జంపింగ్ జంపాగ్స్‌పై జోరుగా ప్రచారం.. టీఆర్ఎస్, బీజేపీలో కొత్త టెన్షన్!
కామారెడ్డి జిల్లాలో బీజేపీలోని ఓ మాజీ ఎమ్మెల్యే, గులాబీ గూటిలో ఉన్న మరో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పార్టీ మార్పిళ్ళ ప్రచారం తలబొప్పి కట్టిస్తోంది. ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి గత ఎన్నికల్లో ఓటమిపాలై టీఆర్ఎస్ నుంచి కొంతకాలం క్రితం బీజేపీలో చేరారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన జాజుల సురేందర్ చాలా కాలం క్రితమే హస్తానికి హ్యాండిచ్చి కారెక్కేశారు. అయితే ఇప్పుడు ఈ ఇద్దరూ పార్టీ మారుతున్నారంటూ సాగుతున్న ప్రచారం వారిని ఇబ్బందులకు గురిచేస్తోంది.
అదే సమయంలో తమ పార్టీలకు చెందిన కేడర్‌ను కూడా గందరగోళంలో ముంచుతోంది. ఏడాది క్రితమే బీజేపీలో చేరిన ఏనుగు రవీందర్‌రెడ్డి తిరిగి పాత గూటికి చేరబోతున్నారంటూ కొద్ది రోజులుగా ఎల్లారెడ్డి అంతటా ప్రచారం హల్ చల్ చేస్తోంది. ఏనుగు, జాజుల వ్యవహారం అటు బీజేపీలోను.. ఇటు గులాబీ పార్టీలోను అలజడి రేపుతోంది. ఇటీవలే నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ళ వ్యవహారంపై ఎంత రచ్చ జరిగిందో తెలిసిందే. ఈ పరిస్థితుల్లో వీరిద్దరి వ్యవహారం కామారెడ్డి జిల్లా రాజకీయాల్లో కాక రేపుతోంది.
ఎవరిది ఘర్..? ఎవరు వాపస్?
టీఆర్ఎస్ ఘర్ వాపసీలో భాగంగా.. ఇప్పటికే స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్ వంటివారు.. కాషాయ పార్టీకి గుడ్ బై చెప్పి గులాబీ గూటికి చేరిపోయారు. మరికొందరు మాజీల గురించి కూడా ప్రచారం ఊపందుకోగా.. ఎల్లారెడ్డిలో ఏనుగు రవీందర్ రెడ్డి పేరు జోరుగా వినిపిస్తోంది. ఏనుగు పార్టీ మారుతారని ప్రచారం జరిగినప్పుడల్లా అనుచరులు ఆయన్ను అడగడం, పార్టీ మారేది లేదని రవీందర్ రెడ్డి ఖండించడం షరామాములుగా జరుగుతూనే ఉంది. ఐతే మునోగోడు ఉప ఎన్నిక సమయంలో మరోసారి ఇలాంటి ప్రచారం జరుగుతుండటం ఆయనకు తలబొప్పి కట్టిస్తుండటంతో పార్టీ మరే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తూ సోషల్ మీడియాలో ఏనుగు ఓ వీడియో సందేశాన్ని పోస్ట్ చేయగా అది వైరల్‌గా మారింది.
ముందు పుకార్లు.. ఆపై షికార్లు
ఏనుగు రవీందర్ రెడ్డి ఎల్లారెడ్డి నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఉద్యమ కాలం నుంచీ గులాబీపార్టీలోనే ఉన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జాజుల సురేందర్ చేతిలో ఓటమి చెందారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన సురేందర్ కారు ఎక్కేయడంతో అలక వహించిన రవీందర్ రెడ్డి కాషాయతీర్దం పుచ్చుకున్నారు. అయితే, ఇటీవల కొందరు పని గట్టుకుని ఏనుగు.. తిరిగి గులాబీ గూటికి చేరతారంటూ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతుండటంతో ఎల్లారెడ్డిలో ఓ విచిత్ర రాజకీయ పరిస్థితికి తెరలేపింది. ఏనుగు తిరిగి పార్టీలోకి వస్తే తమ పరిస్దితేంటన్నది ప్రస్తుత ఎమ్మెల్యే జాజుల టెన్షన్. రవీందర్ రెడ్డి టీఆర్ఎస్లో చేరతారనే ప్రచారం ఎంత వరకు నిజమన్న విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారట సిట్టింగ్ ఎమ్మెల్యే.
పోటాపోటీగా ఆపరేషన్ ఆకర్ష్
పాత మిత్రులందరినీ దగ్గరకు తీస్తున్న గులాబీ పార్టీ.. రవీందర్ రెడ్డికి సైతం సాదర ఆహ్వానం పలుకుతుందనే ప్రచారం అయితే బలంగా వినిపిస్తోంది. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ఆపరేషన్ ఆకర్ష్ పోటాపోటీగా జరుగుతున్న వేళ ఏనుగు అడుగులు ఎటువైపు పడబోతున్నాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.