jalagam vengal rao
-
హాట్ టాపిక్‌గా ఖమ్మం పాలిటిక్స్.. అప్పుడు తండ్రి.. ఇప్పుడు కుమారుడు
సత్తుపల్లి: ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గానికి 1979లో జరిగిన ఉపఎన్నికలో 14 వేల ఓట్ల మెజార్టీతో ఇందిరా కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన జ్యేష్ట వెంకటేశ్వరరావు అసెంబ్లీకి వెళ్లకుండానే వేటు పడింది. తాజాగా 2018 ఎన్నికల్లో కొత్తగూడెం ఎమ్మెల్యేగా గెలిచిన వనమా వెంకటేశ్వరరావుపై ఇప్పుడు వేటు పడింది. నాటి ఘటనలో మాజీ సీఎం వెంగళరావు వ్యూహాత్మకంగా వ్యవహరించగా.. ఇప్పుడు ఆయన కుమారుడు జలగం వెంకట్రావు అదే పంథాను అనుసరించడం చర్చనీయాంశంగా మారింది. ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందంటే.. 1978లో జరిగిన ఎన్నికల్లో జలగం వెంగళరావు కాంగ్రెస్(ఆర్) నుంచి, కాళోజీ నారాయణరావు ఉభయ కమ్యూనిస్టు పార్టీల నుంచి, న్యాయవాది శాంతారావు ఇందిరా కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగారు. ఈ ఎన్నికలో జలగం వెంగళరావు అత్యధిక మెజార్టీతో సత్తుపల్లి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఎమర్జెన్సీ సమయాన సీఎంగా జలగం వెంగళరావు ప్రజాస్వామ్య హక్కులకు భంగం కల్పించారనే ఆరోపణలతో అప్పటి సీనియర్ నేత చేకూరి కాశయ్య కేంద్రానికి ఫిర్యాదు చేశారు. దీంతో నాటి జనతా ప్రభుత్వం జలగం వెంగళరావుపై విచారణకు విమద్‌లాల్ కమిషన్‌ను నియమించింది. దీంతో వెంగళరావు నైతిక బాధ్యత వహిస్తూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఉపఎన్నిక అనివార్యమైంది. జ్యేష్ట వెంకటేశ్వరరావు విజయం.. 1979లో జరిగిన ఉప ఎన్నికలో జ్యేష్ట వెంకటేశ్వరరావు ఇందిరా కాంగ్రెస్ నుంచి పోటీపడగా జలగం వెంగళరావు అనుచరుడైన ఉడతనేని సత్యం ఉభయ కమ్యూనిస్టు పార్టీలు, జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థిగా పోటీ పడ్డారు. ఆ ఉప ఎన్నికలో జ్యేష్ట వెంకటేశ్వరరావు విజయం సాధించారు. అయితే, ఆయన ఎన్నికల నియమావళికి విరుద్ధంగా డబ్బు ఖర్చు పెట్టారని జలగం వెంగళరావు ముఖ్య అనుచరుడు ఒగ్గు బస్విరెడ్డి కోర్టును ఆశ్రయించటంతో విచారణకు ఆదేశాలు వచ్చాయి. ఈ విచారణ నాలుగేళ్లు సాగడంతో ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయకుండానే పదవీకాలం ముగిసిపోయింది. ఇప్పుడు కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై జలగం వెంగళరావు కుమారుడు వెంకట్రావు కోర్టును ఆశ్రయించడంతో ఎ న్ని కలకు నాలుగు నెలల ముందు ఆయనపై వేటు వేస్తూ తీర్పు వెలువడింది. ఇది కూడా చదవండి: తెలంగాణలో కాంగ్రెస్‌కు షాక్.. బీజేపీలోకి సీనియర్ నేతలు! -
పవర్ ఫుల్ సీఎం
సామాన్య వ్యక్తిగా రాజకీయ అరంగేట్రం చేసి.. దశాబ్దాల పాటు రాష్ట్రాన్ని శాసించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావుది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 6వ ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రిగా పనిచేశారాయన. ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్‌గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆయన హయాంలోనే జిల్లాలో విద్య, వైద్యం, విద్యుత్, రహదారి రంగాల్లో అభివృద్ధికి బాటలు పడ్డాయి.