జలప్రభ..ఓ బలిపీఠం
డ్వామా అవినీతిలో చిన్న చేపలను బలి చేస్తున్న అధికారులు
డబ్బులు తిన్న వారిని వదిలి...క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి రికవరీ చేయాలని నిర్ణయం
మినల్ కేసులు పెట్టాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు
క్వాలిటీ కంట్రోల్ అధికారులు చెప్పిందొకటి.. జరిగింది మరొకటి
పెద్ద తలకాయలను కన్‘ఫర్మ్’ చేయాల్సిందేనంటున్న కింది స్థాయి సిబ్బంది
సీబీసీఐడీ విచారణకు అదేశిస్తేనే నిజాలు నిగ్గు తేలే అవకాశం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : వాళ్లకు చెక్కులపై సంతకాలు పెట్టే అధికారం లేదు... డబ్బులిచ్చే స్వేచ్ఛ అంతకన్నా లేదు...అవినీతికి ఆస్కారం ఉన్న చోట సంతకం పెట్టకపోతే పైనుంచి ఫోన్ల మీద ఫోన్లు.. ఫోన్లు వచ్చాయి కదా అని సంతకాలు పెట్టేశారు..ఇందుకు తృణమో, ఫణమో ముట్టింది.. ఆ సంతకాలను ఫణంగా పెట్టి పెద్ద తలకాయలు ప్రభుత్వ సొమ్మును అడ్డగోలుగా దోచుకున్నారు..వాటాలు వేసి పంచుకున్నారు.. పానకంలో పుడకలాగా మధ్యలో కొంతమంది దళారులు కన్‘ఫర్మ్’ అయ్యి మరీ డబ్బులు పంచారు..పాపం పండి వీరి బాగోతం బయటపడింది..అయితే చెక్కులపై సంతకాలు పెట్టినవాళ్లు.. గంపగుత్తగా లక్షల రూపాయలు మింగిన వారు...దళారుల అకౌంట్లలో డబ్బులు జమ చేయించిన వాళ్లు బయటపడ్డారు...కానీ వందలు, వేలకు ఆశపడి, అధికారానికి తలొగ్గివాళ్లు రాసి ఇచ్చిన కాగితాలపై సంతకాలు పెట్టిన చిన్న చేపలే బలయ్యాయి. ఇదంతా డ్వామా అవినీతి కథ...
పాత బావుల్లో నుంచి ‘నోట్ల’ కట్టలు
ఇందిర జలప్రభ పథకం కింద జిల్లాలోని ఎస్సీ, ఎస్టీల భూములకు సాగునీరందించేందుకు జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) ఆధ్వర్యంలో కోట్ల రూపాయల పనులు జరిగాయి. మొత్తం 202 బావుల నిర్మాణ పనులకు గాను 119 పనుల్లో నిధులు దుర్వినియోగం అయ్యాయని ఆరోపణలు వచ్చాయి. ఈ పనుల్లో పై నుంచి కింది వరకు అందరూ మిలాఖత్ అయి ప్రభుత్వ సొమ్మును పేదలకు చేరకుండా మధ్యలోనే కొట్టాశారనే గత ఏడాది అక్టోబర్‌లో వార్తలు కూడా వెల్లువెత్తాయి. అయితే, ఈ అవినీతి వ్యవహారం (వెలుగులోకి వచ్చింది చాలా తక్కువ.. రావాల్సింది భారీగానే ఉంది.)లో మొత్తం 2.4 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ప్రాథమిక విచారణలో తేలింది. వాస్తవానికి ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు గాను కనీసం ఇద్దరికి తగ్గకుండా రైతులు, ఐదెకరాలకు తగ్గకుండా భూమి ఉండాలి. ఈ నిబంధన మేరకు సదరు రైతుల సమూహానికి నేరుగా లబ్ధి చేకూరాలి.
