ప్రజలకు అందుబాటు ధరల్లో జనరిక్ మందులు
ప్రజలకు అందుబాటు ధరల్లో జనరిక్ మందులను అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. మార్చి 1 నుంచి 7 వరకు వారం రోజుల పాటు నిర్వహించే ‘జన్ ఔషధి సప్తాహ్’ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఈమేరకు ‘జన్ ఔషధి రథ్’లను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. 2025 చివరి నాటికి 20,000 జన్ ఔషధి కేంద్రాలను ప్రారంభించే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. 2027 నాటికి మరో 25,000 కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా మంత్రి జేపీ నడ్డా మాట్లాడుతూ..‘జన్ ఔషధి రథాలు ప్రజల్లో జన్ ఔషధి కేంద్రాల ప్రయోజనాల గురించి అవగాహన పెంచుతాయి. చౌకైన జనరిక్ మందుల ప్రాధాన్యతను తెలియజేస్తాయి. ఖరీదైన బ్రాండెడ్ మందులకు ప్రత్యామ్నాయాలు అందించాలని, ఆరోగ్య సంరక్షణ ఖర్చులను తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రధాన మంత్రి భారతీయ జన్ ఔషధి పరియోజన (పీఎంబీజేపీ)లో భాగంగా ఈ చర్యలు చేపట్టాం. ప్రధాని నాయకత్వంలో 2027 నాటికి 25,000 జన ఔషధి కేంద్రాలకు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ముందుగా 80 కేంద్రాలతో వీటిని ప్రారంభించాం. ప్రస్తుతం 15 వేల కేంద్రాలు ఉన్నాయి. ఈ ఏడాది చివరి నాటికి వీటి సంఖ్యను 20 వేలకు పెంచుతాం’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ సహాయమంత్రి అనుప్రియా పటేల్ పాల్గొని మాట్లాడారు. ‘మార్చి 1 నుంచి 7 వరకు 'జన్ ఔషధి - జన్ చేతన' వారోత్సవాలు నిర్వహిస్తున్నాం. జన్ ఔషధిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. మందులపై ప్రజలు చేసే ఖర్చును తగ్గించేందుకు ఇవి ఎంతో ఉపయోగపడుతాయి’ అని చెప్పారు.రూ.1కే శానిటరీ న్యాప్కిన్స్మహిళల నెలసరి సమయంలో ఉపయోగించే శానిటరీ ప్యాడ్స్‌ను జన్ ఔషధి కేంద్రాల్లో కేవలం రూ.1కే అందించనున్నారు. సువిధ ఆక్సో బయోడిగ్రేడబుల్ శానిటరీ న్యాప్కిన్స్ ఎంతో పరిశుభ్రమైనవని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రజల్లో విభిన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి అవగాహన కల్పించడానికి వారమంతా వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.జన్ ఔషధిప్రధాన మంత్రి భారతీయ జన ఔషధి పరియోజన (పీఎంబీజేపీ) అనేది భారత ప్రభుత్వ ఫార్మాస్యూటికల్స్ విభాగం ప్రారంభించిన ఒక కార్యక్రమం. జన ఔషధి కేంద్రాలు అనే ప్రత్యేక అవుట్లెట్ల ద్వారా ప్రజలకు సరసమైన ధరలకు నాణ్యమైన జనరిక్ మందులను అందించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశం. బ్రాండెడ్ మందుల కంటే 50%-80% చౌకగా జనరిక్ మందులను అందించడం ద్వారా ఆరోగ్య సంరక్షణ ఖర్చులను తగ్గించాలని నిర్ణయించారు. డబ్ల్యూహెచ్‌వో-జీఎంపీ గుర్తింపు కలిగిన తయారీదారుల నుంచి ఔషధాలను సేకరించి నాణ్యత, భద్రతను ధృవీకరించడం కోసం ఎన్ఏబీఎల్(నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లాబొరేటరీస్) గుర్తింపు పొందిన ప్రయోగశాలల్లో పరీక్షిస్తారు.ఇదీ చదవండి: పని గంటలా..? పని నాణ్యతా..?ఈ జన్ ఔషధి అవుట్లెట్లలో 2,000 కంటే ఎక్కువ మందులు, 300 శస్త్రచికిత్సా వస్తువులు అందుబాటులో ఉంటాయి. 2024 సెప్టెంబర్ నాటికి దేశవ్యాప్తంగా 13,822 జన ఔషధి కేంద్రాలు పనిచేస్తున్నాయని నివేదికలు చెబుతున్నాయి. ఈ కేంద్రాలను ప్రారంభించడంలో స్థానిక యువతను ప్రోత్సహించడం ద్వారా ఉపాధిని సృష్టించే అవకాశం ఏర్పడింది. ‘సుగమ్ మొబైల్ యాప్’ ద్వారా వినియోగదారులు తమ సమీపంలోని జన ఔషధి కేంద్రాలను గుర్తించవచ్చని, జనరిక్ మందుల కోసం సెర్చ్ చేయవచ్చని, బ్రాండెడ్ మందులతో ధరలను పోల్చవచ్చని ప్రభుత్వం పేర్కొంది.