– మాటేటి వేణుగోపాల్, సాక్షి– ఖమ్మం జిల్లా ప్రతినిధి అప్పుడు సీటు లేదు 1957 అసెంబ్లీ ఎన్నికల్లో వెంగళరావుకు కాంగ్రెస్ పార్టీ సీటు లభించలేదు. ఆయన తమ్ముడు జలగం కొండల్రావు వేంసూరు నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలుపొందారు. ఆ తర్వాత వెంగళరావు 1962, 1967, 1972, 1978 ఎన్నికల్లో వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1984, 1989లో ఖమ్మం నియోజకవర్గం నుంచి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికైన వెంగళరావు.. ఇటు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేయడంతోపాటు కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేస్తున్న సమయంలోనే ఉమ్మడి రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా కీలక బాధ్యతలను ఆయన భుజాల మీద పెట్టింది కాంగ్రెస్ పార్టీ. అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పాలన విధానాలపై ధ్వజమెత్తిన నేత వెంగళరావు. తాను ఏ పదవిలో ఉన్నా. ఆ పదవికి వన్నె తెచ్చారు. ముఖ్యంగా జిల్లా అభివృద్ధి కోసం ఎవరినైనా ఎదిరిస్తారనే పేరు వచ్చిందాయనకు. అలాంటి జలగం రాజకీయ ప్రస్థానంలో ఒక్కటి మినహా అన్నీ విజయాలే. జడ్పీ చైర్మన్‌గా.. తొలుత ఆయన ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్‌గా 1959లో బాధ్యతలు చేపట్టగా.. ఆ తర్వాత కొద్ది కాలానికి పంచాయతీరాజ్ పరిషత్ అధ్యక్ష పదవి ఆయనను వరించింది. పంచాయతీరాజ్ సంస్థలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆకళింపు చేసుకోవడం ద్వారా గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్ల నిర్మాణం, తాగునీటి సమస్య వంటి ప్రజోపయోగ పనులను నిర్వహించడం ద్వారా ప్రజలకు చేరువయ్యారు. రాష్ట్ర హోం మంత్రిగా శాంతిభద్రతల పర్యవేక్షణతోపాటు అప్పుడున్న నక్సల్ సమస్యను సమర్థంగా ఎదుర్కొన్నారనే పేరుంది. ఒకేసారి 120 పాఠశాలలు జలగం జడ్పీ చైర్మన్ కావడానికి ముందు జిల్లాలో ఖమ్మం, మధిరలో మాత్రమే ఉన్నత పాఠశాలలుండేవి. ఆయన కృషితో ఒకేసారి 120 పాఠశాలలు ఏర్పడ్డాయి. వెంగళరావుకు అద్భుతమైన జ్ఞాపకశక్తి ఉండేది. ఒకసారి చూసిన వ్యక్తిని కానీ, విన్న, చదివిన విషయాన్ని కానీ మర్చిపోయే వారు కాదు. ఆయా విషయాలకు సంబంధించిన అంకెలను తడుముకోకుండా చెప్పేవారు. నిజాంపై పోరు.. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఆయన తిరువూరు కేంద్రంగా పోరు సలిపారు. అనేకసార్లు ఆయనపై రజాకార్ల దాడులు జరిగాయి. వెంగళరావు తిరువూరులో ఉన్న ఆయన మామ ఇంటికి తరచూ వెళ్తారనే సమాచారంతో ఒకసారి రజాకార్లు అక్కడ కూడా మాటేశారు. వెంగళరావు ఆ రోజు అక్కడికి వెళ్లకపోవడంతో రజాకార్లు ఆయన మామ మాధవరావుపై దాడి చేసి, ఆయనను హత్య చేశారు. గుమాస్తా పాఠాలు రాజకీయాల్లోకి రాకముందు కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులో పంచాయతీరాజ్ శాఖలో గుమాస్తా ఉద్యోగం చేశారు. అప్పటి అనుభవం నేర్పిన పాఠాలతో ఆయన.. పంచాయతీరాజ్ సంస్థల అభివృద్ధికి, వాటి ప్రక్షాళనకు నివేదిక తయారు చేశారు. ఇది ‘వెంగళరావు నివేదిక’గా పేరుపడింది. పంచాయతీరాజ్ పరిషత్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని ఒప్పించి తన నివేదికలోని అంశాల అమలుకు పూనుకున్నారు. అనేక పదవులు అలంకరించిన వెంగళరావు తనను వ్యతిరేకించే వారిపై కఠినంగా ఉండేవారని చెబుతారు. జలగం వెంగళరావు 1922, మే 4న శ్రీకాకుళం జిల్లా రాజాంలో జన్మించారు. 