వారు చేసుకున్న పనిని బట్టి దశల వారీగా వారి ఉమ్మడి బ్యాంక్ అకౌంట్లో నేరుగా నిధులు జమచేయాలి. ఈ నిధులను జమచేసే అధికారం కూడా ఏపీడీ స్థాయి అధికారులకు మాత్రమే ఉంది. కానీ ఈ నిధులు రైతుల బ్యాంకు అకౌంట్లలోకి వెళ్లకుండా డ్వామా జిల్లా కార్యాలయంలో రిజిస్టర్ చేసుకున్న మూడు ఫర్మ్‌ల అకౌంట్లలోకి వెళ్లాయని సమాచారం. అందులో ముఖ్యంగా రెండు ఫర్మ్లలోనికి పెద్ద ఎత్తున నిధులు వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ ఫర్మ్‌లను కూడా ఓ ప్రధాన రాజకీయ పార్టీ నాయకులు తమ బినామీలతో నడిపిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ ఫర్మ్‌లను నిర్వహించేవారు రైతుల బావులు మరమ్మతులు నామమాత్రంగా చేసి రూ10వేలు ఖర్చయిన దగ్గర రూ.లక్షలకు బిల్లులు పెట్టుకుని తమ అకౌంట్లలో డబ్బులు జమచేయించుకున్నారు. అలా జమచేసినందుకు సహకరించిన ‘కీలక’ అధికారులకు పెద్దఎత్తున ముట్టజెప్పారు. కింది స్థాయిలో సంతకాలు పెట్టిన వారికి ఎంతో కొంత జేబులో పెట్టారు. మిగిలిన ప్రభుత్వ సొమ్మును దర్జాగా అనుభవిస్తున్నారు.
మరి ఏం జరిగింది...?
ఎలా జరిగినా... ప్రభుత్వ సొమ్ము దారిమళ్లిందంటే దానిపై చర్యలు తీసుకోవాల్సిందే. కానీ, ఆ చర్యలు తీసుకోవడంలోనే జిల్లా అధికారులు అన్యాయంగా వ్యవహరించారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ అవినీతి వ్యవహారంలో మిర్యాలగూడ క్లస్టర్ పరిధిలోని మొత్తం 33 మంది సిబ్బందిని సస్పెండ్‌ను చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. వీరినుంచి ఆ సొమ్మునంతా రికవరీ చేయాలని, వీరిపై క్రిమినల్ కేసులు పెట్టాలని కూడా గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇక్కడే అసలు విషయం జరిగింది. ఈ ఉత్తర్వుల్లోనే సస్పెన్షన్ చర్యలు నిజంగా తీసుకోవాల్సిన వారి పేర్లు లేవు. అధికారులకు డబ్బుల ఎర చూపి కోట్ల రూపాయలు దండుకుని ఖరీదైన కార్లలో తిరుగుతున్న దళారుల ఊసే లేదు.
క్షేత్రస్థాయి సిబ్బంది అయినా తప్పు చేస్తే చర్యలు తీసుకోవాల్సిందే... కానీ మరి అదే చర్యలు ఈ కుంభకోణంలో కీలక పాత్ర పోషించి ఉన్నతాధికారులపై ఎందుకు తీసుకోలేదన్నదే అసలు ప్రశ్న. దళారుల నుంచి రాబట్టాల్సిన సొమ్మును చిన్న చిన్న ఉద్యోగుల నుంచి రాబట్టాలని ఎలా నిర్ణయించారో అంతుపట్టని వేదన. మాకేం తెలియదని, నిబంధనలు ఎలా ఉంటే అలా వెళతామని అధికారులు చెప్పవచ్చు కానీ.. ఒక్కొక్కరికి ఒక్కో న్యాయం ఎలా అమలవుతుందన్నది సమాధానం లేని ప్రశ్న.
