జలప్రభ బోర్లలో అక్రమాల ఊట
Published Wed, Dec 11 2013 4:30 AM | Last Updated on Sat, Sep 2 2017 1:27 AM
సాక్షి, నిజామాబాద్: దళిత, గిరిజనుల ఆర్థిక అభ్యున్నతే లక్ష్యంగా అమలు చేస్తున్న ఇందిర జలప్రభ పథకం అక్రమాలకు నిలయంగా మారింది. క్షేత్ర స్థాయిలో అధికారులు, అక్రమార్కులతో చేతులు కలిపి ఈ పథకం నిధులను పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. సాగుకు యోగ్యంగా లేని ఎస్సీ, ఎస్టీల భూముల్లో ఈ పథకం కింద బోరుబావులు తవ్వించి సాగునీటి సౌకర్యం కల్పిస్తారు. ఇందుకోసం చేపట్టిన బోరుబావుల తవ్వకాల్లో అధికారులు జిమ్మిక్కులకు పాల్పడుతున్నారు. తక్కువ లోతులో బోర్లు తవ్వించి.. ఎక్కువ లోతులో తవ్వినట్లు రికార్డులు సృష్టిస్తున్నారు.
అలాగే బోరుబావులు నాలుగుకాలాల పాటు మనుగడలో ఉండాలంటే బోరులో మట్టి (లూజ్ సాయిల్) కూరుకు పోకుండా కేసింగ్ (ప్లాస్టిక్ పైపు) బిగిస్తారు. సాధారణంగా బోరు డ్రిల్లింగ్ చేసేటప్పుడే 60 ఫీట్‌ల వరకు ఈ కేసింగ్ వేస్తారు. అయితే ఈ పథకం కింద వేస్తున్న బోర్లకు నామమాత్రంగా కేసింగ్ వేసి పూర్తి స్థాయిలో బిల్లులు కాజేసినట్లు తెలుస్తోంది. ఇలా కొంతలోతు వరకు మాత్రమే కేసింగ్ వేయడంతో జుక్కల్ నియోజకవర్గంలోని పలు బ్లాకుల్లో వేసిన బోర్లు ఇప్పటికే వట్టిపోయాయి. ఈ నియోజకవర్గంలో బోర్ల తవ్వకాల్లో లక్షల రూపాయలు పక్కదారి పట్టినట్లు జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది. ఈ నెల 7న జరిగిన జిల్లా పరిషత్ సమీక్ష సమావేశంలో ఈ అంశంపై వాడివేడిగా చర్చ జరి గింది. ఎమ్మెల్యే హన్మంత్‌షిండేతో సహా పలువురు ఎమ్మెల్యేలు ఈ అక్రమాలపై ధ్వజమెత్తారు. వీటిని పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఇదీ పథకం ప్రగతి
ఈ పథకం కింద జిల్లాకు రూ. 24 కోట్లు (ఈజీఎస్ నిధులు రూ. 12 కోట్లు, నాబార్డు నిధులు రూ. 12 కోట్లు) మంజూరయ్యాయి. జిల్లా వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీలకు చెందిన 14,223 ఎకరాల భూములను సాగులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ భూములను 1,819 బ్లాకు (కొందరు లబ్ధిదారుల భూములను కలిపి ఒక బ్లాక్ ఏర్పాటు చేస్తారు)లుగా విభజించారు. ఇందులో 1,221 బ్లాకుల సర్వే పూర్తయింది. ఈ బ్లాకుల్లో బోర్లు డ్రిల్లింగ్ చేసేందుకు 814 పాయింట్లను గుర్తించిన అధికారులు, ఇప్పటి వరకు 544 బోర్లు తవ్వినట్లు రికార్డుల్లో పేర్కొంటున్నారు.
ఇందులో 407 బోర్లలో నీళ్లు వచ్చినట్లు గుర్తించారు. ఇలా సక్సెస్ అయిన బోర్లకు ఇప్పటి వరకు 152 పంపుసెట్లను బిగించారు. మిగిలిన బోర్లకు కూడా పంపుసెట్లను బిగించేందుకు విద్యుత్ సౌకర్యం కల్పించాలని జిల్లా నీటియాజమాన్య సంస్థ విద్యుత్‌శాఖకు దరఖాస్తులు చేసింది. ఇందుకు అవసరమైన బిల్లులను కూడా ట్రాన్స్‌కోకు చెల్లించింది. ఇప్పటి వరకు మొత్తం రూ. 3.29 కోట్లను ఖర్చు చేశారు. కాగా జిల్లాలో బోర్ల తవ్వకాల కోసం పది మంది రిగ్గు యజమానులను ఎంపిక చేశారు. బోర్ల తవ్వకాలకు చెల్లిస్తున్న రేట్లు చాలా తక్కువగా ఉన్నాయని రిగ్గు యజమానులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం చెల్లించే ఈ రేట్లతో బోర్లు వేస్తే నష్టాల పాలవుతున్నామని రిగ్గు యజమానులు వాపోతున్నారు.
Advertisement