20వ ఏట ఖమ్మం జిల్లా, పెనుబల్లి మండలం బయ్యన్నగూడెం వచ్చి స్థిరపడ్డారు. నైజాం వ్యతిరేక పోరాటాన్ని ఆ ప్రాంతం నుంచే ప్రారంభించిన వెంగళరావు.. జెడ్పీ చైర్మన్‌గా, రాష్ట్ర హోం మంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా విధులు నిర్వర్తించారు. ఆ కాలంలో అభివృద్ధిలో జిల్లాను పరుగులు తీయించారు. ప్రభుత్వ ఉద్యోగులతో సన్నిహితంగా మెలిగేవారాయన. పోలీసుల సంక్షేమానికి కృషి చేసిన వ్యక్తి. -
సత్తుపల్లి నుంచి ముగ్గురు
సత్తుపల్లి: సత్తుపల్లి కేంద్రంగానే ఖమ్మం జిల్లా రాజకీయాలు నెరపటం ఆనవాయితీగా వస్తోంది. ఈ ప్రాంతం నుంచి ముగ్గురు ఎంపీగా పోటీ చేసి గెలుపొందటం కూడా విశేషం. జలగం కొండలరావు(1977–1984), జలగం వెంగళరావు(1984–1991 వరకు), పొంగులేటి శ్రీనివాసరెడ్డి(2014–2019 వరకు) ఖమ్మం ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. జలగం కొండలరావు, జలగం వెంగళరావు వరుసగా రెండు సార్లు ఖమ్మం ఎంపీగా పని చేశారు. జలగం వెంగళరావు, జలగం కొండలరావుల స్వగ్రామం పెనుబల్లి మండలం బయ్యన్నగూడెం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కల్లూరు మండలం నారాయణపురం స్వగ్రామం. రాజీవ్‌గాంధీ మంత్రివర్గంలో కేంద్ర పరిశ్రమల శాఖామంత్రిగా జలగం వెంగళరావు పని చేశారు. జలగం వెంగళరావు ముఖ్యమంత్రి, హోంమంత్రిగా పని చేసిన విషయం పాఠకులకు విదితమే. జిల్లా రాజకీయాలతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో కూడా తనదైన ముద్రవేశారు. జలగం కుటుంబానిది ప్రత్యేకస్థానం ఖమ్మం జిల్లా రాజకీయాల్లో జలగం కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. జలగం వెంగళరావు అంటే ఠక్కున గుర్తుకువచ్చేది నాగార్జునసాగర్ ఎడమకాలువ నిర్మాణం. నక్సలైట్ల ఉద్యమాన్ని కఠినంగా అణచివేశారని విమర్శలు కూడా ఉన్నాయి. పాల్వంచ, భద్రాచలంలో పరిశ్రమల స్థాపన ఆయన హయాంలోనే జరిగింది. అదీగాక జిల్లా కలెక్టర్ కార్యాలయం, జిల్లా పరిషత్ లాంటి ప్రధాన కార్యాలయాన్ని జలగం వెంగళరావు హయాంలోనే నిర్మించారు. జలగం వెంగళరావుతో పాటు ఆయన తమ్ముడు జలగం కొండలరావు, కుమారులిద్దరు జలగం ప్రసాదరావు, జలగం వెంకటరావు రాజకీయ వారసత్వాన్ని కొనసాగించారు. ప్రస్తుతం జలగం ప్రసాదరావు, జలగం వెంకటరావు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. బంగారు పళ్లెంలో.. జలగం వెంగళరావు బహిరంగ సభలంటే ఈ ప్రాంతంలో ఒక జోష్ ఉంటుంది. ఆయన మాటతీరు.. వాగ్బాణాలతో ఆకట్టుకుంటారు. 