన్నారు. నాలుగేళ్ళ వైఫల్యాలను కప్పి పుచ్చటానికే టీడీపీ కొత్త డ్రామాలు ఆడుతోందని ధ్వజమెత్తారు. 2019లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని, మొదటి సంతకం ఏపీకి హోదా పైనే పెడతామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment