సత్తుపల్లి: ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గానికి 1979లో జరిగిన ఉపఎన్నికలో 14 వేల ఓట్ల మెజార్టీతో ఇందిరా కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన జ్యేష్ట వెంకటేశ్వరరావు అసెంబ్లీకి వెళ్లకుండానే వేటు పడింది. తాజాగా 2018 ఎన్నికల్లో కొత్తగూడెం ఎమ్మెల్యేగా గెలిచిన వనమా వెంకటేశ్వరరావుపై ఇప్పుడు వేటు పడింది. నాటి ఘటనలో మాజీ సీఎం వెంగళరావు వ్యూహాత్మకంగా వ్యవహరించగా.. ఇప్పుడు ఆయన కుమారుడు జలగం వెంకట్రావు అదే పంథాను అనుసరించడం చర్చనీయాంశంగా మారింది.
ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందంటే..
1978లో జరిగిన ఎన్నికల్లో జలగం వెంగళరావు కాంగ్రెస్(ఆర్) నుంచి, కాళోజీ నారాయణరావు ఉభయ కమ్యూనిస్టు పార్టీల నుంచి, న్యాయవాది శాంతారావు ఇందిరా కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగారు. ఈ ఎన్నికలో జలగం వెంగళరావు అత్యధిక మెజార్టీతో సత్తుపల్లి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఎమర్జెన్సీ సమయాన సీఎంగా జలగం వెంగళరావు ప్రజాస్వామ్య హక్కులకు భంగం కల్పించారనే ఆరోపణలతో అప్పటి సీనియర్ నేత చేకూరి కాశయ్య కేంద్రానికి ఫిర్యాదు చేశారు. దీంతో నాటి జనతా ప్రభుత్వం జలగం వెంగళరావుపై విచారణకు విమద్‌లాల్ కమిషన్‌ను నియమించింది. దీంతో వెంగళరావు నైతిక బాధ్యత వహిస్తూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఉపఎన్నిక అనివార్యమైంది.
జ్యేష్ట వెంకటేశ్వరరావు విజయం..
1979లో జరిగిన ఉప ఎన్నికలో జ్యేష్ట వెంకటేశ్వరరావు ఇందిరా కాంగ్రెస్ నుంచి పోటీపడగా జలగం వెంగళరావు అనుచరుడైన ఉడతనేని సత్యం ఉభయ కమ్యూనిస్టు పార్టీలు, జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థిగా పోటీ పడ్డారు. ఆ ఉప ఎన్నికలో జ్యేష్ట వెంకటేశ్వరరావు విజయం సాధించారు. అయితే, ఆయన ఎన్నికల నియమావళికి విరుద్ధంగా డబ్బు ఖర్చు పెట్టారని జలగం వెంగళరావు ముఖ్య అనుచరుడు ఒగ్గు బస్విరెడ్డి కోర్టును ఆశ్రయించటంతో విచారణకు ఆదేశాలు వచ్చాయి. ఈ విచారణ నాలుగేళ్లు సాగడంతో ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయకుండానే పదవీకాలం ముగిసిపోయింది. ఇప్పుడు కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై జలగం వెంగళరావు కుమారుడు వెంకట్రావు కోర్టును ఆశ్రయించడంతో ఎ న్ని కలకు నాలుగు నెలల ముందు ఆయనపై వేటు వేస్తూ తీర్పు వెలువడింది.
ఇది కూడా చదవండి: తెలంగాణలో కాంగ్రెస్‌కు షాక్.. బీజేపీలోకి సీనియర్ నేతలు!
Comments
Please login to add a commentAdd a comment