1994లో అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయ భాస్కర్‌రెడ్డిపై చేసిన విమర్శ ఇప్పటికీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గానే ఉంది. ‘ఎన్టీఆర్‌కు బంగారు పళ్లెం’లో అధికారాన్ని అప్పగిస్తారని ఖమ్మం బహిరంగ సభలో జలగం వెంగళరావు చేసిన వ్యాఖ్య రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది. అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా కూడా దక్కుకుండా పోవటంతో జలగం వెంగళరావు చేసిన వ్యాఖ్యలు నిజమయ్యాయని రాజకీయ విశ్లేషకులు అభివర్ణించారు. జగనన్న మనిషిగా వచ్చా.. పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజకీయాల్లో వేగంగా వచ్చారు. ఆయన 2014 ఎన్నికల్లో ఎక్కడికి వెళ్లినా ‘నేనమ్మా.. జగనన్న మనిషిని’ రాజశేఖర రెడ్డి గారి పార్టీ అంటూ ప్రజల్లోకి దూసుకొచ్చారు. తొలి ప్రయత్నంలోనే వైఎస్ఆర్ సీపీ నుంచి ఖమ్మం ఎంపీ అయ్యారు. మారిన రాజకీయ పరిణామాలలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎవరు కన్పించినా.. చేతులెత్తి నమస్కారం చేయటం ఆయన మేనరిజంగా చెప్పుకుంటారు. -
టీడీపీ రాకతో కాంగ్రెస్‌లోకి అష్టదరిద్రాలు
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు పెద్ద కుమారుడు జలగం ప్రసాద రావు మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ప్రసాదరావు గతంలో రెండు సార్లు సత్తుపల్లి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచారు. ఈ సందర్భంగా జలగం ప్రసాద రావు తెలంగాణా భవన్లో విలేకరులతో మాట్లాడుతూ..మహా కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రానికి నీళ్లు రావని వ్యాఖ్యానించారు. ఒకసారి ఆలోచించుకోవాలని కేటీఆర్ అడిగితే ఆలోచించి టీఆర్ఎస్లో చేరానని తెలిపారు. టీడీపీ, కాంగ్రెస్‌లో చేరటంతో అష్టదరిద్రాలు ఇక్కడికే వచ్చాయని తీవ్రంగా మండిపడ్డారు. బడుగు వర్గాల కోసమే నేను ఈ నిర్ణయం తీసుకున్నానని వెల్లడించారు. ఖమ్మం జిల్లాలో పది సీట్లు టీఆర్ఎస్ గెలిచేలా కృషి చేస్తానని మాటిచ్చారు. టీఆర్ఎస్ అభ్యర్థులు ఎవరున్నా విజయం కోసం కృషి చేస్తానని తెలిపారు. నాలుగేళ్ల క్రితమే కేటీఆర్ పార్టీలోకి ఆహ్వానించినా కొన్ని కారణాల వల్ల ఇప్పటికి కుదిరిందని వెల్లడించారు. కూటమికి ఓటేస్తే మన వేలితో మనం పొడుచుకున్నట్లే: కేటీఆర్ ఖమ్మం జిల్లా సమస్యల్ని జలగం ప్రసాద రావు తనకు వివరించారని కేటీఆర్ తెలిపారు. మన జుట్టు చంద్రబాబు నాయుడికి అందించవద్దని ప్రజలను కోరారు. చూపులు కలిసిన శుభవేళ పొత్తులు కలిశాయని వ్యాఖ్యానించారు. అమరావతి చంద్రబాబు ఆఫీసు దగ్గర తెలంగాణ కాంగ్రెస్ నేతలు తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. మహాకూటమికి ఓటు వేస్తే రైతులు చంద్రబాబు, ఆంధ్రా చుట్టూ తిరగాల్సి వస్తుందని, తెలంగాణా రైతులు తమ వేలితో తామే పొడుచుకోవాల్సి వస్తుందన్నారు. ప్రజలంతా ఆలోచించి మన హక్కుల కోసం ఓటు వేయాలని కోరారు. టీడీపీ, కాంగ్రెస్‌లకు ఓటు వేస్తే జీవన విధ్వంసం జరుగుతుందని వ్యాఖ్యానించారు. -
జలగం జయంతి వేడుకల్లో పాల్గొననున్న సీఎం కేసీఆర్
నల్గొండ(నాగార్జునసాగర్): మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళ్ రావు, గౌతమబుద్దుని జయంతి వేడుకల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పాల్గోనున్నారు. నాగార్జునసాగర్‌లో సోమవారం ఉదయం 9 గంటలకు కేసీఆర్ వీరి విగ్రహాలకు పూలమాలవేసి నివాళి అర్పించనున్నారు. అనంతరం నల్గొండ జిల్లాలో నక్కలగండితో పాటు మిగతా ప్రాజెక్టులను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించనున్నారు.