ఈ అవినీతి వ్యవహారంపై హైదరాబాద్ నుంచి క్వాలిటీ కంట్రోల్ బృందం విచారణకు వచ్చినప్పుడు ఉన్నతాధికారులు, ఫర్మ్‌ల నుంచి సొమ్ము రికవరీ చేయాలని ప్రభుత్వానికి సిఫారసు చేస్తామని వారు చెప్పారని, కానీ ఆదేశాలు మాత్రం మా నుంచి రికవరీ చేయాలని వచ్చాయని క్షేత్రస్థాయి సిబ్బంది వాపోతున్నారు. ఉపాధి హామీ పనులే చేయలేక తాము బిజీగా ఉంటే.. .జలప్రభ పనులు కూడా అంటగట్టి వచ్చిన కాగితాల మీద సంతకాలు పెట్టాలని ఉన్నతాధికారులు తమకు చెప్పారని, కార్యాలయాలకు పిలిపించి, ఫోన్లు చేసి మరీ ఒత్తిడులు తెచ్చారని, ఇప్పుడు తప్పంతా తమపై నెట్టివేసి తమను బలిపశువులను చేశారని వారు వాపోతున్నారు. నిజంగా ఈ కుంభకోణంలో నిజాలు నిగ్గుతేలాలంటే సంబంధిత మంత్రి, కలెక్టర్లు పూనుకుని సీబీసీఐడీకి విచారణ బా ధ్యతలు అప్పగించాలని వారు కోరుతున్నారు.
మాజీ పీడీకి క్లీన్చిట్...
ఈ వ్యవహారంలో పెద్దఎత్తున ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ప్రాజెక్టు డెరైక్టర్ సునందకు క్లీన్చిట్ ఇచ్చి, ఆమె లాస్ట్ పే సర్టిఫికెట్ ఇచ్చేశారు జిల్లా అధికారులు. వాస్తవానికి ఆరోపణలు ఎదుర్కొం టున్న అధికారులకు సంబంధించిన నివేదిక ప్రభుత్వానికి వెళ్లిన తర్వాత వాటి నిగ్గు తేలేంతవరకు ఈ సర్టిఫికెట్ ఇవ్వకూడదు. కానీ ఏం జరిగిందో ఏమో కానీ జిల్లా అధికారులు మాత్రం ఆమెకు లాస్ట్పే సర్టిఫికెట్ ఇచ్చేశారు. మరోవైపు అసలు ఈ కుంభకోణంలో కీలక సూత్రధారి, పాత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీడీ మల్లయ్యను ఎందుకు సస్పెండ్ చేయలేదో అర్థం కాని పరిస్థితి. ఆయన తమ శాఖకు చెందిన ఉద్యోగి కాదని, ఆయన మాతృశాఖకు వివరాలన్నీ పంపామని, వారు చూసుకుంటారని ఇక్కడి అధికారులు చెపుతున్నా.. మల్లయ్య మాతృశాఖ అధికారులు ఏం చేస్తున్నారనేది అంతుపట్టడం లేదు.
ఇక, ఫర్మ్‌ల పేరులో ప్రజల సొమ్మును కొల్లగొట్టిన వారి ఊసు అసలే లేదు. తమ దగ్గర రిజిస్టర్ చేసుకున్న ఫర్మ్‌లు ప్రైవేటువే అయినా, వాటి ప్రస్తావనను ఎందుకు తేరనేది అంతుపట్టడం లేదు. తమ దగ్గర పనిచేస్తున్న కింది స్థాయి ఉద్యోగులపై యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకునే యంత్రాంగం మిగిలిన వారి విషయంలో ఉదాసీనంగా ఎందుకు వ్యవహరిస్తుండడం గమనార్హం. మరోవైపు ఈ కేసు ను సీబీసీఐడీకి అప్పగించాలనే డిమాండ్ వినిపిస్తోంది. అయితే, ఈ కేసును సీసీఎస్ పోలీసులకు అప్పగించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోం ది. ఈ మేరకు త్వరలోనే విచారణ కూడా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఈ విచార ణలోనయినా పెద్ద చేపలు చిక్కుతాయా... యథావిధిగా చిన్న చేపలే మళ్లీ బలవుతాయా అన్నది వేచిచూడాల్సిందే.