Jamaat ud Dawah
-
హఫీజ్ సయీద్‌కు కఠిన కారాగార శిక్ష
లాహోర్: ముంబై దాడుల్లో మాస్టర్ మైండ్, నిషేధిత జమాత్ –ఉద్–దవా(జుద్) చీఫ్, హఫీజ్ సయీద్‌కి పాక్‌లోని లాహోర్‌లో ఉన్న యాంటీ టెర్రరిస్టు కోర్టు 15 ఏళ్ల 6నెలల జైలు శిక్ష విధించింది. ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్న నాలుగు నేరాల్లో ఇప్పటికే 70 ఏళ్ళ సయీద్‌కి 21 ఏళ్ళ శిక్ష పడింది. గురువారం సయీద్ సహా జమాత్–ఉద్–దవా ఉగ్రవాద సంస్థ ఐదుగురు నాయకులకు కోర్టు పదిహేనున్నరేళ్ల జైలు శిక్ష విధించిందని కోర్టు అధికారులు తెలిపారు. సయీద్‌కి ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక తోడ్పాటునిచ్చి ప్రోత్సహిస్తున్నారన్న ఐదు నేరాల్లో కలిపి మొత్తం 36 ఏళ్ళ జైలు శిక్ష విధించారు. కాగా, 2008లో ముంబై తాజ్ హోటల్లో హఫీజ్ పెంచి పోషించిన ఉగ్రబృందం కాల్పులకు తెగబడింది. ఈ ఘటనలో 166 మంది అమాయకులు మృత్యువాత పడగా వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ మారణకాండలో మొత్తం పది మంది ఉగ్రమూకలు పాల్గొన్నాయి. ఈ కేసుకు సంబంధించి కరడుగట్టిన ఉగ్రవాది కసబ్‌కు ఇప్పటికే ఉరిశిక్ష అమలైంది. గతంలో ప్రపంచ ఉగ్రవాదిగా హఫీజ్‌ను ప్రకటించిన ఐక్యరాజ్య సమితి అతడి తల తీసుకు వస్తే 10మిలియన్ డాలర్లు బహుమతిగా ఇస్తామని పేర్కొన్న విషయం తెలిసిందే. -
రాళ్ల వర్షం కురిపిస్తే పైసలు.. పాక్ నుంచి ఆపరేట్
న్యూఢిల్లీ: కశ్మీర్లో ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు బలగాలు తీసుకునే చర్యలకు ఎలా భంగం కలుగుతుందో విశ్లేషణ చేస్తున్న ఎన్ఐఏ అధికారులకు కీలక సమాచారం తెలిసింది. జమ్ముకశ్మీర్‌లోని యువతను పాకిస్థాన్ నుంచి రెచ్చగొడుతున్నట్లు స్పష్టమైంది. కశ్మీర్ ప్రాంతంలో సోషల్ మీడియా పనిచేస్తున్న తీరును గమనించగా మొత్తం 28 వాట్సాప్ గ్రూప్‌లు కశ్మీర్ ప్రాంతంలో యాక్టివ్‌గా ఉండగా వీటిల్లో దాదాపు ఐదువేల మంది కశ్మీర్ యువత ఉన్నారని, అయితే, వీటి అడ్మినిస్ట్రేటర్లు మాత్రం పాక్‌లో ఉన్నారని, వారే వీటిని ఆపరేట్ చేస్తున్నారని గుర్తించారు. ఉగ్రవాద సంస్థ జమాత్ ఉద్ దవాహ్‌కు చెందిన వారే ఎక్కువగా ఉన్నారని, వారే కశ్మీర్ యువతను రెచ్చగొట్టే బలగాలపై రాళ్ల దాడి చేస్తున్నారని కనుగొంది. 'కశ్మీర్‌లోని వాట్సాప్ గ్రూపుల్లో పాకిస్థాన్ నెంబర్లను మేం గుర్తించాం. వీటిల్లో జమాద్ ఉద్ దవాహ్‌కు చెందిన వాళ్లున్నారు. చేయాల్సిన పనులు, రెచ్చగొట్టే నినాదాలు, ప్రచారం చేయాల్సిన అంశాలు వాటిల్లో ఉన్నాయి. దీంతో జమ్ముకశ్మీర్ కొంతమంది యువతకు జమాత్ ఉద్ దవాహ్తో సంబంధం ఉందని స్పష్టమైంది. అంతేకాదు, ఇలా రాళ్లు విసురుతున్న వారికి వేర్పాటువాద సంస్థ హుర్రియత్ కాన్ఫరెన్స్ చెల్లింపులు చేస్తోంది' అని ఎన్ఐఏ అధికారులు తెలిపారు.