రాళ్ల వర్షం కురిపిస్తే పైసలు.. పాక్ నుంచి ఆపరేట్
న్యూఢిల్లీ: కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు బలగాలు తీసుకునే చర్యలకు ఎలా భంగం కలుగుతుందో విశ్లేషణ చేస్తున్న ఎన్‌ఐఏ అధికారులకు కీలక సమాచారం తెలిసింది. జమ్ముకశ్మీర్‌లోని యువతను పాకిస్థాన్ నుంచి రెచ్చగొడుతున్నట్లు స్పష్టమైంది. కశ్మీర్ ప్రాంతంలో సోషల్ మీడియా పనిచేస్తున్న తీరును గమనించగా మొత్తం 28 వాట్సాప్ గ్రూప్‌లు కశ్మీర్ ప్రాంతంలో యాక్టివ్‌గా ఉండగా వీటిల్లో దాదాపు ఐదువేల మంది కశ్మీర్ యువత ఉన్నారని, అయితే, వీటి అడ్మినిస్ట్రేటర్లు మాత్రం పాక్‌లో ఉన్నారని, వారే వీటిని ఆపరేట్ చేస్తున్నారని గుర్తించారు.
ఉగ్రవాద సంస్థ జమాత్ ఉద్ దవాహ్‌కు చెందిన వారే ఎక్కువగా ఉన్నారని, వారే కశ్మీర్ యువతను రెచ్చగొట్టే బలగాలపై రాళ్ల దాడి చేస్తున్నారని కనుగొంది. 'కశ్మీర్‌లోని వాట్సాప్ గ్రూపుల్లో పాకిస్థాన్ నెంబర్లను మేం గుర్తించాం. వీటిల్లో జమాద్ ఉద్ దవాహ్‌కు చెందిన వాళ్లున్నారు. చేయాల్సిన పనులు, రెచ్చగొట్టే నినాదాలు, ప్రచారం చేయాల్సిన అంశాలు వాటిల్లో ఉన్నాయి. దీంతో జమ్ముకశ్మీర్ కొంతమంది యువతకు జమాత్ ఉద్ దవాహ్‌తో సంబంధం ఉందని స్పష్టమైంది. అంతేకాదు, ఇలా రాళ్లు విసురుతున్న వారికి వేర్పాటువాద సంస్థ హుర్రియత్ కాన్ఫరెన్స్ చెల్లింపులు చేస్తోంది' అని ఎన్‌ఐఏ అధికారులు తెలిపారు.